వైద్య రంగంలో వారధులు పారా మెడికల్ ఫోర్స్
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:53 AM
అధునాతన వైద్య చికిత్సలో వేర్వేరు అంశాల్లో శిక్షణ పొందిన వ్యక్తులు - పారామెడికల్ సిబ్బంది డాక్టర్‌కు తోడుగా ఉంటున్నారు. ఇందులో డిగ్రీ స్థాయి కోర్సులను వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి.
అధునాతన వైద్య చికిత్సలో వేర్వేరు అంశాల్లో శిక్షణ పొందిన వ్యక్తులు - పారామెడికల్ సిబ్బంది డాక్టర్‌కు తోడుగా ఉంటున్నారు. ఇందులో డిగ్రీ స్థాయి కోర్సులను వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి. వీటిని పూర్తి చేసిన వారికి దేశ విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. బైపీసీతో ఇంటర్ చేసిన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. ఎంబీబీఎస్‌లో సీటు రానప్పటికీ మెడికల్ రంగంలోనే ఉండాలనుకునేవారికి ఇవి వరమనే చెప్పాలి.
బీఎస్సీ ఆప్తోమెట్రిక్ టెక్నాలజీ: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. మానవ శరీరంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన కళ్లకు చికిత్స అందించేందుకు దోహదపడేదే ఈ కోర్సు. దీనిని పూర్తి చేసిన వారికి ఆప్టోమెట్రిస్ట్‌గా అవకాశం లభిస్తుంది. అనుభవంతో ఆప్టోమెట్రి టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు.
బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ: రోగ నిర్ధారణలో ఈ కోర్సు పూర్తి చేసిన వ్యక్తులు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎక్సరే టెక్నీషియన్స్, ఎంఆర్‌ఐ/సిటీ స్కానర్స్‌గా ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందవచ్చు. సొంతంగా ల్యాబ్‌లు నిర్వహించవచ్చు. డయాగ్నస్టిక్ సెంటర్స్‌లోనూ స్థిరపడవచ్చు.
బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ: రోగికి శస్త్ర చికిత్స సమయంలో మత్తుమందు ఎంతో అవసరం. ఇందుకు ప్రత్యేకమైన నైపుణ్యం ఉండాలి. వాటన్నింటీనీ ఈ కోర్సులో నేర్పుతారు. ఈ కోర్సు చేసిన వారు ఆసుపత్రుల్లో ఓటీ టెక్నీషియన్స్‌గా చేరవచ్చు. అనుభవం సంపాదించుకున్న తదుపరి అనస్థీషియా టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు.
బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ: మానవుడి గుండె సంబంధిత రక్తనాళాల పనితీరు వంటివి బోధిస్తారు. ఈ కోర్సు తరవాత ఆసుపత్రుల్లో ఓటీ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించవచ్చు. తగు అనుభవంతో కార్డియాలజీ టెక్నీషియన్స్, క్యాత్ ల్యాబ్ విభాగంలో ఉద్యోగులుగా అవకాశాలు ఉంటాయి.
బీఎస్సీ పెర్‌ఫ్యూజన్ టెక్నాలజీ: గుండెకు సంబంధించిన వ్యాధులను అరికట్టడం, చికిత్స విధానం ఈ కోర్సులో భాగం. దీంతో సర్జన్ అసిస్టెంట్స్, ఓటీ టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు.
బీఎస్సీ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ: రక్తాన్ని శుద్ధి చేయడం కిడ్నీల విధి. కిడ్నీల పనితీరులో ఏదైనా ఇబ్బంది ఏర్పడిన వ్యక్తికి డయాలసిస్ చేయాలి. మన దేశంలో చాలామంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ చికిత్సను నిపుణులైన వారి పర్యవేక్షణలోనే చేయాలి. అందుకే ఈ కోర్సు చేసిన వారికి డిమాండ్ బాగుంది. తగు అనుభవంతో సొంతంగా ల్యాబ్ నిర్వహించుకోవచ్చు.
బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ: క్లిష్టమైన వైద్య పరిస్థితుల్లో ప్రభావవంతంగా స్పందించేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఎమర్జెన్సీ సమయాల్లో వైద్యులకు సహకరించే ఉద్యోగులుగా పని చేసే అవకాశం లభిస్తుంది.
బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ: రెస్పిరేటరీ, కార్డియో పల్మనరీ డిజార్డర్స్ ఉన్న రోగులకు చికిత్సలో వీరు సహకరిస్తారు. శ్వాసకోశ అనాటమీ, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్, మెకానికల్ వెంటిలేషన్ తదితర అంశాలను కవర్ చేస్తుంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్‌గా మంచి కెరీర్ వీరి సొంతం.
బీఎస్సీ ట్రాన్స్‌ఫ్యూజన్ టెక్నాలజీ: బ్లడ్ బ్యాంక్‌లు, ఆసుపత్రులు, పరిశోధన సంస్థల్లో పని చేయడానికి అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలు అందించే కోర్సు. బ్లడ్ టెక్నాలజీ, క్లినికల్ ప్రాక్టీసెస్, సేఫ్టీ ప్రోటోకాల్స్ తదితరాలను వివరిస్తారు. ఆసుపత్రుల నుంచి వివిధ రక్త నిధి-మార్పిడి కేంద్రాల్లో ఈ గ్రాడ్యుయేట్లు పనిచేయవచ్చు.
బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్: వైద్య రంగంలో ఇదొక శాఖ. ప్రత్యేక రోగుల సమస్యను గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, పరీక్ష నివేదికలను వివరించడం, చిన్నపాటి గాయాలైన రోగులకు చికిత్స చేయడం వంటి పనులను ఫిజీషియన్ అసిస్టెంట్ నిర్వర్తించాలి. మెడికల్ అసిస్టెంట్, డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ తదితర పోస్టులు లభిస్తాయి.
బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ: అయోనైజింగ్ రేడియేషన్‌ను ఉపయోగించి కణాల జన్యు పదార్థాన్ని దెబ్బతీయడం ఈ చికిత్సలో భాగం. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. గ్రాడ్యుయేషన్ తరవాత అధునాతన డిగ్రీలను చేయవచ్చు. మెడికల్ ఇమేజింగ్ సాంకేతిక నిపుణులు, రేడియేషన్ థెరపి్‌స్టలు లేదా చర్మవ్యాధి నిపుణులు కావచ్చు.
బీఎస్సీ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ: ఆసుపత్రిని సజావుగా నిర్వహించడంలో మెడికల్ రికార్డ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోగుల చికిత్స - సంరక్షణ వైద్య రికార్డులు ఉపయోగపడతాయి. ప్రైవేటు, ప్రభుత్వ అసుపత్రులన్నింటిలో వీరికి అవకాశాలు ఉంటాయి.
బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ: ఏయే వ్యాఽధులతో బాధపడుతున్నారో, అందుకు కారణాలు ఏమిటో తెలిపేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో వీరిది కీలక పాత్ర . ఈ కోర్సు పూర్తి చేసిన వారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు.
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ: ఏదైనా ప్రమాదాలు లేదా వృద్ధాప్యంతో శరీర భాగాల కదలికలో ఇబ్బందులు ఏర్పడితే ఫిజియోథెరపిస్టుల సేవలు అవసరమవుతాయి. ఎముకలు విరిగినా, పక్కకు జరిగినా, దెబ్బలు తగిలినా ఈ చికిత్స ద్వారా సరి చేయవచ్చు. సంబంధిత సర్జరీల తరవాత కూడా వీరి సేవలు మరింత అవసరమవుతాయి. ఫిజియోథెరపిస్టులకు ఎంతో డిమాండ్ ఉంది. మంచి జీతభత్యాలు అందుతాయి. సొంతంగా ఆసుపత్రిని నిర్వహించుకోవచ్చు.
- చిట్టూరి నాగేశ్వరరావు,
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బొల్లినేని మెడ్‌స్కిల్స్
బీఎస్సీ న్యూరో ఫిజియోలజీ టెక్నాలజీ: నరాల సంబంధిత వ్యాధుల చికిత్స, రోగి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు తోడు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోర్సులో భాగం. ఈ కోర్సు చదివిన వారు ఆసుపత్రుల్లో న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషీయన్స్, న్యూరాలజిస్టులకు సహాయకులుగా సేవలు అందించవచ్చు. సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు.