Share News

ఎనిమిదో తరగతి పుస్తకంలో..న్యాయవ్యవస్థ అవినీతి!

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:50 AM

న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో పొందుపరచింది. న్యాయవ్యవస్థలో అవినీతి, భారీగా పెండింగ్‌ కేసులు, న్యాయాధికారులు/న్యాయమూర్తుల కొరతను కూడా అందులో.....

ఎనిమిదో తరగతి పుస్తకంలో..న్యాయవ్యవస్థ అవినీతి!

  • పెండింగ్‌ కేసులు, జడ్జీల కొరత కూడా

  • సాంఘిక శాస్త్రంలో చేర్చిన ఎన్‌సీఈఆర్‌టీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో పొందుపరచింది. న్యాయవ్యవస్థలో అవినీతి, భారీగా పెండింగ్‌ కేసులు, న్యాయాధికారులు/న్యాయమూర్తుల కొరతను కూడా అందులో ప్రస్తావించింది. ‘మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర’ పేరుతో సవరించిన అధ్యాయాన్ని చేర్చింది. గత సంచికల్లో న్యాయవ్యవస్థ, కోర్టుల పాత్ర వరకే పరిమితం కాగా.. సోమవారం విడుదల చేసిన నూతన పాఠ్యపుస్తకంలో కోర్టుల వ్యవస్థ, న్యాయం ఎంతవరకు అందుతోంది.. అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. అందులోని ఓ అధ్యాయంలో.. న్యాయవ్యవస్థలో అవినీతి, ఆర్థికంగా బలహీన వర్గాలకు న్యాయం అందించడంలో దాని ప్రభావం గురించి వివరించారు. పెండింగ్‌ కేసులను ప్రస్తావిస్తూ.. సుప్రీంకోర్టులో 81 వేల కేసులు, వివిధ హైకోర్టుల్లో 62.40 లక్షలు, జిల్లాలు, సబార్డినేట్‌ కోర్టుల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పుస్తకంలో పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో ఉన్న జవాబుదారీ యంత్రాంగాల గురించీ ప్రస్తావించారు. ఈ వ్యవస్థలోని సమస్యలపై సెంట్రలైజ్డ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్‌ అండ్‌ మానిటరింగ్‌ వ్యవస్థ (సీపీజీఆర్‌ఏఎంఎస్‌) ద్వారా ఫిర్యాదు చేయొచ్చని.. దీని ద్వారా 2017-21 మధ్య 1,600 కంప్లయింట్లు అందాయని తెలిపింది. అవినీతి, దుష్ప్రవర్తన.. న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ గత ఏడాది జూలైలో చేసిన ప్రసంగాన్ని కూడా సదరు అధ్యాయంలో పొందుపరిచారు.


కాంగ్రెస్‌ నేతలు దేశ విభజనే పరిష్కారమనుకున్నారు!

‘ఎక్స్‌ప్లోరింగ్‌ సొసైటీ: ఇండియా అండ్‌ బియాండ్‌ (పార్ట్‌2) అనే ఈ కొత్త పాఠ్యపుస్తకంలో ‘ఇండియాస్‌ లాంగ్‌ రోడ్‌ టూ ఇండిపెండెన్స్‌’ అనే అధ్యాయం చేర్చారు. ఇందులో మహాత్మాగాంధీ, పలువురు కాంగ్రెస్‌ నేతలు 1947లో దేశ విభజన భావననే తీవ్రంగా వ్యతిరేకించారని.. భారతీయ ముస్లింలలో అత్యధికులు కూడా ఈ ఆలోచనకు అంగీకరించలేదని.. అయితే కాంగ్రెస్‌ నేతలు చివరకు దేశ విభజన ఒక్కటే సమస్యకు పరిష్కార మార్గమని తుది నిర్ణయానికి వచ్చారని తెలిపారు. 1857 తిరుగుబాటు నుంచి 1947 వరకు.. స్వాతంత్ర్యోద్యమం, బెంగాల్‌ విభజన, దేశవిభజన గురించి విశదీకరించారు. గాంధీజీ, ఆయన అహింసా సిద్ధాంతం, కాంగ్రెస్‌ విధానాల వల్లే వాళ్లు వెళ్లిపోయారని మొదట్లో అనుకునేవారని.. అయితే ఇతరత్రా చాలా కారణాలున్నట్లు తర్వాత గుర్తించారని వెల్లడించారు. ‘జనరంజక ఉద్యమాలు, విప్లవకారుల దాడులు, రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌, రాయల్‌ ఇండియన్‌ నేవీల్లో తిరుగుబాట్లు వీటిలో ఉన్నాయి. అంతేగాక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌ స్థాయి మసకబారింది. ప్రపంచమంతటా వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి. సామ్రాజ్యాల శకం అంతరించింది’ అని సదరు అధ్యాయంలో తెలిపారు. బంకించంద్ర చటోపాధ్యాయ రాసిన ‘వందేమాతరం’ గేయంలో మొదటి రెండు చరణాలను ప్రస్తావించారు. ముస్లింలీగ్‌ చేపట్టిన ప్రత్యక్ష కార్యాచరణ దినం, కలకత్తాలో హింస గురించి పొందుపర్చారు. ఒడిసాలో రైతుల విప్లవం ‘పాయికా సంగ్రామం’పైనా ఓ అధ్యాయాన్ని చేర్చారు.

Updated Date - Feb 25 , 2026 | 12:50 AM