చరిత్రగా మారిన కాలంలో నా ప్రయాణాన్ని రికార్డు చేయాలని...
ABN , Publish Date - Aug 10 , 2026 | 07:25 AM
సాహిత్య మాస పత్రికలు విపుల, చతుర సంపాదకుడిగా యార్లగడ్డ రాఘవేంద్రరావు స్వీయానుభవాలు కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో విశేషంగా పాఠకుల దృష్టిని ఆకర్షించాయి.
నాకు తెలిసిన, నేను భాగమైన ఆ కాసింత చరితకు అక్షరమాలికలు కడితే, ‘ఒహో పత్రికలు ఇలా ఉండేవా, వాటి నిర్వహణకు ఇంత కష్టపడేవారా’ అనేదయినా తర్వాతి తరాలవారికి అవగతమవుతుందనే ఉద్దేశమే ఈ పుస్తకాలకు నాంది.
సాహిత్య మాస పత్రికలు విపుల, చతుర సంపాదకుడిగా యార్లగడ్డ రాఘవేంద్రరావు స్వీయానుభవాలు కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో విశేషంగా పాఠకుల దృష్టిని ఆకర్షించాయి. విషయంతో పాటు వారు రాసిన తీరు వల్ల కూడా అవి ప్రత్యేకంగా నిలిచాయి. ఆ అనుభవాల్ని ఇటీవల రెండు పుస్తకాలుగా వెలు వరించిన సందర్భంగా ఆయనతో సంభాషణ:
మీ పాత్రికేయ అనుభవాలు, కెనడా ఉద్యోగ అనుభవాలను రాయడం వెనక మీ లక్ష్యం ఏమిటి?
పాత్రికేయ అనుభవాలు అనడం కంటే సాహితీసంబంధమైన అనుభవాలనడం సమంజసం. విపుల, చతుర జంటపత్రికలు సాహితీలోకంలోనే ఓ వినూత్న ప్రయోగం. స్మార్ట్‌ఫోన్ల మాట అటుంచి కనీసం టీవీలు కూడా అందరికీ అందుబాటులోలేని కాలంలో అన్నివర్గాల పాఠకుల్ని విశేషంగా అలరించాయి. అవి పుట్టిన 28 ఏళ్లకు ఒకానొక సంధికాలంలో వాటికి సంపాదకబాధ్యతలు నిర్వర్తించాను నేను. అప్పటికి దాదాపు ఊపిరిసన్నగిల్లిన పత్రికల్లో క్రొన్నెత్తురు నింపి నిలబెట్టేందుకు నేను బృహత్‌యాగమే చేయాల్సివచ్చింది. ఆ జంటపత్రికలకు నేను రెండేళ్లపాటే సంపాదకత్వం వహించినా అందరూ మెచ్చే విధంగానే నా బాధ్యతల్ని నిర్వర్తించి బయటికొచ్చానని అనుకుంటున్నాను. కరోనా అనంతరకాలంలో ఆ పత్రికలకు కాలం చెల్లిపోయింది. చరిత్ర సృష్టించి, చరిత్రగా మారిపోయిన వాటి గురించిన ఒకానొక కాలాన్ని, అవి పునరుత్తేజం పొంది మళ్లీ పాఠకుల అభిమానాన్ని కొంతైనా పొందిన కాలాన్ని, వాటితో కలిసి సాగిన నా యానాన్ని రికార్డు చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆ పత్రికలు మూతబడ్డాక అది మరింత ప్రగాఢమయింది. నాకు తెలిసిన, నేను భాగమైన ఆ కాసింత చరితకు అక్షరమాలికలు కడితే, ‘ఒహో పత్రికలు ఇలా ఉండేవా, వాటి నిర్వహణకు ఇంత కష్టపడేవారా’ అనేదయినా తర్వాతి తరాలవారికి అవగతమవుతుందనే ఉద్దేశమే ఈ పుస్తకాలకు నాంది.
విపుల, చతుర సంపాదక బాధ్యతల నుంచి తప్పుకోవడానికి మా కుటుంబం కెనడా వలసవెళ్లడం కారణం. అనివార్యమై జంటపత్రికలతో బంధం తెంచుకోవడం, నేను అర్ధమనస్కంగా వలస వెళ్లడం, దానికి పూర్వరంగంలో జతపడిన అనుభవాలు నా ఉద్యోగ జీవితంతో ముడిపడ్డం వంటి అనేక అంశాలు కూడికలైపోయి ‘విపుల, చతుర–నేను’ అనే ఆత్మకథాత్మకథ అయింది. కొంతకాలానికి నేను కెనడా నుంచి తిరిగొచ్చేయడం, మళ్లీ జర్నలిస్టు జీవితంలోకి అడుగిడడానికి ప్రయాసపడ్డం మొదటి పుస్తకానికి కొనసాగింపుగా ఉంటుందని భావించాను. అంతేకాక పదేళ్లుగా– చదువుకోసం, స్థిరపడ్డం కోసం కెనడా వెళ్లేవారి సంఖ్య పెరగడం, వారికి అక్కడి పరిస్థితులు పూర్తిగా తెలియక, వెళ్లి సతమతం కావడం గమనిస్తూ ఉన్న నేను అక్కడి సానుకూల, ప్రతికూల అంశాలు తెలియపరచడానికి నా అనుభవాల్ని మేళవిస్తూ రచన చేయడమూ అవసరమనుకున్నాను. అలా అది మరో కూడికల రచనగా మారి మొదటి పుస్తకానికి అనుబంధమైంది. ఆయా అంశాల కూడికతనం వల్ల రెంటిని వేరుచేయడం సాధ్యం కాదు గనుక వాటిని ఒక సిరీస్‌గా ప్రచురించాల్సి వచ్చింది.
ఫేస్‌బుక్‌లో రాసిన పోస్టులను పుస్తకాలుగా తెచ్చినపుడు ఎలాంటి మార్పులూ చేర్పులూ చేశారు?
2023 జనవరి నుంచి వీటిని ఫేస్‌బుక్‌లో సీరియల్‌గా వెలువరించడానికి ఏడాది ముందే ఓ ప్రణాళిక రూపొందించుకుని కొన్ని వ్యాసాలు రాశాను. వాటిని మళ్లీ నిశితంగా పరిశీలించుకుంటూ మరో రెండుమార్లు విపులంగా తీర్చిదిద్దాను. ఆ తరువాతే ఫేస్‌బుక్‌లో సీరియల్‌గా వెలువడ్డాయి. వాటికి విశేషమైన స్పందనే వచ్చింది. పుస్తకమంటే సమగ్రరూపంలో ఉండాలికదా అనుకుంటూ ఆ వ్యాసాల్ని ముందేసుకుని కూర్చుంటే... వాస్తవికాంశాలలో తేడాలు రాకుండా సరిచూసుకోవాల్సినవి, కొత్తగా జతపరిచి మెరుగు పెట్టాల్సినవి చాలానే ఉన్నాయనిపించింది. దాంతో మరో మూడు వడపోతలు జరిపి, ఇంక మార్చాల్సింది, చేర్చాల్సింది ఏమీ లేదని సంతృప్తి చెందాకే ప్రచురణకర్తలకిచ్చాను. విపుల, చతుర పుట్టుక నేపథ్యం, నా సాహితీప్రస్థానపు తీరుతెన్నులు, ఎదురైన చేదుతనాలు, ఈ వ్యాసాల్ని సీరియల్‌గా వెలువరించినప్పుడు ఎదుర్కొన్న విమర్శలు, జర్నలిస్టు జీవితంలోకి అడుగిడటానికి ఎంతోకాలం ముందే దాని పిలుపులు అందినా నేను తిరస్కరించడం, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారితో నా పూర్వానుబంధం, ఆ తరువాత అందులోనే నేనో ఉద్యోగిగా మారాల్సి రావడం వగైరాలన్నీ నా జంటపుస్తకాల్లోని కొత్తకొత్త చేరికలు.
మీ కవిత్వ పదప్రయోగాలకీ, శైలికీ భిన్నంగా ఆలంకారిక సమాస భూయిష్ఠమైన వచనం రాయటానికి ప్రత్యేక కారణం ఉందా?
మొదటినుంచీ నా వచనంలో ఆ లక్షణాలున్నాయి. కథల్లో ఆ ధోరణి.. ముఖ్యంగా కవితాత్మక వచనం తొంగిచూస్తూనే ఉంటుంది అనేక సందర్భాల్లో. ‘విపుల, చతుర– నేను’, ‘ఒక నేను– ఒక కెనడా’ గ్రంథాల రచనలో భాషాపరంగా నేనేం ప్రత్యేక పంథాన్ని అనుసరించలేదు. అది స్వతఃసిద్ధంగా ఒలికిందే తప్ప పనికట్టుకుని నేను ఏ ఒక్క పదాన్నీ చిత్రికపట్టలేదు. ఈ పుస్తకాల్లోని అనేక విషయాలు నా అనుభవాల గాఢతలోంచి తన్నుకు రావడం, నాలోని భావోద్వేగాలతో, సహజాతాలతో ముడిపడ్డం వల్ల సహజంగానే ఆ భాషా, ఆ శైలీ అంతర్లయగా పొంగిపొర్లాయి. చాలా సందర్భాల్లో ఆ ప్రవాహం అలా దొర్లుకుంటూ వెళ్లిపోవడంతో అనేకచోట్ల సుదీర్ఘ వాక్యపరంపర కానవస్తుంది. అయినా, అవెక్కడా లయ తప్పలేదు. నిజం చెప్పాలంటే, అదెన్నడూ నన్ను వీడని వచనరచన శైలి... అంతే.
ఈ పుస్తకాలకు తొలి స్పందనలు ఏ రకంగా ఉన్నాయి?
ఫేస్‌బుక్‌లో సీరియల్‌గా వస్తున్నప్పుడు జర్నలిస్టులు, సాహితీప్రియులు కనబరిచిన ఆసక్తి, స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. వారే ఈ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావాల్సిందేనంటూ నన్ను ఉత్సాహపరిచారు. అదే నన్నిలా నిలిపింది.
-ఇంటర్వ్యూ వంశీ