Share News

సైనిక భయంలో జిన్‌పింగ్‌!

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:09 AM

చైనాలో చీమ చిటుక్కుమన్నా పాశ్చాత్యమీడియా ఉలిక్కిపడుతుంది కనుక, చైనా అధ్యక్షుడు ఏకంగా తన సైనికాధిపతిమీదే చర్యలు ప్రకటిస్తే ఇక ఆ కథనాలకు అంతూపొంతూ ఉండదు.

సైనిక భయంలో జిన్‌పింగ్‌!

చైనాలో చీమ చిటుక్కుమన్నా పాశ్చాత్యమీడియా ఉలిక్కిపడుతుంది కనుక, చైనా అధ్యక్షుడు ఏకంగా తన సైనికాధిపతిమీదే చర్యలు ప్రకటిస్తే ఇక ఆ కథనాలకు అంతూపొంతూ ఉండదు. ఇటువంటి సందర్భాల్లో తప్పుచేశారు అన్నపదాన్ని వాడితే అవినీతికి పాల్పడ్డారని అర్థమట. దీనితోపాటు, క్రమశిక్షణనూ, చట్టాన్నీ కూడా అతిక్రమించారంటూ దేశ అత్యున్నత మిలటరీ జనరల్‌మీద చైనా రక్షణశాఖ దర్యాప్తు ప్రకటించింది. ఆరంభాన్ని ఇంత ఘనంగా చాటడం ఎందుకు? ఆ దర్యాప్తు ఏదో పూర్తిచేసి, నిజం నిగ్గుతేలిన తరువాతే విషయం చెప్పవచ్చు కదా అన్న ప్రశ్న రావచ్చు. కానీ, చైనాలో ఈ తరహా చర్యలకు చాలా లెక్కలుంటాయి కనుక, సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ను జైల్లోకి నెట్టేసిన ఈ పరిణామం మీద పలురకాల విశ్లేషణలు సాగుతున్నాయి.

పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ జనరల్స్‌ ఝాంగ్‌ యౌషియా, లూ జెన్‌లీల అరెస్టు వార్త ప్రపంచ రక్షణరంగ నిపుణులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. జిన్‌పింగ్‌ అధ్యక్షతలోని సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ (సీఎంసీ)కు యౌషియా ఉపాధ్యక్షుడు మాత్రమే కాక, సుప్రీంలీడర్‌కు అత్యంత సన్నిహితుడూ విశ్వాసపాత్రుడనీ అంటారు. 2022లో 20వ కమ్యూనిస్టుపార్టీ కాంగ్రెస్‌ సందర్భంగా ఏడుగురు సభ్యులతో కూడిన సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌కు ఇద్దరు ఉపాధ్యక్షులను, నలుగురుసభ్యులను జిన్‌పింగ్‌ నియమిస్తే, ఇప్పటికి ఇద్దరు వైస్‌చైర్మన్లు, ముగ్గురు సభ్యులు ఆ పదవులు కోల్పోయారు. జిన్‌పింగ్‌ సాగిస్తున్న ఈ ప్రక్షాళనలో రక్షణమంత్రికి సైతం రక్షణలేకుండా పోయింది. యౌషియాతో పాటు విచారణ ఎదుర్కొంటున్న లూ జెన్‌లీ పీఎల్‌ఏ జాయింట్‌ ఆపరేషన్స్‌ అధినేత, సీఎంసీ సభ్యుడు. రెండేళ్ళలో ఇలా అందరినీ తీసిపారేసిన తరువాత, ప్రస్తుతానికి సీఎంసీలో జిన్‌పింగ్‌తో పాటు సదరు అవినీతి ప్రక్షాళనలో ఆయనకు తోడుగా నిలుస్తున్న మరో ఉన్నతాధికారి మాత్రమే మిగిలారు.


2012లో అధికారంలోకి రాగానే అవినీతి ప్రక్షాళనకు నడుం కట్టిన జిన్‌పింగ్‌ ఇప్పటివరకూ రెండులక్షలమంది అధికారులమీద చర్యలు తీసుకున్నారట. మంచిదే కానీ, అత్యున్నతస్థాయి సైనికాధికారులను సైతం ఇలా జైళ్ళలోకి నెడితే సైన్యం సమర్థత సన్నగిల్లదా అంటారు కొందరు. 1979లో వియత్నాంతో పోరాడిన అనుభవం ఉన్న యౌషియా వంటి సీనియర్‌లను సైతం శిక్షించడం ద్వారా అత్యంత ఆప్తులను కూడా వదిలిపెట్టబోనని జిన్‌పింగ్‌ సందేశం ఇవ్వదల్చుకున్నారు. పనిలోపనిగా, ఎటువంటి ప్రశ్నలు, వ్యతిరేకతలకు ఆస్కారం లేకుండా పీఎల్‌ఏను పూర్తిగా తనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవడం కూడా సాధ్యపడుతుంది. చైనాలో పార్టీకీ, ఆర్మీకీ మధ్య ప్రేమలూ పగలూ పక్కపక్కనే ఉంటాయని అంటారు. డెంగ్‌ కాలంనుంచి అడపాదడపా ఆదేశాలను ధిక్కరించడం, ఆర్మీలో తలెగరేసే వారిని ఓ కంటకనిపెడుతూండటం ఉన్నదే. మొదట్లో పార్టీలో అసమ్మతితో పోరాడిన జిన్‌పింగ్‌ కూడా తాను సర్వశక్తిసంపన్నుడుగా అవతరించడమే సకల సమస్యలకు పరిష్కారమని నిర్ణయించుకొని, రాజ్యాంగాన్నే సవరించి, ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలో కొనసాగుతున్నారు. దేశ అణురహస్యాలను ఝాంగ్‌ యౌషియా అమెరికాకు అమ్మేశారన్నది ప్రధాన ఆరోపణ. ప్రమోషన్లలో అవినీతి, ఆయుధ కొనుగోళ్ళలో అక్రమాల వంటివి దీనికి అదనం. జిన్‌పింగ్‌ ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు కథనాలు కూడా వింటున్నాం. తైవాన్‌ను దురాక్రమించుకోవడానికి జిన్‌పింగ్‌ ఏడాది గడువువిధించారని, యౌషియా అందుకు సానుకూలంగా లేకపోవడంతో పదవి పొగొట్టుకున్నారని అమెరికా మీడియా అంటోంది. గత ఏడాది జూన్‌ రెండోవారం నుంచి జిన్‌పింగ్‌ కొంతకాలంపాటు బయటకు కనిపించకపోగానే ఆయన శకం ముగిసినట్టేనని కథనాలు వెలువడ్డాయి. జిన్‌పింగ్‌ స్థానాన్ని సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌లో ఫస్ట్‌ వైస్‌చైర్మన్‌గా ఉన్న జనరల్‌ ఝాంగ్‌ యౌషియా ఆక్రమించారని, ఆయనకు పార్టీలో సీనియర్లు, 2022 సీపీసీ మహాసభలనుంచి జిన్‌పింగ్‌ అత్యంత అవమానకరంగా గెంటేసిన మాజీ అధ్యక్షుడు హ్యూజింటావో మద్దతు ఇస్తున్నారని ఆ కథనాలు అన్నాయి. ఇప్పుడు అదే జనరల్‌ దేశ ద్రోహిగా ముద్రపడ్డాడు. నిజం ఎప్పటికీ వెలుగుచూడదు కానీ, మావో తరువాత అంతటి అత్యున్నతస్థాయి అధికారాలు అనుభవిస్తున్న జిన్‌పింగ్‌ మరికొంతకాలం అధికారంలో కొనసాగడానికి ఈ విన్యాసాలన్నీ చేస్తున్నారన్న విశ్లేషణలను కాదనలేం. జీవితకాలపు అధ్యక్షుడుగా కొనసాగదల్చుకున్న జిన్‌పింగ్‌కు సదరు కుట్రకథనాలు, అవినీతి ప్రక్షాళన చర్యలు రాజకీయ ప్రత్యర్థులను అడ్డుతొలగించుకొనే అస్త్రాలుగానే కాక, జనంలో సానుకూలత సాధించుకోవడానికి పునాదులుగా ఉపకరించవచ్చు.

Updated Date - Jan 31 , 2026 | 03:09 AM