క్యాట్‌లో మంచి పర్సంటైల్ రాకున్నా మేనేజ్‌మెంట్‌కు మార్గాలెన్నో!
ABN , Publish Date - Feb 23 , 2026 | 03:15 AM
క్యాట్‌లో మంచి పర్సంటైల్ రానంత మాత్రాన మేనేజ్‌మెంట్ చదువుకు ఫుల్‌స్టాప్ పడినట్లు కాదు. నిజానికి క్యాట్ చుట్టూ కట్టుదిట్టమైన కథలను మనకు మనమే అల్లుకున్నాం.
క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్)లో మంచి పర్సంటైల్ రాకుంటే మేనేజ్‌మెంట్ కోర్సులు చేసేందుకు ప్రత్యామ్నాయం లేదని అర్థం కాదు. మేనేజ్‌మెంట్ చేయాలనుకునే వారికి క్యాట్ చుట్టూ అనేకానేక భ్రమలు ఉన్నాయి. అయితే అవన్నీ నిజం కావని, మేనేజ్‌మెంట్ కోర్సు చేసేందుకు మరిన్ని మార్గాలు ఉన్నాయని భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కల్పనా సాహు చెబుతున్నారు. అవేమిటో ఒకసారి పరిశీలిద్దాం.
క్యాట్‌లో మంచి పర్సంటైల్ రానంత మాత్రాన మేనేజ్‌మెంట్ చదువుకు ఫుల్‌స్టాప్ పడినట్లు కాదు. నిజానికి క్యాట్ చుట్టూ కట్టుదిట్టమైన కథలను మనకు మనమే అల్లుకున్నాం. ఇందులో ఏమంత వాస్తవం లేదు. సంబంధిత నైపుణ్యాలు, అనువర్తన, అనుభవం, నిరంతర అధ్యయనంతో మాత్రమే మేనేజ్‌మెంట్ కెరీర్ ఒక రూపుదిద్దుకుంటుంది. అంతేతప్ప ఒక పరీక్షలో సాధించిన స్కోర్ ఒక్కటి మాత్రమే కెరీర్‌పై ప్రభావం చూపలేదు. సందేహం లేదు, క్యాట్‌లో సాధించిన మెరుగైన పర్సంటైల్‌తో ఐఐఎం వంటి సుప్రసిద్ధ మేనేజ్‌మెంట్ సంస్థల్లో చేరేందుకు మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. అయితే అది రానిపక్షంలో అంతకు తగ్గట్టు ఉన్న ప్రత్యామ్నాయాల్లో మనకు అనువైనది ఎంచుకోవచ్చు. మేనేజ్‌మెంట్ అనేది ఒక విస్తృత రంగం.
క్యాట్ స్థాయిలో పలు ప్రామాణిక మేనేజ్‌మెంట్ ఎంట్రెన్స్ టెస్టులు ఉన్నాయి. వాటిలో సాధించిన ర్యాంకుతో మన దేశంలోనే వివిధ ప్రతిష్ఠాత్మక బిజినెస్ స్కూల్స్‌లో చేరవచ్చు. ఎక్స్‌ఏటీ(జాట్), సీఎంఏటీ(సీమ్యాట్), ఎన్‌ఎంఏటీ(ఎన్‌మ్యాట్), ఎస్‌ఎన్‌ఏపీ(స్నాప్), మ్యాట్, ఏటీఎంఏ(ఆత్మా), జీమ్యాట్ వంటి టెస్టుల్లో సాధించిన ర్యాంకులను పేరొందిన ప్రైవేట్, డీమ్డ్, యూనివర్సిటీ అనుబంధ బిజినెస్ స్కూల్స్ ఆమోదిస్తాయి.
ఈ పరీక్షల స్ట్రక్చర్ వేర్వేరుగా ఉంటుంది. కష్టస్థాయి నుంచి మూల్యాంకన చేసే విధానం వరకు కొద్దిపాటి తేడాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఎక్స్‌ఏటీని తీసుకుంటే డెసిషన్ మేకింగ్, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ విలువనిస్తుంది. ఇవి కాకుండా ప్రతి రాష్ట్రంలో లోకల్ స్థాయిలో మేనేజ్‌మెంట్ టెస్టులు ఎలాగూ ఉన్నాయి. అవి కూడా యూనివర్సిటీ కాలేజీల నుంచి ఆ రాష్ట్రంలో ఉండే ప్రతిష్ఠాత్మక ప్రైవేటు కాలేజీల్లో చేరేందుకు వెసులుబాటు కల్పిస్తాయి. అందులో కొన్ని సంస్థలకు స్థానిక పరిశ్రమలతో మెరుగైన సంబంధాలు కూడా ఉంటాయి. వాటి నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్లు కూడా విజయవంతమైన మేనేజర్లుగా కొనసాగుతుండటమే కాకుండా మంచి అలూమ్నీలు కూడా ఆ కాలేజీలకు ఉంటున్నాయి.
మన దేశంలోని పలు యూనివర్సిటీలు స్పెషలైజ్డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. ఇందులో స్టేట్, సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవి ఎంబీఏ కోర్సును అందిస్తుంటాయి. తమదైన అడ్మిషన్ ప్రాసెస్ కూడా వాటికి ఉంటుంది. ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూలు, అకడమిక్ పర్ఫార్మెన్స్ లేదా పనిఅనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని మరీ చేర్చుకుంటాయి. హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, రూరల్ మేనేజ్‌మెంట్, అగ్రిబిజినెస్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సస్టయినబిలిటీ, అనలిటిక్స్, టూరిజమ్ మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తున్నాయి. వీటిలో కొన్ని కోర్సులు - పరిశ్రమలకు అవసరమైన విధంగా రూపుదిద్దుకుని ఉంటాయి. సదరు పరిశ్రమలు ఈ గ్రాడ్యుయేట్లకు అవకాశాలూ కల్పిస్తుంటాయి. అలా జనరల్ ఎంబీఏ కంటే మంచి అవకాశాలను ఆ కోర్సులు చేసిన విద్యార్థులు పొందవచ్చు.
ఇంటిగ్రేటెడ్ అలాగే ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఎంట్రీ పాయింట్స్ కూడా వీటికి వేరుగా ఉంటాయి. అందులో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏను ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులకు అందిస్తారు. ఈ కోర్సులో చేరితే సమయమూ ఆదా అవుతుంది. త్వరగా ప్రొఫెషన్‌లో చేరవచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించినది ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ. ఈ కోర్సుల్లో ప్రత్యేకించి ప్రాక్టికల్ అప్లికేషన్, నాయకత్వ అభివృద్ధి, సహచరులతో కలిసి పనిచేయడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తాయి. ఇక్కడ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో సాధించిన ఘనత ఒక్కటే ప్రాముఖ్యం వహించదు. వృత్తిలో మరింత పురోగతి కోసం ఫుల్ టైమ్ ఎంబీఏ కంటే ఇలాంటి కోర్సులకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రాధాన్యం ఇస్తుంటారు.
మేనేజ్‌మెంట్ డొమైన్స్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్, డిప్లొమాలు మరొకటి. సంప్రదాయ ఎంబీఏ కోర్సులకు మించినవి కూడా ఇవి. కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. ప్రొజెక్ట్ మేనేజ్‌మెంట్(పీఎంపీ ప్రిన్స్ 2), హ్యూమన్ రిసోర్సె్‌స(ఎ్‌సహెచ్‌ఆర్‌ఎం, సీఐపీడీ), ఫైనాన్స్(సీఎ్‌ఫఏ, ఎఫ్‌ఆర్‌ఎం, సీపీఏ), మార్కెటింగ్(డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ అనలిటిక్స్), సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికేషన్స్‌కు ఎంప్లాయిర్స్ చాలా విలువనిస్తారు. రియల్ వరల్డ్ ప్రాబ్లెమ్ సాల్వింగ్‌కు తోడు పరిశ్రమలకు అనువైన కోర్సులు ఇవి. సంస్థలో పలు హోదాల్లో పనులు చేసేందుకు అకడమిక్ డిగ్రీల కంటే ఇవి ఎంతో మేలు చేస్తాయి.
చివరాఖరుగా ఒక్క విషయం, మేనేజ్‌మెంట్ అనేది ఒక విస్తృత డిసిప్లిన్. వ్యక్తుల సామర్థ్యం, తెలివితేటలు, నేర్చుకున్న విధానం, సాధించిన అనుభవం, పరిణతి తదితరాలన్నీ ఒక వ్యక్తిని మంచి మేనేజర్‌గా నిలబెడతాయని తెలుసుకోవాలి. లక్ష్యంలో స్పష్టత, నేర్చుకోవాలన్న ఉత్సుకత, అనువర్తన, నిరంతరం కష్టపడటంతో విజయం సాధించగలమని ఎవరైనా బలంగా నమ్ముకోవాలి.
పని అనుభవంతో మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను నేర్చుకోవడం కూడా ఒక పద్ధతే. ఎంట్రీ లెవెల్‌లో చేరిన చాలా మంది, పనిలో భాగంగా సాధించిన నైపుణ్యం, అనుభవంతో మేనేజ్‌మెంట్‌లో కీలకమైన పదవులను సాధిస్తూ ఉంటారు. సేల్స్, ఆపరేషన్స్, హాస్పిటాలటీ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, స్టార్టప్స్, ఎన్జీవోలు, ఫ్యామిలీ బిజినె్‌సలో వీరు ఎక్కువగా రాణిస్తుంటారు. సంప్రదాయ పద్ధతులు లేదా వ్యవస్థలోనే వీరు మేనేజ్‌మెంట్ వ్యవహారాలను సునిశితంగా, చాలా బాగా నేర్చుకుంటారు. పీపుల్ మేనేజ్‌మెంట్ నుంచి డెసిషన్ మేకింగ్, కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్, పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ వరకు తరగతి గదుల్లో నేర్చుకోవడానికి మించి తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీరే పటిష్టమైన మేనేజర్లుగానూ అవతరిస్తారు.