రాజకీయం కాదు, అంకెలతో మాట్లాడండి!
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:31 AM
తెలంగాణ ప్రజలకు ఒక సంతోషకరమైన వార్త. యాదాద్రి ప్రాజెక్టులో 800 మెగావాట్ల ఐదో యూనిట్ పూర్తయి గ్రిడ్‌కు సింక్రనైజ్ అయింది. దీంతో మొత్తం 4,000 మెగావాట్ల ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుంది.
తెలంగాణ ప్రజలకు ఒక సంతోషకరమైన వార్త. యాదాద్రి ప్రాజెక్టులో 800 మెగావాట్ల ఐదో యూనిట్ పూర్తయి గ్రిడ్‌కు సింక్రనైజ్ అయింది. దీంతో మొత్తం 4,000 మెగావాట్ల ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుంది. అలాగే, యాదాద్రికి కోల్ ఇండియా నుంచి సంవత్సరానికి సుమారు 50 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు అంగీకారం లభించడం కూడా మంచి పరిణామం.
నల్లగొండ జిల్లా దామరచర్లలోని ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు బొగ్గు గనులకు దూరంగా ఉండటంతో అవసరమైన బొగ్గును తరలించడానికి భారీ వ్యయం అవుతుందని, దీనివల్ల రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తోంది. 4,000 మెగావాట్ల భారీ విద్యుత్ ప్రాజెక్టును కేవలం బొగ్గు రవాణా ఖర్చు ఆధారంగా అంచనా వేయడం సమగ్ర విధానం కాదు. భూమి, నీరు, రైల్వే కనెక్టివిటీ, బొగ్గు రవాణా, విద్యుత్ ఇవాక్యుయేషన్, ప్రసార అవసరాలు, ప్రధాన విద్యుత్ వినియోగ కేంద్రాలకు సమీపం, పర్యావరణ అంశాలు, మొత్తం జీవితకాల విద్యుత్ ఉత్పత్తి వ్యయం– అన్నింటినీ కలిపి చూడాలి.
ఐదు 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్లతో మొత్తం 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. దామరచర్లలో ప్రాజెక్టును ఏర్పాటు చేయాలన్న నిర్ణయం గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నారు. ఆ నిర్ణయంపై రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ దాని సమర్థతను వాస్తవాల ఆధారంగా సమీక్షించాలి. దామరచర్లకు కీలకమైన మౌలిక వసతుల అనుకూలతలు ఉన్నాయి.
కృష్ణా నది నుంచి సుమారు 208 క్యూసెక్కుల నీరు, అంటే సంవత్సరానికి దాదాపు 6.6 టీఎంసీల కేటాయింపు ఉంది. అవసరమైన భూమి అందుబాటులో ఉంది. సమీపంలోని విష్ణుపురం రైల్వే స్టేషన్ ద్వారా బొగ్గును రైలుమార్గంలో తరలించే అవకాశం ఉంది. విద్యుత్‌ను తరలించేందుకు అవసరమైన ఇవాక్యుయేషన్ వ్యవస్థను కూడా ప్రణాళిక చేశారు. యాదాద్రి ప్రారంభ ప్రణాళికల్లోనే వివిధ బొగ్గు సరఫరా మార్గాలను పరిగణించారు. సంబంధిత ప్రాజెక్టు, పర్యావరణ పత్రాల్లో సింగరేణి సహా దేశీయ బొగ్గుతో పాటు కాకినాడ, కృష్ణపట్నం వంటి రేవుల ద్వారా దిగుమతి చేసుకునే బొగ్గును కూడా పరిగణించారు. రైల్వే రవాణా కూడా సరఫరా వ్యవస్థలో భాగమే.
జి–9 గ్రేడ్ బొగ్గును సింగరేణి నిరంతరం, అవసరమైన పరిమాణంలో సరఫరా చేయగలదా అన్నదే అసలు ప్రశ్న. సింగరేణిలో తగినంత జి–9 బొగ్గు లభించకపోతే మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా వంటి సంస్థల నుంచి బొగ్గును సమీకరించాల్సి రావచ్చని ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల దాదాపు రూ.40వేల కోట్ల వరకు అదనపు భారం పడవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇది పెద్ద విషయమే. అయితే, ఈ ఒక్క కారణంతో దామరచర్ల ఎంపిక తప్పు అని నిర్ధారించడం సరికాదు.
దేశంలోని థర్మల్ విద్యుత్ రంగాన్ని పరిశీలిస్తే బొగ్గు గనుల పక్కనే అన్ని విద్యుత్ కేంద్రాలు ఉండవని అర్థమవుతుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం– దేశంలో నమోదైన 188 బొగ్గు/ లిగ్నైట్ ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కేవలం 22 మాత్రమే పిట్‌హెడ్ ప్లాంట్లుగా (బొగ్గు గనికి దగ్గరలో నిర్మితమైనవిగా) ఉన్నాయి. వాటి స్థాపిత సామర్థ్యం సుమారు 41,620 మెగావాట్లు. మిగిలిన 166 ప్లాంట్లు, అంటే దాదాపు 88 శాతం, పిట్‌హెడ్ కానివే. వాటి మొత్తం సామర్థ్యం సుమారు 1,71,055 మెగావాట్లు. అందువల్ల బొగ్గు గనులకు దూరంగా థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండటం అసాధారణం కాదు. బొగ్గు రవాణా వ్యయం ముఖ్యమే కానీ అది ఒక్కటే నిర్ణయాత్మక అంశం కాదు.
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఉత్తర తెలంగాణలో మాత్రమే లేదు. హైదరాబాద్, రంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతాలు రాష్ట్రంలోని అతిపెద్ద విద్యుత్ వినియోగ కేంద్రాల్లో ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండలోని సిమెంట్, తయారీ పరిశ్రమలు, మహబూబ్‌నగర్ ప్రాంతంలోని పెరుగుతున్న పారిశ్రామిక, పట్టణ అవసరాలకు కూడా భారీగా విద్యుత్ అవసరం. అందువల్ల దక్షిణ, మధ్య తెలంగాణ వినియోగ కేంద్రాలకు కొంత సమీపంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండటం వ్యవస్థపరంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మరో ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేసి హైదరాబాద్, దక్షిణ తెలంగాణకు తరలించాల్సి వస్తే ప్రసార మౌలిక వసతుల పెట్టుబడి, ప్రసార నష్టాలు, ట్రాన్స్మిషన్, వీలింగ్ చార్జీలు కూడా పరిగణనలోకి రావాలి. భూమి, నీరు, రైల్వేలు, బొగ్గు, ఇవాక్యుయేషన్, ప్రసారం, పర్యావరణం, ప్రధాన వినియోగ కేంద్రాలకు సామీప్యం– ఇవన్నీ కలిపిన మొత్తం జీవితకాల వ్యయమే అసలు ప్రమాణం కావాలి. ఈ అంశాల్లో దామరచర్లకు ఉన్న ప్రయోజనాలు సుస్పష్టం.
జి–9 బొగ్గు ఎంత అవసరం? సింగరేణి ఎంత సరఫరా చేయగలదు? కోల్ ఇండియా నుంచి తీసుకుంటే రవాణా వ్యయం ఎంత? బ్లెండింగ్ చేస్తే ఎంత? సముద్ర–రైలు మార్గం లేదా దిగుమతి బొగ్గు ఎంతవరకు ఆర్థికంగా ఉంటుంది? ఈ వివరాలను ప్రజల ముందుంచినప్పుడే ప్రభుత్వం పేర్కొంటున్న రూ.40,000 కోట్ల అదనపు భారం వాస్తవ స్వరూపం ఏమిటో స్పష్టమవుతుంది.
యాదాద్రి తెలంగాణకు ఒక ప్రధాన విద్యుత్ ఆస్తి. గత ప్రభుత్వ నిర్ణయాలపై రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టి నిర్మించిన ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా నడపడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత. విద్యుత్ కేంద్రం ఒక ఒంటరి కర్మాగారం కాదు. అది మొత్తం విద్యుత్ వ్యవస్థలో ఒక భాగం. దాని ఆర్థిక శాస్త్రం బొగ్గుతో ప్రారంభమవుతుంది. కానీ అక్కడితో ముగియదు. దామరచర్లలో యాదాద్రి ప్రాజెక్టు ఏర్పాటు చేయడం మౌలికంగా తప్పు అని ప్రభుత్వం భావిస్తే, అందుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక ఆధారాలను ప్రజల ముందుంచాలి. లేకపోతే, సమస్య ప్రాజెక్టు స్థానం కాదని, బొగ్గు సరఫరా వ్యవస్థలో ఉందని అంగీకరించి, దానికి సమర్థవంతమైన పరిష్కారాన్ని కనుగొనాలి.
- బోయినపల్లి వినోద్‌కుమార్
మాజీ పార్లమెంట్ సభ్యులు