నవ భారత నిర్మాణానికి నారీశక్తి ఊతం!
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:21 AM
మహిళా సాధికారత సనాతన భారతంలో కొత్త భావన కాదు. మన సంస్కృతిలో ఇది వేల ఏళ్లుగా ఉన్న ఆచరణ. వేదకాలంలో మహిళలు జ్ఞానంలో, ధర్మంలో, సమాజ నిర్మాణంలో, అభివృద్ధిలో, వేదాంత చర్చలలో ప్రధాన పాత్ర పోషించారు.
మహిళా సాధికారత సనాతన భారతంలో కొత్త భావన కాదు. మన సంస్కృతిలో ఇది వేల ఏళ్లుగా ఉన్న ఆచరణ. వేదకాలంలో మహిళలు జ్ఞానంలో, ధర్మంలో, సమాజ నిర్మాణంలో, అభివృద్ధిలో, వేదాంత చర్చలలో ప్రధాన పాత్ర పోషించారు. ఉభయ భారతి, గార్గి, మైత్రేయి వంటి మహానుభావురాళ్లు సమాజానికి మార్గదర్శకులయ్యారు. ‘‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’’ అనే భావం మహిళలకు భారత సంస్కృతిలో ఉన్న గౌరవాన్ని స్పష్టం చేస్తోంది.
కాలక్రమేణా విదేశీ దాడులు, సామాజిక మార్పులు, వలస పాలన వంటి కారణాల వల్ల మహిళల స్థానం క్రమంగా తగ్గింది. స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగం సమానత్వాన్ని ఇచ్చినా, రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం తక్కువగానే ఉంది. మహిళా రిజర్వేషన్ గురించి ఎన్నో దశాబ్దాలుగా చర్చలు జరిగాయి కానీ అమలు కాలేదు. ఈ లోటు ప్రజాస్వామ్యంలో అసమతుల్యతను కలిగించింది. 2023 సెప్టెంబర్ 19న మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 20న లోక్‌సభ ఆమోదించింది, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఆమోదం పొందింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారింది. ఈ చరిత్రాత్మక నిర్ణయం భారత రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు.
భారత ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఈ బిల్లు కేవలం ఆమోదం పొందడమే కాదు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో మరింత స్పష్టతతో అమలు దిశగా ముందుకు సాగింది. తన ప్రసంగంలో మోదీజీ మహిళా శక్తిని దేశ అభివృద్ధికి కీలక శక్తిగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం సుమారు 14శాతం మాత్రమే ఉండేది. రాష్ట్ర అసెంబ్లీలలో ఇది సాధారణంగా 8శాతం నుంచి 10శాతం మధ్యలోనే ఉంది. ప్రపంచ సగటు మహిళల ప్రాతినిధ్యం పార్లమెంట్లలో సుమారు 26శాతం వరకు ఉంది. ఈ సంఖ్యలు మన దేశంలో ఉన్న లోటును స్పష్టంగా చూపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అమలు కాబోతున్న 33శాతం ప్రపంచంలోనే భారత మహిళను శక్తిమంతం చేస్తుంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ద్వారా ఈ బిల్లును వేగంగా ముందుకు తీసుకెళ్లడం, 2029 నాటికే అమలు దిశగా స్పష్టమైన సంకల్పాన్ని చూపిస్తోంది. ఇది కేవలం చట్టపరమైన ప్రక్రియ కాదు, ఇది ఒక దిశానిర్దేశం. మహిళల ప్రాతినిధ్యం పెరగడం అనేది కేవలం సంఖ్యల విషయం కాదు. ఇది పాలనలో నాణ్యతను పెంచే అంశం. మహిళలు సమాజ సమస్యలపై లోతైన అవగాహనతో, సున్నితమైన దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం, విద్య, సంక్షేమం వంటి ముఖ్య రంగాల్లో మరింత సమగ్రమైన విధానాలు అమలవుతాయి.
ఈ బిల్లుతో సామాజికంగా మహిళల భద్రత, గౌరవం, హక్కులపై మరింత దృష్టి పెరుగుతుంది. ఆర్థికంగా మహిళల భాగస్వామ్యం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. పాలనలో సమానత్వం పెరిగి ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. సాంస్కృతికంగా కూడా ఇది మన పురాతన విలువలకు అనుగుణంగా ‘‘శక్తి’’ భావనను మళ్లీ స్థాపిస్తుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మన సంస్కృతి, ఆధునికతల మధ్య ఒక బలమైన సేతువుగా నిలుస్తోంది. ఇది కేవలం స్థానాల కేటాయింపు కాదు. ఇది సమానత్వానికి, శక్తిమంతమైన భారత నిర్మాణానికి ఒక దిశా నిర్దేశం.
- సాదినేని యామినిశర్మ
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి