పైలట్ కల నెరవేర్చుకోవచ్చు!
ABN , Publish Date - Jan 26 , 2026 | 06:04 AM
ఆకాశంలో విమానం చూడగానే అందులో మరీ ముఖ్యంగా మేఘాల మధ్య ప్రయాణించాలని చిన్న పిల్లలు అనుకుంటారు. వారిలో కొందరికి పైలట్‌గా మారి, ఆ విమానాన్ని తామే నడిపితే అన్న ఆలోచన కూడా రావచ్చు.
ఆకాశంలో విమానం చూడగానే అందులో మరీ ముఖ్యంగా మేఘాల మధ్య ప్రయాణించాలని చిన్న పిల్లలు అనుకుంటారు. వారిలో కొందరికి పైలట్‌గా మారి, ఆ విమానాన్ని తామే నడిపితే అన్న ఆలోచన కూడా రావచ్చు. అయితే ఈ రోజు ఆ కలను నిజం చేసుకోవచ్చు. కొద్ది వారాల క్రితం ఇండిగో సంక్షోభం తరవాత పైలట్లకు ఉన్న డిమాండ్ చాలా మందికి అర్థమై ఉంటుంది. వేగంగా వృద్ధి చెందుతున్న భారత వైమానికి రంగం పైలట్లకు అవకాశం కల్పిస్తోంది. అపురూపమైన ఈ కెరీర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పైలట్ కావాలనుకునే యువత టెన్త్ తరవాత సైన్స్ స్ట్రీమ్ అందునా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వైపు మొగ్గుచూపాలి. ఏవియేషన్‌కు ఈ సబ్జెక్టులే వెన్నెముక. పైలట్ శిక్షణ పొందేందుకు ఈ రెండు సబ్జెక్టుల్లో పట్టు తప్పనిసరి. పైలట్ కావాలని కలలుకనే వారికి దేహదారుఢ్యం, క్రమశిక్షణ, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. వైద్యపరంగానూ ఫిట్‌నెస్ అవసరం. డీజీసీఏ నిర్ధేశించిన మెడికల్ పరీక్షలను క్లియర్ చేయాలి. స్పష్టమైన కంటిచూపు, అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం.
పైలట్ అయ్యేందుకు ముందుగా ఫిజిక్స్, మేథ్స్‌తో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు డీజీసీఏ అనుమతించిన ఫ్లయింగ్ శిక్షణ సంస్థలో సభ్యులుగా చేరాలి. ఒకటి తరవాత మరొక దశలోకి అంటే స్టూడెంట్ పైలట్ లైసెన్స్(ఎ్‌సపీఎల్) నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్(సీపీఎల్) వరకు థియరీ పరీక్షలు పాస్ కావాలి. నిర్దేశిత గంటల మేరకు గగనయానాన్ని పూర్తి చేయాలి. సీపీఎల్ సాధించిన విద్యార్థులు - పైలట్లుగా నిర్దేశిత ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణ పొందాలి. తదుపరి ఎయిర్‌లైన్స్‌లో కో-పైలట్లుగా నియమితులవుతారు.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేయగలిగితే ఈ రంగాన్ని ఎంచుకునే విద్యార్థులకు మేలు కలుగుతుంది. అకడమిక్‌గా గట్టి పునాది పడుతుంది. ప్రయోగశాలల్లో ప్రాక్టికల్‌గా అర్థమవుతుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ సహా గీతమ్ వంటి డీమ్డ్ యూనివర్సిటీలో ఈ కోర్సు చదివితే ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ కూడా లభిస్తుంది. పైలట్ కాబోయే వారికి ఈ కోర్సు టెక్నికల్ ఎడ్జ్‌ను అందిస్తుంది. ఎయిర్‌క్రా్‌ఫ్టకు సంబంధించిన వ్యవహారాలు తెలుస్తాయి. సేఫ్టీ, క్వాలిటీ కూడా అర్థమవుతుంది. ఎయిర్‌క్రా్‌ఫ్టలకు సంబంధించి పటిష్టమైన సాంకేతిక అవగాహన ఉంటుందని భావించే ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా ఈ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులను తీసుకునేందుకు ఉత్సుకతను కనబరుస్తున్నాయి.
ఏరోస్పేస్ విద్యార్థులు బలమైన పైలట్లుగా రూపొందుతారు. ఎందుకంటే, ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలు, పనితీరుపై వారికి మంచి అవగాహన ఉంటుంది. డీజీసీఏ థియరీ పరీక్షలకు ఉద్దేశించి బలమైన పునాది పడుతుంది. ఎయిర్‌లైన్ శిక్షణ, టైప్ రేటింగ్‌కు సంబంధించి అత్యున్నత విశ్వాసం కలిగి ఉండొచ్చు. పైలట్ కాదనుకుంటే ఇంకొన్ని అవకాశాలు - ఏవియేషన్, డిఫెన్స్, డ్రోన్లు, స్పేస్ రీసెర్చ్‌లోకి వెళ్ళవచ్చు. తద్వారా కెరీర్‌లో ఫ్లెక్సిబిలిటీ అలాగే సుదీర్ఘకాలిక ఉద్యోగ భద్రతకు అవకాశం కూడా కలుగుతుంది.
కొత్తగా అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్ సంస్థలు ఈ ఏడాదిలోనే సర్వీసులు ఆరంభించేందుకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఓసీ) పొందాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శంక్ ఎయిర్ ఇప్పటికే అనుమతులు సాధించింది. ఉత్తర భారతంలోని విమానయాన సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాలకు ఇది విస్తరించే యోచననలో ఉన్నట్టు సమాచారం.
వైమానిక రంగాన్ని మరింతగా విస్తరించే యత్నంలో భారత ప్రభుత్వం ఉంది. 2030 నాటికి ఏటా ముప్పయ్ లక్షల మంది ప్రయాణికులతో ప్రపంచంలోనే మూడో పెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా అవతరించనుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టు వేల సంఖ్యలో పైలట్లు మన దేశానికే అవసరమవుతారని నిపుణులు చెబుతున్నారు.
పెద్ద కలలు కనడమే కాదు, క్రమశిక్షణకు తోడు సంబంధిత సరైన చదువులు, ప్రాక్టికల్ శిక్షణ పొందిన యువతకు ఈ రంగం సదా ఆహ్వానం పలుకుతోందని చెప్పవచ్చు.
పైలట్ శిక్షణ సంస్థలు కొన్ని
చైమ్స్ ఏవియేషన్ అకామీ, మధ్యప్రదేశ్
రెడ్‌బర్డ్ ఫ్లయిట్ ట్రైనింగ్ అకాడమీ, బెంగళూరు
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూళ్ళు
నేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌ఎ్‌ఫటీఐ), గోండియా, మహారాష్ట్ర
ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ(ఐజీఆర్‌ఏయూ), ఫర్సత్‌గంజ్ ఎయిర్‌ఫీల్డ్, అమేథి, యూపీ