నీట్ ప్రిపరేషన్
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:55 AM
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, డెంటిస్ట్రీ, ఆయుష్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష నీట్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ..
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, డెంటిస్ట్రీ, ఆయుష్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష నీట్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. నీట్‌కు పూర్తి రూపం-నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్ టెస్ట్. అర్హులైన అభ్యర్థులు మార్చి 8 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్లు పరిమితం కాగా ఇరవై లక్షలకు మించి అభ్యర్థులు ఈ టెస్ట్‌కు పోటీపడతారు. ఫలితంగా పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇటు ఇంటర్ పరీక్షలను బ్యాలెన్స్ చేసుకుంటూ నీట్‌కు జాగ్రత్తగా సన్నద్ధమైతే అఖిల భారత స్థాయిలో మంచి ర్యాంకు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రిపరేషన్‌లో భాగంగా...
మార్చి రెండో వారం పూర్తయ్యేలోపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి. నీట్ మే 3న జరుగుతుంది. అంటే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక దాదాపు 50 రోజుల వ్యవధి ఉంటుంది.
సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఇప్పటికే ల్యాబ్ పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటర్ రెండో ఏడాది పరీక్షలకు ప్రిపరేషన్ ఆరంభించి ఉంటారు. రెండో ఏడాదికి చెందిన బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఐపీఈ ప్రశ్నలకు సమాధానాలు ఒకవైపు నేర్చుకుంటూనే, దానికి సమాంతరంగా ఆ సబ్జెక్టుల్లోని కాన్సెప్టులపై షార్ట్ నోట్స్ రాసుకోవాలి.
బాటనీ, జువాలజీలో ముఖ్యమైన స్టేట్‌మెంట్స్ అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీలోని ముఖ్యమైన ఫార్ములాలు, రియాక్షన్స్‌కి ప్రత్యేకించి నోట్స్‌ను రూపొందించుకోవాలి.
కేవలం గైడ్స్ లేదంటే స్టడీ మెటీరియల్ మీద ఆధారపడకూడదు. ఎన్‌సీఈఆర్‌టీ, ఐపీఈ పుస్తకాలను లోతుగా చదవాలి. ఫలితంగా వివిధ కాన్సెప్టులపై పట్టు సాధ్యమవుతుంది.
ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై పట్టుపోకుండా ఉండేందుకు ఇంటర్ పరీక్షలకు కోసం ఏ టాపిక్ లేదంటే చాప్టర్ చదివారో, దానిలో అయిదు నుంచి పది ఆబ్జెక్టివ్ ప్రాబ్లెమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
గతేడాది నీట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. అందువల్ల ఆ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బయాలజీ స్కోరింగ్ సబ్జెక్టు. అయినప్పటికీ నీట్‌లో ఆలిండియా ర్యాంకు పొందాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలోనూ బాగా స్కోర్ చేయాలి.
ఫిజిక్స్‌లో ప్రత్యేకించి మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మేగ్నటిజమ్, మోడ్రన్ ఫిజిక్స్ మీద దృష్టి పెట్టాలి. ఫార్ములా సబ్‌స్టిట్యూషన్, యూనిట్ కన్వర్షన్, స్టెప్‌వైజ్ సాల్వింగ్ ప్రాక్టీస్ చేయాలి.
కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి జీఓసీ, ఐసోమెరిజమ్, రియాక్షన్ మెకానిజమ్, పీఓసీ; ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్; ఫిజికల్ కెమిస్ట్రీలో ఆటమిక్ స్ట్రక్చర్, మోల్ కాన్సెప్ట్, ఈక్విలిబ్రియమ్, సొల్యూషన్స్ వంటి చాప్టర్లపై ఎక్కువ దృష్టి సారించాలి. రియాక్షన్స్ అలాగే ముఖ్యమైన ఫార్ములాలకు సంబంధించి విడిగా నోట్స్ రాసుకోవాలి.
ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక, గడచిన అయిదేళ్ళ వెయిటేజ్ ఆధారంగా ఏ చాప్టర్లు, టాపిక్స్ ముఖ్యమో గుర్తించాలి. వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి.
ఇంటర్ పరీక్షల తరవాత సాధ్యమైనన్ని మాక్ టెస్ట్‌లకు హాజరుకావాలి. ప్రత్యేకించి ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రాక్టీస్ పేపర్స్‌ను అటెంప్ట్ చేయాలి. గెస్ వర్క్‌ని అస్సలు చేయవద్దు. మాక్ టెస్టులు ఒకదాని తరవాత మరొకటి రాసేటప్పుడు మిస్టేక్స్‌ను తగ్గించుకుంటూ వెళితే మంచిది. తప్పులకు సంబంధించి ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుని సవరించుకోవాలి. వాటిని ప్రాథమిక స్థాయి నుంచి మరొకసారి నేర్చుకుంటే ఆ పొరపాట్లు మళ్ళీ చోటుచేసుకోవని గుర్తించాలి. అలా పద్ధతిగా ప్రాక్టీస్ చేస్తే విజయం నల్లేరుపై బండి నడక అవుతుందనటంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.

-డాక్టర్ పవన్ కుమార్ కాసు
ఎక్స్‌లెన్సియా, హైదరాబాద్