సౌర తుఫాన్లను మూడేళ్ల ముందే పసిగట్టే 3డీ మోడల్
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:51 AM
సూర్యుని అంతర్భాగంలో జరిగే అయస్కాంత మార్పులను అంచనా వేసే మొట్టమొదటి త్రీడీ డేటా డ్రివెన్ మోడల్‌ను ఐఐటీ కాన్పూర్‌కు చెందిన గోపాల్ హజ్రా, సౌమ్యదీప్ చటర్జీ అనే ఇద్దరు పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ప్రపంచంలోనే మొట్టమొదటిది..
ఐఐటీ కాన్పూర్ శాస్త్రజ్ఞుల ఘనత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: సూర్యుని అంతర్భాగంలో జరిగే అయస్కాంత మార్పులను అంచనా వేసే మొట్టమొదటి త్రీడీ డేటా డ్రివెన్ మోడల్‌ను ఐఐటీ కాన్పూర్‌కు చెందిన గోపాల్ హజ్రా, సౌమ్యదీప్ చటర్జీ అనే ఇద్దరు పరిశోధకులు అభివృద్ధి చేశారు. సూర్యుని ఉపరితలంపై కనిపించే మచ్చల ద్వారా.. ఇది సౌరతుఫానుల రాకను మూడేళ్ల ముందే, సౌర కార్యకలాపాలను ఐదేళ్ల ముందే కచ్చితంగా అంచనా వేయగలదు. దీనివల్ల.. జీపీఎస్, రేడియో సమాచార వ్యవస్థలు, పవర్ గ్రిడ్లు, అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడడానికి వీలైనంత సమయం లభిస్తుంది. మన ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 వంటి సౌర మిషన్లకు, భవిష్యత్తులో చేపట్టే ఇతర అంతరిక్ష ప్రాజెక్టులకు కూడా ఈ మోడల్ ఇచ్చే సమాచారం ఎంతగానో ఉపయోగపడనుంది. సౌరతుఫాన్లను ముందే గుర్తించడానికి ఇప్పటికే కొన్ని మోడల్స్ ఉన్నాయిగానీ.. అవి ఊహాజనిత గణిత నమూనాలను ఉపయోగించి రూపొందించిన 2డీ మోడల్స్. ఇది సూర్యుడి కార్యకలాపాలకు (సోలార్ యాక్టివిటీ) సంబంధించి.. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సేకరించిన ముప్పై ఏళ్ల రియల్ టైమ్ డేటాను విశ్లేషించి రూపొందించిన 3డి మోడల్ కావడం వల్ల దీని ఫలితాలు అత్యంత కచ్చితంగా ఉంటాయి. వీరి పరిశోధన వివరాలు ‘ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్’ జనవరి సంచికలో ప్రచురితమయ్యాయి. ఇలా.. సోలార్ సైకిల్‌కి సంబంధించి వాస్తవంగా సేకరించి, పరిశీలించిన డేటా ఆధారంగా సౌర చక్ర అంచనా, త్రీడీ మ్యాపింగ్ చేసిన మొదటి వ్యక్తులం తామేనని గోపాల్ హజ్రా, సౌమ్యదీప్ చటర్జీ పేర్కొన్నారు.