ఎప్‌సెట్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు నేడే ఆఖరు
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:24 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్ దరఖాస్తుల్లో దొర్లిన పొరపాట్ల సవరణకు సెట్ అధికారులు ఇచ్చిన..
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్ దరఖాస్తుల్లో దొర్లిన పొరపాట్ల సవరణకు సెట్ అధికారులు ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుంది. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో వందల సంఖ్యలో తప్పులు ఉండడాన్ని గుర్తించిన అధికారులు, వాటిని సరిచేసుకునేందుకు వీలుగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. అయితే అభ్యర్థుల పేరు, పుట్టినతేదీ, ఇంటర్ హాల్ టికెట్ నంబరు వంటి వివరాలను ఆన్‌లైన్‌లో మార్చుకునే వీలు లేకపోవడంతో, వీటి సవరణ కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు హైదరాబాద్ జేఎన్‌టీయూలోని ఎప్‌సెట్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అభ్యర్థులు తమ తల్లిదండ్రుల పేర్లలోని అక్షర దోషాలు, ఆధార్ నంబరు, జెండర్, కుల ధ్రువీకరణ, ఆదాయం, చిరునామాతో పాటు విద్యాభ్యాసానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లోనే సరిచేసుకోవచ్చని ఎప్‌సెట్ కన్వీనర్ కె.విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.