పనగారియా సలహాలను పాలకులు పాటిస్తారా?
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:38 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయంగా అభిమానించే ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరవింద్ పనగారియా. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఇరువురి మధ్య భావ సమైక్యత ఉన్నది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయంగా అభిమానించే ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరవింద్ పనగారియా. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఇరువురి మధ్య భావ సమైక్యత ఉన్నది. ప్రొఫెసర్ పనగారియా నీతి ఆయోగ్‌కు మొదటి చైర్మన్ (జనవరి 2015–ఆగస్టు 2017). భారత్ తరఫున జీ–20 షెర్పా (2015–17)గా కూడా ఆయన వ్యవహరించారు. ఏప్రిల్ 2023లో నలందా విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా ఆయన నియమితులయ్యారు. డిసెంబర్ 2023లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం నియమించిన అనేక టాస్క్‌ఫోర్స్‌లకు పనగారియా నేతృత్వం వహించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పనగారియా సుదీర్ఘకాలం వివిధ పదవులు నిర్వహించడం విశేష ప్రాధాన్యమున్న విషయం. డాక్టర్ పనగారియా కొలంబియా విశ్వవిద్యాలయంలో శాశ్వత ఆచార్యుడు. తన మెంటార్ డాక్టర్ జగదీశ్ భగవతి వలే పనగారియా కూడా స్వేచ్ఛా వాణిజ్యవాది. స్వేచ్ఛా వాణిజ్యం, మూలధన ప్రవాహాలను అనుమతించే బహిరంగ ఆర్థిక వ్యవస్థలను ఎటువంటి మినహాయింపులు లేకుండా ఇరువురూ సమర్థిస్తారు. ఇందుకు వారిపట్ల నాకు ఎంతో గౌరవ భావమున్నది.
డాక్టర్ పనగారియా ఇటీవల ఒక వ్యాసంలో ప్రభుత్వాన్ని ఇలా అభినందించారు: ‘2025వ సంవత్సరం చరిత్రలో ఆర్థిక సంస్కరణల సంవత్సరంగా నిలిచిపోతుంది’. అది నిజం కాదని పనగారియాకు బాగా తెలుసు. 2025లో చాలా స్వల్ప సంస్కరణలు మాత్రమే జరిగాయి. మీడియా కథనాలు, పార్లమెంటరీ చర్చలను పరిశీలిస్తే 2025 సంవత్సరంలో ‘ఆర్థిక సంస్కరణలు’గా చెప్పదగినవి ఏవీ అమలు కాలేదని స్పష్టమవుతుంది. వస్తుసేవల పన్ను రేట్ల సరళీకరణ, తగ్గింపు– జూలై 2017లో చేసిన అసలు పాపానికి ప్రాయశ్చితం చేసుకోవడమే; కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ కూడా దేశీయ పరిశ్రమల సంరక్షణ చర్యల కింద ఆ సుంకాలను పెద్ద ఎత్తున పెంచడం, అలాగే యాంటీ–డంపింగ్, భద్రతా సుంకాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుకోవడమే; కార్మిక చట్టాలను పటిష్ఠపరచడం ఇప్పటికే బాగా ప్రయోజనం పొందుతున్న పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయమే. నోరు తిరగని పేరు (వీబీ–జీ–రామ్–జీ) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ప్రవేశపెట్టిన కొత్త ఉపాధి చట్టం ప్రపంచ అతిపెద్ద ఉపాధి–సంక్షేమ పథకాన్ని కూల్చివేసింది. ప్రొఫెసర్ పనగారియా మీద పరిపూర్ణ గౌరవంతోనే గణనీయమైన ఆర్థిక సంస్కరణల సంవత్సరంగా 2025 చరిత్ర కెక్కదని నేను గట్టిగా భావిస్తున్నాను. నిజానికి 2026లో ప్రభుత్వం విధిగా ఆరు చర్యలు చేపట్టాలని పనగారియా సిఫారసు చేశారు. అవి, ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన సలహాలు అనడంలో సందేహం లేదు.
ఆ ఆరు సిఫారసులు ఏమిటో చూద్దాం: కస్టమ్స్ సుంకాలను వెనక్కి తీసుకోవడం. దిగుమతి సుంకాలను తగ్గించడం లేదా తొలగించాలని పనగారియా నిష్కర్షగా చెప్పారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే దిగుమతులకు వర్తించే సగటు టారిఫ్ రేటును తగ్గించి తీరాలి. ప్రతి సుంకాన్ని నిర్దిష్ట శ్రేణి సరుకుల వాస్తవ పరిమాణం లేదా వాటి వాస్తవ వాణిజ్య విలువ ప్రాతిపదికన లెక్కించాలి. ఈ మేరకు అన్ని సరుకులపై సుంకాన్ని 6.34శాతానికి యూపీఏ ప్రభుత్వమే తగ్గించింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ సగటు దిగుమతి సుంకం దాదాపు 12 శాతానికి పెరిగింది. అన్ని రకాల దిగుమతులపై ఏకరీతిగా 7శాతం సుంకాన్ని విధించాలని పనగారియా సిఫారసు చేశారు.
నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల (క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్– క్యూసీఓ) ఉపసంహరణ పూర్తి చేయాలి అన్నది రెండో సిఫారసు. ఇవి దిగుమతులకు సుంకాలేతర అవరోధాలు. అవే నాణ్యతా ప్రమాణాలను భారతీయ ఉత్పత్తులకు కూడా వర్తింపజేస్తే మన ఉత్పత్తులు ఎన్ని నిలుస్తాయి? 2025లో 22 క్యూసీఓలను ఉపసంహరించినందుకు ప్రభుత్వాన్ని పనగారియా అభినందించారు. అయితే ఈ 22 క్యూసీఓలను మొదట ఉపసంహరించింది ఎవరు?; వాణిజ్య ఒప్పందాల గురించి ప్రస్తావిస్తూ ‘దిగుమతుల సరళీకరణను మనం స్వతస్సిద్ధంగా ప్రతిఘటిస్తున్నామని’ పనగారియా వ్యాఖ్యానించారు. ‘మనం’ అంటే ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వమే కాదూ? రెండు దశాబ్దాల దిగుమతి సరళీకరణ విధానాన్ని వ్యతిరేకించింది. విదేశీ వాణిజ్య విధానాన్ని కఠినం చేసింది. 2018లో సీపీటీపీపీపై సంతకం చేసేందుకు అందిన ఆహ్వానాన్ని ఆమోదించలేదు. 2019లో ఆర్‌సీఈపీ నుంచి ఉపసంహరించుకున్నది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల పట్ల విముఖత చూపింది; డీజీటీఆర్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్)ను సంయమనపరచాలని పనగారియా సిఫారసు చేశారు. ప్రపంచ సరుకుల వాణిజ్యంలో భారత్ వాటా కేవలం 2.8 శాతం మాత్రమే. అయినా వివిధ సరుకులపై మన దేశం 250 యాంటీ డంపింగ్ సుంకాలు విధించింది.
రూపాయి విలువను అధికం చేయవద్దని పనగారియా సిఫారసు చేశారు. మారకం రేటు చాలా సున్నితమైన అంశం. విదేశీ మారక ద్రవ్యం ప్రవాహం, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు మొదలైన విషయాలతో అది ప్రభావితమవుతుంది. అధిక విలువ రూపాయి ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కనుక రూపాయి విలువ విషయాన్ని మార్కెట్‌కు వదిలివేయడం మంచిది; ఎగుమతుల పర్యవేక్షణకు విధానపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. సవాలక్ష నిబంధనలు, ఆదేశాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు దరఖాస్తుల వ్యవహారం, అనుమతులు సాధించడం మొదలైనవి ఎగుమతులకు ప్రతిబంధకమవుతున్నాయి.
16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా అరవింద్ పనగారియా విధాన వైఖరి 2026–27 కేంద్ర బడ్జెట్‌కు కీలకమైనది. రాబోయే కొత్త బడ్జెట్ నుంచి మనం ఏమి ఆశించవచ్చో పనగారియా వ్యాసం సూచిస్తోంది. అలాగే ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం నిర్వహిస్తోన్న తీరు తెన్నుల పట్ల ఆయన అసంతృప్తిని ఆ వ్యాసం వ్యక్తం చేసిందని కూడా భావించవచ్చు. ఆయన సిఫారసులను మోదీ ప్రభుత్వం ఆమోదిస్తే నేను అమితంగా సంతోషిస్తాను. పనగారియాను అభినందిస్తాను. ఆయన సిఫారసుల అమలు తరువాత తీసుకోవల్సిన ఆరు లేదా అరవై చర్యలను సైతం సూచించాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తాను. ఒక భద్ర భవిష్యత్తుకు భారత్ ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉన్నది. ఇది మనం సదా జ్ఞాపకం ఉంచుకోవల్సిన వాస్తవం.
-పి. చిదంబరం