Share News

ఎప్‌సెట్‌ దరఖాస్తుల్లో పొరపాట్లు

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:06 AM

టీజీ ఎప్‌సెట్‌-2026 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు తడబడుతున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ దరఖాస్తు సమయంలో తప్పిదాలు చేస్తున్నారు.

ఎప్‌సెట్‌ దరఖాస్తుల్లో పొరపాట్లు

  • బైపీసీ వారు ఇంజనీరింగ్‌కు, ఎంపీసీ వారు అగ్రిల్చర్‌కు అప్లై చేస్తున్న వైనం

  • అప్రమత్తం చేసిన అధికారులు

  • 52 మంది పేర్లలోనూ అచ్చుతప్పులు

  • రెండ్రోజుల్లో 11వేలకు చేరువైన అప్లికేషన్లు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): టీజీ ఎప్‌సెట్‌-2026 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు తడబడుతున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ దరఖాస్తు సమయంలో తప్పిదాలు చేస్తున్నారు. ముఖ్యంగా పరీక్షా విభాగం ఎంపికలో గందరగోళానికి గురవుతున్నారు. 11 మంది బైపీసీ అభ్యర్థులు పొరపాటున ఇంజనీరింగ్‌కు దరఖాస్తు చేయగా, మరో ఏడుగురు ఎంపీసీ అభ్యర్థులు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగాన్ని ఎంచుకున్నారు. బ్యాక్‌ఎండ్‌ టెక్నాలజీ ద్వారా ఈ తప్పులను పసిగట్టిన హెల్ప్‌లైన్‌ సిబ్బంది, వెంటనే సదరు అభ్యర్థులకు ఫోన్‌ చేసి వివరాలు సరిదిద్దుకోవాలని సూచించారు. ఎప్‌సెట్‌కు రెండు రోజుల్లోనే సుమారు 10,924 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్‌ విభాగానికి 6,800 మంది, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి 4,111 మంది దరఖాస్తు చేయగా, రెండు పరీక్షలకు కలిపి మరో 13 మంది దరఖాస్తులు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, సుమారు 52 మంది అభ్యర్థులు తమ పేర్లు, మొబైల్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ ఐడీలను సరిగా నమోదు చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ సిలబస్‌ చదివిన విద్యార్థులు తమ వివరాలను మాన్యువల్‌గా ఎంటర్‌ చేసే క్రమంలో తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు, ఇంటర్నెట్‌ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్కడి నిర్వాహకుల పొరపాట్ల వల్ల తమ వివరాలు తప్పుగా నమోదయ్యాయని ఎప్‌సెట్‌ కార్యాలయానికి వచ్చి వాపోయారు. కాగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేముందు వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని సెట్‌ కన్వీనర్‌ విజయకుమార్‌రెడ్డి సూచించారు.

Updated Date - Feb 21 , 2026 | 03:06 AM