Share News

రేపటి నుంచే ఎప్‌సెట్‌ పరీక్షలు

ABN , Publish Date - May 03 , 2026 | 04:51 AM

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

రేపటి నుంచే ఎప్‌సెట్‌ పరీక్షలు

  • 4, 5 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ టెస్ట్‌

  • 9 నుంచి 11వ వరకు 6 సెషన్లలో ఇంజనీరింగ్‌ పరీక్షలు

  • అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం: కన్వీనర్‌ కె.విజయకుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, మే 2(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగాలకు, మే 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తున్నారు. ఉదయం సెషన్‌ 9-12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సోమ, మంగళవారాల్లో జరగనున్న అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షలకు మొత్తం 3 సెషన్లకు గాను 90,958 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, అభ్యర్థులు సమయపాలన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, పరీక్ష ప్రారంభ సమయానికి నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించే ప్రసక్తే లేదని సెట్‌ అధికారులు స్పష్టం చేశారు. ఉదయం సెషన్‌ అభ్యర్థులను 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్‌ అభ్యర్థులను 1.30 గంటల నుంచే పరీక్షాకేంద్రంలోనికి అనుమతిస్తారు. పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు తాము సాధించిన మార్కులను స్ర్కీన్‌పై చూసుకోవచ్చని అధికారులు వెల్లడించా రు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌/రేషన్‌ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు ల్లో ఏదైనా ఒకటి (ఒరిజినల్‌) తప్పనిసరిగా తెచ్చుకోవాలి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఎప్‌సెట్‌ కన్వీనర్‌ కె.విజయకుమార్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 04:51 AM