Share News

Mohammad Akhlaq Case: న్యాయంపై భరోసా

ABN , Publish Date - Jan 03 , 2026 | 04:04 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లో పదేళ్ళనాటి మహమ్మద్‌ ఆఖ్లాఖ్‌ హత్యకేసులో నిందితులపై ఆరోపణలు ఉపసంహరించుకోవాలన్న యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని స్థానికకోర్టు ఇటీవల తిరస్కరించింది.

Mohammad Akhlaq Case: న్యాయంపై భరోసా

ఉత్తర్‌ప్రదేశ్‌లో పదేళ్ళనాటి మహమ్మద్‌ ఆఖ్లాఖ్‌ హత్యకేసులో నిందితులపై ఆరోపణలు ఉపసంహరించుకోవాలన్న యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని స్థానికకోర్టు ఇటీవల తిరస్కరించింది. నేరారోపణలు జరిగిన ఇంతకాలానికి, ఆఖ్లాఖ్‌ను కొట్టిచంపిన వారిని రక్షించుకొనే లక్ష్యంతో యూపీ ప్రభుత్వం స్థానిక సెషన్స్‌కోర్టులో నవంబరులో దరఖాస్తు దాఖలు చేసినప్పుడు దేశం నివ్వెరపోయింది. గవర్నర్‌ సహా పకడ్బందీగా పెద్దతలకాయలందరి సంతకాలతో, నేరశిక్షాసృతిలోని 321వ సెక్షన్‌ వాడుకొని ప్రభుత్వం ఈ కేసు మూసివేతకు సిద్ధపడింది. సర్వసాధారణంగా స్థానికకోర్టులు ధిక్కారాన్ని ప్రదర్శించవు కనుక కేసు మూతబడిపోతుందనే అంతా భావించారు. కానీ, గ్రేటర్‌ నోయిడా సురాజ్‌పూర్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి సౌరభ్‌ ద్వివేది అందుకు అంగీకరించలేదు. అఖ్లాఖ్‌ హత్య కేసును అతిముఖ్యమైనదిగా అభివర్ణిస్తూ, ఉపసంహరణ ప్రతిపాదనను తిరగ్గొట్టారు. అంతేకాదు, జనవరి 6నుంచి ప్రతిరోజు విచారణ కొనసాగించి, వేగవంతం చేయాలని సంకల్పించారు. ఏ అనుమానం కలిగిందో ఏమో, బాధితకుటుంబీకులకు, సాక్షులకు అదనపు భద్రత కల్పించాలని కూడా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. యోగి ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన అదనపు జిల్లా జడ్జి ద్వివేదీ ధైర్యాన్ని కాంగ్రెస్‌ తెగమెచ్చుకుంటూ, ముందు ఈ జడ్జిగారికి అదనపు భద్రత కల్పించడం అత్యావశ్యకమంటోంది.


ఇటీవల ‘ఉన్నావ్‌’ ఉన్మాది కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌ను ఢిల్లీహైకోర్టు ఏవో కొన్ని సాంకేతిక కారణలమీద వదిలేసిన రోజుల్లోనే ఈ దాద్రిఘటనలో ఫాస్ట్‌కోర్టు పూర్తిభిన్నమైన నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రభుత్వ అధికారి నిర్వచనంలోకి రారు అన్న ఏకైక వాదనతో కుల్‌దీప్‌ను జైలునుంచి విడుదల చేయాలన్న ఆ నిర్ణయం దేశాన్ని నివ్వెరపరిచింది. అనేకరోజులు ఈ బీజేపీ ఎమ్మెల్యే నిర్బంధంలో ఉంటూ, అత్యాచారానికి గురైన ఆ యువతి ఈ పరిణామంతో వొణికిపోయి మళ్ళీ వీధిపోరాటాలకు దిగాల్సివచ్చింది. దేశరాజధానిలో నిరసన చేపట్టిన బాధితురాలిని, ఆమె తల్లిని పారామిలటరీ బలగాలు ఈడ్చిపారేశాయి. సెంగార్‌ జైలునుంచి బయటకు వస్తే తనకు చావు ఖాయమన్న ఆమె భయం వెనుక కారణాలు తెలియనివేమీ కావు. సదరు బీజేపీనేతపై కేసు నమోదుచేయడానికి కూడా పోలీసులు మొదట ఒప్పుకోలేదు. ఆ తరువాత సెంగార్‌ మనుషులతో కలిసి వారు ఆమె తండ్రిని జైల్లోనే కొట్టిచంపేశారు. ముఖ్యమంత్రి ఇంటిముందు ఆమె ఆత్మాహుతికి ప్రయత్నించడం, ప్రజాగ్రహానికి జడిసి యోగి ప్రభుత్వం ఎట్టకేలకు సెంగార్‌ను అరెస్టు చేసినప్పటికీ ఇతగాడు జైలు నుంచే బాధితురాలిని హత్యచేయించేందుకు కుట్రపన్నడం, ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె ఆత్మీయులను కోల్పోవడం వంటి పలు పరిణామాలు ఈ భయానికి కారణం. ట్రయల్‌ కోర్టు సెంగార్‌కు జీవితఖైదు విధిస్తే, ఢిల్లీహైకోర్టు చిలికిచిలికి వెలికితీసిన ఓ చిన్న నిర్వచనం ఆధారంగా అతికష్టంమీద బాధితురాలు గతంలో సాధించిన న్యాయాన్ని తిరిగి లాగేసుకుంది. కొందరు న్యాయవాదులు, ఆ తరువాత తప్పనిసరై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అది సెంగార్‌ విడుదలకు అడ్డుకట్టవేసి న్యాయం పట్ల ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టింది.


అఖ్లాఖ్‌ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడు విశాల్‌రాణా. అఖ్లాఖ్‌ ఇంటిమీదకు దండెత్తి, అతడి ఫ్రిజ్‌లో గోమాంసం ఉన్నదని వాదించి, అక్కడి ఆలయం మైకునుంచి దానిని ప్రకటించి, సామూహికంగా కొట్టిచంపిన పద్నాలుగుమందినీ యోగిప్రభుత్వం కాపాడదల్చుకుంది. అఖ్లాఖ్‌ కుటుంబీకులు చీటికీమాటికీ తమ వాదనలను మార్చేస్తున్నారని, నిందితులు మారణాయుధాలు వాడలేదని, బాధితుడికీ, నిందితులకు మధ్య పాతకక్షలు లేవనీ, అందువల్ల ఈ కేసు కొనసాగింపు అర్థంలేనిదన్న వాదనతో చివరి అంకంలోకి చేరిన ఈ కేసును యోగి ప్రభుత్వం మూసివేసే ప్రయత్నం చేసింది. కానీ, అఖ్లాఖ్‌ హత్యకు వారంతా కర్రలు, ఇనుపరాడ్లు, ఇటుకలు ఇత్యాదివి వాడిన విషయం సహా, అన్ని తీవ్రమైన సెక్షన్లనూ సమర్థించే పకడ్బందీ ఆధారాలున్నాయి. మతోన్మాదానికీ, మూకదాడులకూ ప్రతీకగా నిలిచిన ఈ కేసును మూసివేయడం ద్వారా ఈ తరహా హత్యలను సాధారణీకరించేందుకు యోగి ప్రభుత్వం ప్రయత్నించింది. న్యాయస్థానాలు, సమాజం తమను ప్రశ్నించబోమన్న పాలకుల ధైర్యాన్ని వమ్ముచేసి, అఖ్లాఖ్‌ కుటుంబానికి భవిష్యత్తులో న్యాయం దక్కవచ్చునన్న నమ్మకాన్ని దేశానికి మిగల్చినందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తిని అభినందించాలి.

Updated Date - Jan 03 , 2026 | 04:07 AM