Share News

మానవవాదమే ప్రజాస్వామ్య పరిణతి

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:21 AM

ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా మానవవాదులు, హేతువాదులు, నాస్తికులు, శాస్త్రీయ దృక్పథాన్ని విశ్వసించే ప్రజలు ప్రపంచ మానవవాద దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మానవవాదమే ప్రజాస్వామ్య పరిణతి

ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా మానవవాదులు, హేతువాదులు, నాస్తికులు, శాస్త్రీయ దృక్పథాన్ని విశ్వసించే ప్రజలు ప్రపంచ మానవవాద దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది కేవలం ఒక జ్ఞాపక దినం మాత్రమే కాదు; మానవుడే విలువల కేంద్రం, మానవ సంక్షేమమే సామాజిక వ్యవస్థల అంతిమ లక్ష్యం అనే భావనను పునరుద్ఘాటించే సందర్భం.

ప్రపంచ మానవవాద దినోత్సవం సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మానవవాదం అనేది కేవలం ఒక తాత్విక ధోరణి మాత్రమే కాదు; అది భారత రాజ్యాంగం ఆమోదించిన విలువ కూడా. ప్రపంచంలోని చాలా రాజ్యాంగాలు పౌరులకు హక్కులను కల్పిస్తాయి. కానీ భారత రాజ్యాంగం ఒక అడుగు ముందుకేసి పౌరులు ఎలాంటి విలువలను పెంపొందించుకోవాలో కూడా నిర్దేశించింది. అందులో మానవవాదానికి చోటు కల్పించడం దూరదృష్టికి నిదర్శనం.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. మానవవాదాన్ని రాజ్యాంగం ప్రోత్సహిస్తున్నప్పుడు, మన విద్యా వ్యవస్థ, పరిపాలన, సామాజిక వ్యవస్థలు ఆ విలువను ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాయి? నిజానికి భారత సమాజంలో ఇప్పటికీ కులం, మతం, జాతి, లింగం ఆధారంగా వివక్ష కొనసాగుతోంది. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, సామాజిక అసమానతలు అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మానవవాదం కేవలం ఒక సిద్ధాంతం కాదు; అది సామాజిక అవసరం. మానవవాదం మనిషిని కులం కంటే గొప్పవాడిగా చూస్తుంది. మతం కంటే మానవ గౌరవాన్ని ప్రాధాన్యంగా పరిగణిస్తుంది. జన్మ కంటే వ్యక్తిత్వాన్ని, సంప్రదాయం కంటే హేతువును, విభజన కంటే సౌభ్రాతృత్వాన్ని విలువైనవిగా భావిస్తుంది.


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ కూడా రాజ్యాంగం విజయవంతం కావాలంటే రాజ్యాంగ నైతికత సమాజంలో పెరగాలని చెప్పారు. రాజ్యాంగ నైతికతకు మూల సూత్రాలు– స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇవే మానవవాదం ప్రధాన విలువలు కూడా. మానవ వాద భావజాలం పెరగాలంటే భారతదేశంలో ప్రమాదకరంగా ఉన్న కుల వ్యవస్థ నుంచి బయటపడాలి. దేశంలో ఇప్పటివరకు మతరహితులు, నాస్తికులు, మానవవాదులను తరచుగా ‘ఇతరులు’ అనే విభాగంలో కలిపేసేవారు. వారి సంఖ్య, అవసరాలు, వారి సామాజిక స్థితి గురించి స్పష్టమైన సమాచారం ప్రభుత్వాల వద్ద ఉండేది కాదు.

మానవవాదం అనేది మానవ జీవితానికి అర్థం, విలువ, గౌరవం మానవుల నుంచే ఉద్భవిస్తాయని చెప్పే తాత్విక దృక్పథం. మానవీయ విలువల్ని పెంచడం, వాటిని అనుసరించడం కూడా మానవవాదమే. ఇది మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు; కానీ మానవ సమస్యలకు పరిష్కారాలను దైవిక జోక్యంలో కాకుండా మానవ బుద్ధి, శాస్త్ర విజ్ఞానం, నైతికత, సామాజిక బాధ్యతలలో వెతుకుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవ హక్కులు, లింగ సమానత్వం, శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామ్యం ఇవన్నీ మానవవాద ఆలోచనలో కీలక విలువలు.


భారతీయ సంప్రదాయంలో కూడా చార్వాకులు, లోకాయతులు, బౌద్ధులు, జైనులు వంటి అనేక ఆలోచనా ధోరణులు మానవవాదానికి దగ్గరగా ఉన్న భావాలను వ్యక్తపరిచాయి. ఆధునిక కాలంలో జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, పెరియార్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌, గోరా, ఎం.ఎన్.రాయ్ వంటి మహనీయులు మానవవాద, హేతువాద ఆలోచనలను సామాజిక ఉద్యమాలతో అనుసంధానించారు. దానికి కొనసాగింపుగా బి.రామకృష్ణ, గుత్తా రాధాకృష్ణ, డాక్టర్ పి.ఎం.భార్గవ, రావిపూడి వెంకటాద్రి, డాక్టర్ జయగోపాల్ లాంటి అనేక మంది సమాజం మార్పు కోసం అహర్నిశలు శ్రమించారు.

భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను హామీ ఇస్తున్నప్పటికీ, మతాన్ని అనుసరించకపోవడానికి సంబంధించిన గుర్తింపునకు ఇప్పటికీ సరైన పరిపాలనా వ్యవస్థ లేదు. ప్రభుత్వ పత్రాలు, విద్యాసంస్థలు, అనేక అధికారిక దరఖాస్తుల్లో మతం తప్పనిసరి కాలమ్‌గా కొనసాగుతున్న సందర్భాలు కనిపిస్తూనే ఉన్నాయి. నాస్తికుడు అంటే నైతికత లేని వ్యక్తి, మతరహితుడు అంటే సంప్రదాయ వ్యతిరేకి అనే అపోహలు ఇంకా సమాజంలో ఉన్నాయి. ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని రాజ్యాంగం చెబుతున్నా, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, మతపరమైన మూఢాచారాలు ఇంకా విస్తృతంగా కొనసాగుతున్నాయి. మత విశ్వాసాలను విడిచిపెట్టిన అనేక మంది కూడా కుల గుర్తింపులను పూర్తిగా అధిగమించలేకపోతున్నారు. కులం భారత సమాజంలో కేవలం మతపరమైన అంశం కాదు; అది సామాజిక, ఆర్థిక, రాజకీయ నిర్మాణాలలో బలంగా పాతుకుపోయిన వ్యవస్థ.


డాక్టర్ అంబేడ్కర్‌ చెప్పినట్లుగా కుల వ్యవస్థను నిర్మూలించకుండా నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. కులాంతర వివాహాలు, సమాన విద్యావకాశాలు, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం... ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే కులరహిత సమాజం నిర్మాణం సాధ్యమవుతుంది. రాబోయే జాతీయ జనగణనలో ‘కులం లేదు’, ‘మతం లేదు’ అనే ప్రత్యేక కాలమ్‌లను చేర్చడం ద్వారా భారతదేశం తన పౌరులందరి అస్తిత్వాన్ని సమానంగా గుర్తించాలి.

ప్రజాస్వామ్యం అంటే కేవలం మెజారిటీని గుర్తించడం కాదు; భిన్నమైన ఆలోచనలతో జీవించే ప్రతి వ్యక్తి హక్కులను గుర్తించడం కూడా. మానవవాదులు, మతరహితులు, కులరహితులు కూడా భారతదేశ పౌరులే. వారి ఉనికిని అధికారికంగా నమోదు చేయడం ప్రజాస్వామ్య పరిపక్వతకు సూచిక. ప్రపంచ మానవవాద దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని గుర్తుచేస్తుంది. మనిషి కేంద్రంగా మానవత్వం ఆధారంగా మానవ హక్కులను కాపాడి గౌరవించే సమాజమే నిజమైన నాగరిక సమాజం.

- వహీద్

కుల నిర్మూలన సంఘం

(నేడు ప్రపంచ మానవవాద దినోత్సవం)

Updated Date - Jun 21 , 2026 | 12:22 AM