నీట్ పదునైన వ్యూహంతో పక్కా ఫలితం సాధ్యం
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:44 AM
ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక విద్యార్థుల దృష్టి అంతా ప్రవేశ పరీక్షలపైనే. మెడిసిన్, డెంటిస్ట్రీ తదితర కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష నీట్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ దీని పూర్తి స్వరూపం.
ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక విద్యార్థుల దృష్టి అంతా ప్రవేశ పరీక్షలపైనే. మెడిసిన్, డెంటిస్ట్రీ తదితర కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష నీట్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ దీని పూర్తి స్వరూపం. మే 3న జరుగనుంది. రమారమి అయిదు వారాల వ్యవధి ఉంది. సీట్లు వేలల్లో ఉంటే ఈ టెస్ట్ రాసే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంది. ఆ నేపథ్యంలో నీట్ కోసం ఇప్పటి వరకు సాగించిన ప్రిపరేషన్ ఒక ఎత్తు. ఇప్పటి నుంచి కొనసాగించే కసరత్తు మరొక ఎత్తు. టెస్ట్‌లో అడిగే సబ్జెక్టులో ఎవరికి వారు తమ వ్యక్తిగత సామర్థ్యాలను కూడా గుర్తుంచుకుని, ఒక పద్ధతి ప్రకారం ప్రిపేరైతే మంచి స్కోర్‌కు తోడు సీటు పొందే అవకాశం ఉంటుంది.
నీట్ ఏడాదికేడాది కఠినంగా మారుతోంది. కొవిడ్ తరవాతి సంవత్సరం నుంచి ఈ పరిణామం కనిపిస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే 2024తో పోలిస్తే 2025లో అడిగిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. 2024 వరకు ఇచ్చిన ప్రశ్నలు సులువు నుంచి మోడరేట్‌గా ఉండేవి. 2025లో అవి మోడరేట్ నుంచి కష్టంగా ఉన్నాయి. నీట్ తీరు క్రమంగా మారుతోందనడానికి ఇదో ఉదాహరణ. 2025 నీట్‌లో సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉంది. కాలిక్యులేషన్స్‌కు ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీ పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ ఆధారితం. బయాలజీ సులువుగా ఉన్నప్పటికీ వాడిన పదాలు కొత్తగా, క్లిష్టంగా ఉన్నాయి. ఈ కారణంగానే 2024తో పోల్చుకుంటే 2025లో కటాఫ్ తక్కువగా ఉంది.
మారుతున్న సరళి
నీట్‌లో అడిగే ప్రశ్నల సరళి, ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విజయం సాధించవచ్చని అర్థమవుతుంది. మారుతున్న సరళిని గమనిస్తే...
గత ఏడాదే తీసుకుంటే ఫిజిక్స్‌లో అడిగే ప్రశ్నలు కఠినంగా ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ మోడ్రన్ ఫిజిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్ నుంచి అడిగిన ప్రశ్నలు కొద్దిగా సులువుగానే ఉన్నాయి. మెకానిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ మేగ్నటిజమ్‌లో ప్రశ్నలను మల్టీ-స్టెప్ థింకింగా ఆధారంగా అడిగారు. అందుకని అటెంప్ట్ చేసే ముందు ప్రశ్నలను విశ్లేషించుకోవాలి. సులువుగా - కాలిక్యులేషన్స్ తక్కువగా ఉన్న వాటిని అలాగే ఫార్ములా సబ్‌స్టిట్యూట్ ఆధారిత ప్రశ్నలను మొదట అటెంప్ట్ చేయాలి. స్టేట్‌మెంట్ ఆధారిత కాన్సెప్ట్యుయల్ ప్రశ్నలను కచ్చితంగా చేయాలి. దీంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
కెమిస్ట్రీలో ప్రశ్నలు చాలా వరకు ఎన్‌సీఈఆర్‌టీ స్టేట్‌మెంట్స్ ఆధారంగానే ఉంటున్నాయి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 90 శాతం ప్రశ్నలను నేరుగానే అడుగుతున్నారు. కెమిస్ట్రీ నుంచి మెమరీ ఆధారితం కాకుండా మెకానిజమ్ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువ వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎప్పటిమాదిరిగానే ఫార్ములా సబ్‌స్టిట్యూషన్ - కాలిక్యులేషన్ ఆధారిత ప్రశ్నలే అడిగారు. ఈ కారణంగా ఎన్‌సీఈఆర్‌టీ ఆధారంగా ప్రిపరేషన్ సాగించడం మంచిది. అసర్షన్ అండ్ రీజన్, స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
మిగిలిన రెంటితో పోల్చుకుంటే బయాలజీ సులువు. అయితే కొన్ని పదాలు, స్టేట్‌మెంట్స్‌ను ట్రికీగా అడుగుతున్నారు. అందువల్ల ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలను జల్లెడపట్టాలి. కొన్ని అయోమయంలోకి నెట్టేవిధంగానూ అనిపిస్తున్నాయి. అంటే ఆప్షన్స్ మధ్య సారూప్యత ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా రాంగ్ ఆప్షన్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. నిజానికి ఈ సబ్జెక్టులో విద్యార్థులు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అయితే మిస్‌లీడింగ్/ మిస్ రీడింగ్‌తో మార్కులు పోగొట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
నీట్‌లో ఒక ప్రశ్నను ఒక నిమిషంలో పూర్తి చేయాలి. టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం. అందుకే ముందుగా సులువైన వాటి పనిపట్టాలి. ఒకవేళ కాలిక్యులేషన్స్‌కు టైమ్ ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తే, తదుపరి ప్రశ్నకు షిప్ట్ కావడం ఉత్తమం. ముందు బయాలజీ తదుపరి కెమిస్ట్రీ, ఆపై ఫిజిక్స్ అటెంప్ట్ చేస్తే చాలా మంచిది.
ఇంటర్ పరీక్షలు ఇటీవలే రాసినందున ముందు సెకండియర్ చాప్టర్లను రివైజ్ చేయండి. తదుపరి ఫస్టియర్ రివైజ్ చేసుకోవచ్చు. మీరు బలంగా ఉన్న ముఖ్యమైన చాప్టర్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
సాధ్యమైనన్ని మాక్ టెస్టులు రాయాలి. ముందు పార్ట్ టెస్ట్‌లు రాయాలి. తదుపరి ఫుల్ టెస్ట్‌లు అంటే ఏప్రిల్ రెండో వారం నుంచి మొదలుపెట్టాలి. ప్రతి రోజు ఒక మాక్ టెస్ట్ తప్పనిసరిగా రాయాలి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో ఉన్న అన్ని మాక్ టెస్ట్‌లకు అటెండ్ కావాలి. ఈ పరీక్షలో గెస్ వర్క్ అస్సలు చేయవద్దు. ప్రతి పరీక్ష తరవాత, అలాగే ప్రతి రెంటి మధ్య పర్ఫార్మెన్స్‌ని విశ్లేషించుకోవాలి. కాన్సెప్ట్యుయల్ తప్పులు, ఎక్కువ సమయం తీసుకోవడం, ఓవర్‌లుకింగ్, మిస్‌లీడ్, మిస్ రీడ్ వంటివి చాలా దొర్లుతూ ఉంటాయి. వాటన్నింటినీ ఈ మాక్ టెస్టుల సమయంలోనే అధిగమించే ప్రయత్నం చేయాలి. అసలు అలాంటివి ఎన్నిసార్లు జరుగుతున్నాయన్నది కూడా అంచనా వేసుకుని వాటి నుంచి బైటపడే ప్రయత్నం చేయాలి.
మాక్ టెస్ట్ రాసిన తరవాత కాన్సెప్ట్ విషయంలో స్పష్టత లేకుంటే మీ టీచర్ దగ్గరకు వెళ్ళి అడగండి. పూర్తిగా క్లారిటీ తెచ్చుకోండి. నీట్‌కు సంబంధించి గడిచిన అయిదేళ్ళ ప్రశ్నపత్రాలను సాల్వ్ చేయండి. కాన్సె్‌ప్టపరంగా కలిగే సందేహాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి.