అంకెల వలయంలో శ్రామికుడు !
ABN , Publish Date - May 10 , 2026 | 12:34 AM
మన కాలంలో అత్యంత భయంకరమైన అబద్ధాలు అందమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల రూపంలోను, రంగురంగుల చార్టులు, నివేదికల రూపంలోను వస్తాయి.
మన కాలంలో అత్యంత భయంకరమైన అబద్ధాలు అందమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల రూపంలోను, రంగురంగుల చార్టులు, నివేదికల రూపంలోను వస్తాయి. ఆధునిక సామ్రాజ్యవాదం ఇప్పుడు దేశాలను ఆక్రమించడం లేదు, అది నేరుగా మనుషుల శ్రమనూ, వారి జీవించే హక్కును ఆక్రమిస్తోంది. ఈ వ్యవస్థీకృత హింసను కప్పిపుచ్చడానికి కార్పొరేట్ శక్తులు ఎంచుకున్న తాజా ఆయుధమే ఇటీవలి ‘వర్క్ ఇండియా’ నివేదిక.
ఈ నివేదికను పైపైన చూస్తే, భారతదేశంలో శ్రామికవర్గం పాలు తేనెల్లో తేలియాడుతున్నట్లు, వారి జీవితాల్లో ఏదో అద్భుతమైన స్వర్ణయుగం నడుస్తున్నట్లు అనిపిస్తుంది. బ్లూ కాలర్ కార్మికులు వైట్ కాలర్ ఉద్యోగుల కంటే వేగంగా ఎదుగుతున్నారని, వారి జీతాలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఒక అద్భుతమైన భ్రమను అల్లుతుంది. కానీ, ఈ అంకెల తెరను చీల్చి చూస్తే అక్కడ కనిపించేది అభివృద్ధి కాదు, దశాబ్దాలుగా రక్తం చిందించి కార్మికులు సాధించుకున్న హక్కులపై ముప్పేట దాడి.
వర్క్ ఇండియా నివేదిక యాజమాన్యాల ప్రయోజనాల కోసం పకడ్బందీగా అల్లిన ఒక కార్పొరేట్ కుట్ర. గణాంకాల గారడీ, ఆకలిని కప్పిపుచ్చే అంకెల అబద్ధం. ఈ నివేదిక ప్రకారం, 2024లో బ్లూ కాలర్ కార్మికుల సగటు వేతనం నెలకు రూ.14,056 ఉంటే, 2025 నాటికి అది 8.6శాతం పెరిగి రూ.15,265కు చేరిందట. కాగితాల మీద ఈ 8.6 శాతం అనేది ఒక అద్భుతమైన వృద్ధి లాగా కనిపిస్తుంది. కానీ ఈ దేశంలో వీధి అంచున నిలబడి బతుకు పోరాటం చేసే సగటు మనిషిని అడిగితేనే, ఈ రూ.1,200 పెరుగుదల వాస్తవానికి ఒక పెంపా లేక అవమానమా అనేది అర్థమవుతుంది. మార్కెట్‌లో నిశ్శబ్దంగా తిరుగుతూ పేదవాడి కంచంలోని ముద్దను ఎత్తుకుపోయే ‘ద్రవ్యోల్బణం’ అనే రాక్షసుడి గురించి ఈ నివేదిక ఎందుకు మాట్లాడదు? పెట్రోల్ ధరలు, కూరగాయల ధరలు, కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు ఇరవై ముప్పై శాతాలు పెరుగుతున్నప్పుడు, ఈ ఎనిమిది శాతం జీతం పెంపు అనేది కార్మికుడి కడుపు నింపుతుందా, లేక వాడిని మరింత అప్పుల ఊబిలోకి నెడుతుందా?
జాతీయ లేబర్ వేజెస్ కమిషన్ స్వయంగా ఒక సెమీ-స్కిల్డ్ వర్కర్‌కు నెలకు కనీసం రూ.30,000 (రోజుకు రూ. 1,000) వేతనం ఉండాలని ఘోషిస్తుంటే, కార్పొరేట్ రాబందులు మాత్రం రూ.15,265 ఇచ్చి, అదేదో మహాభాగ్యం అన్నట్లు నివేదికలు వండివార్చడం వారి అహంకారానికి, శ్రమ దోపిడీకి పరాకాష్ఠ. నిజమైన వృద్ధి అనేది మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉండాలి, దాని ప్రకారమైతే ఇక్కడ కార్మికుడి జీవితం పాతాళానికి దిగజారుతోంది.
పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎప్పుడూ ఒక పాత వ్యూహం ఉంటుంది. ‘‘బాధితులను ఒకరిపై ఒకరిని ఉసిగొల్పు, అప్పుడు వారు అసలు దోపిడీదారుడిని ప్రశ్నించరు.’’ వైట్ కాలర్, బ్లూ కాలర్ ఉద్యోగుల జీతాలను పోల్చడం వెనుక ఉన్న కుట్ర ఇదే. వైట్ కాలర్ ఉద్యోగికి (అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్) కనీసం బేసిక్ జీతంతో పాటు ప్రతి ఏటా పెరిగే డీఏ, టీఏ వంటి రక్షణ కవచాలు ఉంటాయి. కానీ అగ్నిగుండం లాంటి ఫ్యాక్టరీలో, ఎండలో కరిగే బ్లూ కాలర్ కార్మికుడికి దక్కేది కేవలం ఆ కనీస వేతనం మాత్రమే. ఈ రెండు వర్గాలను పోల్చి, ‘‘చూడండి ఏసీ గదుల్లో ఉండే వైట్ కాలర్ ఉద్యోగుల కంటే బ్లూ కాలర్ కార్మికులకే జీతాలు ఎక్కువగా పెరుగుతున్నాయి’’ అని ప్రచారం చేయడం ఒక పచ్చి అబద్ధం. సమాజంలో కార్మికుల పట్ల ఉండే సానుభూతిని చంపేసి, ‘‘వారికి అన్నీ అందుతున్నాయి, వారు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’’ అనే ఒక తప్పుడు నెరేటివ్‌ను ప్రజల మెదళ్లలో నాటడానికే ఈ తరహా నివేదికలు వెలువడుతూంటాయి.
ఈ నివేదికలు ఎందుకు ఇప్పుడే పుట్టుకొస్తున్నాయి? కార్మికులు శతాబ్ద కాలంగా రక్తం, కన్నీరు చిందించి, లాఠీ దెబ్బలు తిని సాధించుకున్న 29 చట్టాలను చెత్తబుట్టలో వేసి, కేవలం నాలుగు ‘లేబర్ కోడ్స్’ను ప్రభుత్వాలు అమలు చేయబోతున్నాయి. ఈ కోడ్స్ అన్నీ యాజమాన్యాల దోపిడీని చట్టబద్ధం చేసేవే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ముసుగులో జరుగుతున్న ఈజ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటింగ్ హ్యూమన్స్ (మనుషులను దోచుకునే వెసులుబాటు) ఇది. క్రూరమైన నాలుగు లేబర్ కోడ్స్‌కు సామాజిక మద్దతును కూడగట్టడానికే ఇలా కార్మికుల జీతాలపై అక్కసు వెళ్లగక్కుతూ నివేదికలు ఇప్పిస్తున్నారు.
పెట్టుబడిదారీ వ్యవస్థకు మానవత్వం ఉండదు, దానికి తెలిసింది లాభం మాత్రమే. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న మినీ వరల్డ్ వార్‌ను సైతం మన దేశంలోని కార్పొరేట్ శక్తులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. కార్మికుల జీతాల్లో కోత విధించడానికి, కనీస వేతనాలు పెంచకుండా ఉండటానికి అంతర్జాతీయ పరిణామాలను అవి ఒక సాకుగా వాడుకుంటాయి. సంక్షోభం వచ్చినప్పుడు నష్టాలను కార్మికుల నెత్తికి రుద్దడం, లాభాలు వచ్చినప్పుడు వాటిని స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడం కార్పొరేట్ సంస్థల నైజం.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కేవలం పీల్చుకోవడానికి గాలిని మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి ‘గౌరవప్రదమైన జీవన హక్కు’ను ప్రసాదించింది. పెరుగుతున్న ధరల మధ్య రూ.15,000తో నెట్టుకొచ్చే జీవితం గౌరవప్రదమైనది కాదు. ఇది కేవలం కొద్దిమంది జీతాల సమస్య కాదు. ఇది శ్రామిక వర్గం మనుగడకు, కార్పొరేట్ విధ్వంసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ అంకెల గారడీని, ఈ నివేదికల విషాన్ని కార్మిక లోకం గుర్తించాలి. బ్లూ కాలర్, వైట్ కాలర్ అనే భేదాలు మర్చిపోయి ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా నిలబడాలి. మన నెత్తురును లాభాలుగా మార్చుకునే ఆ నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసే వరకు ఎలుగెత్తి పోరాడాలి.
-నంబూరి శ్రీమన్నారాయణ
సుప్రీంకోర్టు న్యాయవాది