Share News

సీఏ విద్యార్థులే మా మొదటి ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:32 AM

స్వాతంత్ర్యానంతరం తొలి రోజుల్లోనే అంటే 1949లో పార్లమెంట్‌ చేసిన ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ).

సీఏ విద్యార్థులే మా మొదటి ప్రాధాన్యం

- ఐసీఏఐ ప్రెసిడెంట్‌ సీఏ ప్రసన్న కుమార్‌.డి

మెడిసిన్‌, ఇంజనీరింగ్‌కు తోడు ఈ మధ్య కాలంలో విద్యార్థులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్న కోర్సుల్లో చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) ఒకటి. ఇంటర్‌ స్థాయిలోనే దీన్ని తీసుకుంటున్నారు. ఈ కోర్సును అందిస్తున్న సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ). దీనికి 74వ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న సీఏ ప్రసన్న కుమార్‌.డి మన తెలుగు వ్యక్తి. ఈ కోర్సుకు ఉన్న ప్రాముఖ్యం, దీంట్లో చేరే విద్యార్థులకు తాము అందించే సహకారం సహా పలు విషయాలను ఆయన దిక్సూచికి వివరించారు.

స్వాతంత్ర్యానంతరం తొలి రోజుల్లోనే అంటే 1949లో పార్లమెంట్‌ చేసిన ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ). చార్టర్డ్‌ అకౌంటెంట్లకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఐసీఏఐ అలరారుతోంది.

  • ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట ఆర్థిక వాతావరణంలో చార్టర్డ్‌ అకౌంటెంట్ల పాత్ర బహుముఖంగా విస్తరించింది. సంప్రదాయంగా కొనసాగే అకౌంటింగ్‌, ఆడిటింగ్‌, టాక్సేషన్‌ నుంచి సీఏ పాత్ర సరికొత్త మార్పు చెందింది. ఆర్థిక సంబంధ నిర్ణయాలు తీసుకోవడం, సుపరిపాలన మొదలుకుని ఆర్థిక పరివర్తనలో అడగడుగునా కీలక భాగస్వాములుగా సీఏలు వ్యవహరిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, కార్పొరేట్‌ పరిపాలన సువ్యవస్థీకరణ సహా పెట్టుబడిదారుడి విశ్వాసాన్ని చూరగొనడం, నియంత్రణ చట్టాల అమలులో సీఏల పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆర్థిక సంస్కరణల నుంచి దేశంలో చోటుచేసుకుంటున్న ప్రతి మార్పు దశలోనూ సీఏలు తమదైన పాత్ర నిర్వర్తిస్తున్నారు.

  • 2030 నాటికి అయిదు ట్రిలియన్ల ఎకానమీగా అవతరించే లక్ష్యంతో భారతదేశం దూసుకువెళుతోంది. ఈ క్రమంలో స్టార్ట్‌పల నుంచి ఫైనాన్షియల్‌ సెక్టార్‌కు సంబంధించి ప్రతి అడుగులో సీఏ తన నైపుణ్యాన్ని అందిస్తున్నారు.


  • ప్రస్తుతం మన దేశంలో నాలుగున్నర లక్షల మంది చార్టర్డ్‌ అకౌంటెంట్లు ఉన్నారు. వారిలో 2.85 లక్షల మంది ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. 1.65 లక్షల మంది సొంతంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఏటా ఇరవై మూడు వేల మంది సీఏలుగా బైటకి వస్తున్నారు. అలా వచ్చిన వారిలో 25 శాతం మంది ప్రాక్టీస్ వైపుమొగ్గు చూపుతున్నారు. ఈ ఆగస్టు - సెప్టెంబర్‌ నెలలోనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా 5,369 పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నాం.

  • ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో ప్లేస్‌మెంట్‌ పొందిన చార్టర్డ్‌ అకౌంటెంట్ల సగటు వార్షిక వేతనం రూ. 13 లక్షలు. దేశీయంగా అది గరిష్ఠంగా రూ.27.50 లక్షలు. మొత్తమ్మీద స్థిరమైన భవిష్యత్తును చార్టర్డ్‌ అకౌంటెంట్లు పొందుతున్నారని చెప్పగలను.

  • సీఏల పాత్రను జీఎస్‌టీ చాలా పెంచింది. భారతదేశంలో పరోక్షపన్నుల వ్యవస్థలో జరిగిన అతి పెద్ద పరివర్తనగా జీఎ్‌సటీని పేర్కొనవచ్చు. ఇది దేశంలోని టాక్స్‌ బేస్‌ను విస్తృతపర్చింది. సరికొత్త పన్ను వ్యవస్థ సజావుగా అమలయ్యేందుకు సీఏలు కీలకపాత్ర పోషిస్తున్నారు. జీఎస్‌టీ విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా, సాంకేతికపరంగా అనేకానేక పరిణామాలు ఇప్పటికీ చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ పన్ను వ్యవస్థకు చట్టబద్ధత, ప్రామాణికత కల్పించడంలో సీఏలు కృషి చేస్తున్నారు.

  • ఇదేకాకుండా రిజిస్ట్రేషన్‌లో పన్ను చెల్లింపుదారులకు సహకరించడం నుంచి చట్టపరమైన వివిధ వ్యవహారాల అమలు, సలహా, ఆడిట్‌ అసె స్‌మెంట్‌లో సీఏలు తోడుంటున్నారు. సంబంధిత వివాదాల పరిష్కారం, అప్పిలేట్‌ ట్రిబ్యునల్స్‌లో క్లయింట్‌కు ప్రాతినిధ్యం వహించడం వంటి పనులను కూడా సీఏలు చక్కబెడుతున్నారు.


  • చార్టర్డ్‌ అకౌంటెన్సీ ప్రత్యేకించి అంతర్జాతీయంగా అత్యంత గౌరవనీయ వృత్తిగా ఉంది. ఆ క్రమంలో వ్యక్తిగత క్రమశిక్షణ, విశ్లేషణాత్మక ఆలోచన, నిరంతర కృషితో మాత్రమే ఒక విద్యార్థి ఈ కోర్సును పూర్తి చేయగలుగుతారు. సరైన సమాచారం అంటే పరీక్షలు, శిక్షణ తదితర అంశాలకు సంబంధించిన విషయాలపై ఐసీఏఐ అధికారిక చానళ్ళనే విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాలి.

  • కోర్సు ఫీజు రమారమి రూ.80,000. కోర్సులో భాగంగా రెండేళ్ళ పాటు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఆ సమయంలో స్టయిపెండ్‌ చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించే ఫీజుల కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన తరవాత వచ్చే వేతనాలు కూడా అంతకు మించి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

  • సీఏ కోర్సులో మూడు దశలు ఉంటాయి. వరుసగా అవి ఫౌండేషన్‌, ఇంటర్మీడియెట్‌, ఫైనల్‌. ఈ జర్నీలోని ప్రతి దశలో లెర్నింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌కు అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా నిగ్గుదేలవచ్చు. సరైన ప్రిపరేషన్‌, సుస్థిర యత్నం, చక్కటి మార్గదర్శకత్వం అంతకుమించి పట్టుదల ఉంటే ఈ కోర్సును పూర్తిచేయవచ్చు.

  • సిలబ్‌సను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, కాన్సెప్టులకు సంబంధించి స్పష్టత ఈ కోర్సు పూర్తిలో ప్రధానపాత్ర పోషిస్తాయి. బట్టీపట్టడం ద్వారా ఈ కోర్సు పూర్తికాదు. చక్కటి ప్రణాళిక, క్రమం తప్పకుండా రివిజన్‌, అన్ని సబ్జెక్టులను కవర్‌ చేయడంలో సమతూకం చాలా ముఖ్యం. పాత ప్రశ్నపత్రాలను సాల్వ్‌ చేయాలి. అలాగే పరీక్ష సమయంలో ప్రజంటేషన్‌కు, టైమ్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చుకోవాలి.

  • ఆర్టికల్‌షిప్‌ సమయంలో ప్రాక్టికల్‌ ఎక్స్‌పోజర్‌కు అవకాశం ఉంటుంది. దానికి కోర్సులో భాగంగా చేసిన చక్కటి అధ్యయనం తోడైతే వాస్తవిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు. అక్కడ తమ జ్ఞానాన్ని ఎలా అన్వయించాలో కూడా అర్థమవుతుంది. కోర్సు పూర్తి చేయడం సులువేమీ కాదు, అలాగని కష్టమూ కాదు. పట్టుదలతో కృషి చేస్తే సీఏ పూర్తి సాధ్యమే.

  • మా విద్యార్థులకు పద్ధతిగా శిక్షణ, నాణ్యమైన లెర్నింగ్‌ వనరులు, నిరంతర పర్యవేక్షణ, ఆసాంతం సపోర్ట్‌ ఇవ్వడంలో ఐసీఏఐ రీజినల్‌ కౌన్సిల్స్‌, బ్రాంచీలు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటాయి.


  • కోర్సు కరికులమ్‌, సమగ్రమైన మెటీరియల్‌, రివిజన్‌ టెస్ట్‌ పేపర్లు, మాక్‌ టెస్ట్‌ పేపర్లు, సజెస్ట్‌డ్‌ ఆన్సర్లు, కేస్‌ స్టడీ వనరులు, డిజిటల్‌ లెర్నింగ్‌ వేదికలకు తోడు వర్చ్యువల్‌ తరగతులు, ఈ-లెర్నింగ్‌ మోడల్స్‌ రూపకల్పనలో సంస్థకు చెందిన బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్(అకడమిక్‌) నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. తప్పని సరి ఓరియెంటేషన్‌, ఐటీ, అడ్వాన్స్‌డ్‌ ఐటీ, మేనేజ్‌మెంట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ విషయంలో బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్(ఆపరేషన్స్‌) తోడ్పడుతుంది.

  • దేశవ్యాప్తంగా 186 బ్రాంచీలు, అయిదు రీజినల్‌ కౌన్సిల్స్‌తో కూడిన విస్తృత నెట్‌వర్క్‌ మా సంస్థకు ఉంది. విద్యార్థులకు ప్రొఫెషనల్‌ అలాగే ప్రాక్టికల్‌పరంగా సామర్థ్యాలను సంతరింపజేసేందుకు ఇవన్నీ నిరంతరం పని చేస్తుంటాయి. అదనంగా సెమినార్లు, వర్క్‌షాప్స్‌, గైడెన్స్‌ సెషన్స్‌తో విద్యార్థులకు సహకరిస్తుంటాయి. లైబ్రరీ, రీడింగ్‌ రూమ్‌ సదుపాయాలనూ కల్పిస్తున్నాయి.

  • లెర్నింగ్‌ లేదంటే ప్రొఫెషనల్‌ డెవల్‌పమెంట్‌ జర్నీలో సంస్థ సహాయం అందలేదన్న భావన విద్యార్థులకు కలుగకుండా ఐసీఏఐ నిరంతరం కృషి చేస్తోంది. లెర్న్స్‌ ట్రెన్స్‌ గైడ్స్‌ సపోర్ట్‌ కనెక్ట్‌ గ్రో అనే పద్ధతిలో భవిష్యత్తు సీఏలను ఐసీఏఐ తీర్చిదిద్దుతోంది.

Updated Date - Aug 10 , 2026 | 01:34 AM