Share News

వైబీ: తెలుగులో ‘ఏడుతరాల’ సృష్టికర్త

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:03 AM

‘సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం, వేటగాళ్లు చెప్పిందే చరిత్ర అవుతుంది’ అంటాడు ఆఫ్రికన్ రచయిత చినువా అచెబె. భారతదేశంలో కూడా లిఖిత చరిత్రంతా ఆధిపత్య కులాలదే.

వైబీ: తెలుగులో ‘ఏడుతరాల’ సృష్టికర్త

‘సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం, వేటగాళ్లు చెప్పిందే చరిత్ర అవుతుంది’ అంటాడు ఆఫ్రికన్ రచయిత చినువా అచెబె. భారతదేశంలో కూడా లిఖిత చరిత్రంతా ఆధిపత్య కులాలదే. చదువుకునే హక్కు, ఆస్తి సంపాదించుకునే హక్కు, రాజ్యాన్ని పాలించే హక్కు వంటి కనీస హక్కులకు పీడితులు వేల ఏండ్లు దూరమయ్యారు. ఇలాంటి జాతుల చరిత్ర స్వాతంత్ర్యం అనంతరమే కొద్దికొద్దిగానైనా వెలువడడం ప్రారంభమైంది. స్వాతంత్ర్యానికి పూర్వం పూలే, అంబేడ్కర్ వంటి మహనీయులు మాత్రం రాశారు. అక్షరజ్ఞానం లేకపోతే ఇక తమ చరిత్రను తాము రాసుకునే అవకాశం ఎక్కడిది?! ఇలాంటి నేపథ్యంలో తన చరిత్రను తాను రాసుకుని ఈ ప్రపంచం నివ్వెరపోయేలా చేసిన దళిత రచయిత ప్రొ. వైబీ సత్యనారాయణ. ఆయన పూర్తి పేరు యెలుకటి బాలయ్య సత్యనారాయణ. తక్కువగా రాసినా, ఎక్కువగా వాసికెక్కిన తెలుగు రచయితల్లో వైబీ ఒకరు.

నిజాం పాలిత హైదరాబాద్‌ సంస్థానంలో, కరీంనగర్ జిల్లాలోని వంగపల్లి ఆయన తాతముత్తాతల ఊరు. ఒకసారి వైబీ పూర్వీకులు నిజాంకు చెప్పులు కుట్టిస్తే... వాటిని చూసి ముగ్ధుడైన నిజాం, వారికి యాభై ఎకరాల భూమిని ఇనాంగా ఇచ్చాడు. అదిచూసి ఓర్వలేని స్థానిక దొరలు అందులో నుంచి నలభై ఐదు ఎకరాలు లాక్కున్నారట. అంతేకాదు, వైబీ తాత నర్సయ్య ఆ ఊరిలో మరో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. గత్తర వచ్చి తన భార్య చనిపోతే, దహన సంస్కారాలు చేయడానికి ఊరిజనం ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో నర్సయ్య మనసు విలవిలలాడింది.


అలాంటి ఊరిలో బతకకూడదని నిర్ణయించుకున్నాడు. భార్య శవాన్ని భుజాన వేసుకుని, తన ఆరేళ్ల కొడుకు బాలయ్యను పట్టుకుని ఊరు దాటాడు. భార్యను ఒక్కడే సమాధి చేసి, రైలు పట్టాల వెంట కాలినడకన జనగామలోని తన బంధువుల ఇంటికి చేరుకున్నాడు. అనంతరం అక్కడే రైల్వేలో కూలీగా చేరాడు. తన కొడుకు బాలయ్యను కూడా రైల్వేలోనే పనిలో పెట్టాడు. అలా రైలు మార్గం వెంటే యెలుకటి కుటుంబం ఎదుగుతూ వచ్చింది. అనంతరం జనగామ నుంచి బీబీనగర్‌కు, ఆ తర్వాత సికింద్రాబాద్‌కు తరలింది వారి కుటుంబం. రైల్వేలో పనిచేయడం వల్ల బాలయ్య ఆలోచనా పరిధి విశాలమైంది. ముఖ్యంగా, దళితులు కుల వివక్ష, అంటరానితనపు అవమానాల నుంచి బయటపడాలంటే చదువును మించిన ఆయుధం లేదని నమ్మాడు బాలయ్య. తన నలుగురు కొడుకులను చదివించాడు. తెల్లదొరల వలే తన బిడ్డలు కూడా రైల్వేలో ఉన్నతాధికారులు కావాలని ఆశించాడు. అనుకున్నట్లే వారు ప్రొఫెసర్లుగా ఎదిగి తండ్రి పేరును విశ్వవ్యాప్తం చేశారు. వారిలో వైబీ సత్యనారాయణ రసాయనశాస్ర్తంలో పీహెచ్‌డీ చేసి, ధర్మవంత్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.


వైబీ తన పిల్లల్ని కూడా బాగా చదివించి, అమెరికా వరకూ ఎదిగేలా చేశారు. అలా ఒకసారి ఆయన అమెరికాలోని తన పిల్లల వద్దకు వెళ్లినప్పుడు ‘తాతా! ఒక కథ చెప్పు’మంటూ తన మనవరాలు కోరింది. తనకు కథలు రావన్నా సరే, ఆ పాప వదిలిపెట్టలేదు. ఏ కథలూ రాకుంటే నీ కథే చెప్పమంది. అప్పుడు వైబీ– తన కథను ఎలా చెప్పాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఏ అవమానాల నుంచి ప్రారంభించాలో తెలియక తర్జనభర్జన పడ్డారు. మొత్తానికి సంక్షిప్తంగానైనా చెప్పగలిగారు. ‘పూర్వీకుల నాటి నుంచి తమ ప్రయాణమంతా రాసి పెడితేనే కదా, రేపటి తరాలకు తెలిసేది’ అని అప్పుడే ఆలోచన చేశారు. భారత్‌కు తిరిగివచ్చాక ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ వ్యవస్థాపకుల్లో ఒకరిగా పాటుపడ్డారు. ఆ సమయంలోనే ఇంగ్లిష్‌లో ‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తకం రాశారు. దీనిని ప్రముఖ కథకురాలు పి.సత్యవతి తెలుగులోకి అనువదించారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సినిమా ‘కబాలి’ వరకూ ఈ పుస్తకం చేరింది. ఆ సినిమాలో మొదటి సీన్‌లో.. రజినీకాంత్ జైలులో కూర్చుని ఈ పుస్తకాన్ని చదువుతుంటారు. అలా మరోసారి ఈ పుస్తకం చర్చల్లో నిలిచింది. తెలుగు, ఇంగ్లిష్‌లోనే కాదు, కన్నడ, తమిళ్, బెంగాలీ, రాజస్థానీ, ఒరియా వంటి అనేక భారతీయ భాషల్లోకి ఈ పుస్తకం అనువాదమై సంచలనంగా నిలిచింది.


‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తకం ద్వారా జాతికి వైబీ గొప్ప సందేశాన్ని అందించారు. అలెక్స్ హేలీ ‘ఏడుతరాలు’ రాసినట్టు, వైబీ కూడా తన మూడు తరాల జీవితాన్ని ఈ పుస్తకంలో అద్భుతంగా వర్ణించారు. తాను ఆ పుస్తకంలో రాసినట్టే చదువు ద్వారానే దళితుల జీవితాలు మారతాయని బలంగా నమ్మారు వైబీ. అందుకే అటు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌తోనూ, ఇటు కేవీపీఎస్ వంటి దళిత సంఘాలతోనూ కలిసి నడిచారు. గురుకులాల్లోని విద్యార్థులకు చదువు ఆవశ్యకతను బోధించారు. తాను నడుస్తూ, యువతను నడిపించారు. ఔత్సాహిక యువ రచయితలకు అండదండలు అందించారు. తెలంగాణ పోరాట యోధురాలు సదాలక్ష్మమ్మ జీవితంపై ‘SadaLaxmi: The Political Rebel’ అనే మరో పుస్తకాన్ని కూడా రాశారు. దళిత ఆత్మకథల జాబితాలో చెరగని ముద్ర వేసిన వైబీ... అనారోగ్యంతో ఇటీవల తన 82వ ఏట కన్నుమూశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. దళిత జాతికి ఆయన చేసిన సేవను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- డా.పసునూరి రవీందర్

కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత

Updated Date - Oct 17 , 2026 | 01:07 AM