శాసనాధార పేరు ప్రయాణమే నా వ్యాసోద్దేశం!
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:16 AM
అక్టోబరు 10న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘15 శతాబ్దాల విజయవాడ ప్రయాణం!’ అనే నా వ్యాసంపై చెరుకూరి జ్యోతి రాసిన వ్యాసం ‘1950ల్లోనే బెజవాడకు గ్రహణం’ అనే శీర్షికతో..
అక్టోబరు 10న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘15 శతాబ్దాల విజయవాడ ప్రయాణం!’ అనే నా వ్యాసంపై చెరుకూరి జ్యోతి రాసిన వ్యాసం ‘1950ల్లోనే బెజవాడకు గ్రహణం’ అనే శీర్షికతో అక్టోబర్ 14న ప్రచురితమైంది. వాస్తవంగా చారిత్రక ఆధారాలతో రాసిన నా వ్యాసంలోని ఏ అంశంతో ఆమె విభేదిస్తున్నారో అర్థం కాలేదు. కానీ, బ్రిటిష్వారు బెజవాడగా రికార్డుల్లోకి ఎక్కించిన ఈ నగరం పేరును, 1950లలో విజయవాడగా అధికారికంగా మార్చారు. ‘తిరిగి బెజవాడగా మార్చితే మంచిది.., రాజమండ్రిని రాజమహేంద్రవరం అని మార్చినట్లు’ అనేది ఆమె భావనగా అర్థం చేసుకున్నాను. 1950లలో జరిగిన ఈ అధికారిక పేరు మార్పును ఎందుకు ప్రస్తావించలేదని నన్ను ప్రశ్నించారు. నా వ్యాసోద్దేశానికి సంబంధం లేని ఇలాంటి మరో రెండు ప్రశ్నలను కూడా ఆమె వేశారు.
అధికారిక పేరు మార్పుల విషయాలను చర్చించడం, బెజవాడ అనే పేరు సాంస్కృతికంగా ఎలా విస్తరించిందన్నది చెప్పడం నా వ్యాసంలోని విషయం కాదు. విజయవాడ పేరు బ్రిటిష్ రికార్డుల్లో బెజవాడగానే నమోదైందన్నది వాస్తవం. అలాగే జ్యోతి పేర్కొన్నట్లు దుర్గమ్మ గ్రామదేవత అనే చరిత్రకారుల నిశ్చితాభిప్రాయాన్ని నేనూ నమ్ముతున్నాను. ఆ మాటకొస్తే, విజయవాడ పేరు కూడా ఈ గ్రామదేవత పేరు నుంచే ఉద్భవించిందన్నది ఒక జానపద కథనం. శాతవాహనుల కంటే ముందే ఈ ప్రాంతంపై కళింగ రాజుల ప్రభావం ఉండటం వల్ల విజయవాటిక పేరు భాషాపరంగా బిజయవాటికగా పరిణామం చెంది ఉండవచ్చన్నది ఒక అంచనా. మల్లేశ్వర పేరును ప్రస్తావించడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. ఒక శాసన పాఠంలో భాగంగా వచ్చింది తప్ప అందులో ప్రత్యేక ఉద్దేశం ఏముంటుంది!
వేల ఏళ్ల చరిత్ర ఉన్నా, ఏ నగరమూ ప్రతి దశలోనూ విస్తారమైన జనాభాతో కళకళలాడిందని చెప్పలేం. తెలుగు నేలపై మచిలీపట్నం, మోటుపల్లి, ఘంటసాల వంటివి తొలి రేవు కేంద్రాలుగా నిలిచాయి. అందువల్లే బందరు అనేక శతాబ్దాలుగా పెద్ద పట్టణంగా కొనసాగి, 20వ శతాబ్దం తొలినాళ్లలో విశాఖ, విజయవాడతో సమస్థాయిలో ఉంది. తరువాత కాలంలో విజయవాడ తెలుగునాట అతిపెద్ద రాజకీయ కేంద్రంగా ఎదిగింది. కొన్ని దశల్లో ఈ నగరం ఇతర పట్టణాల కంటే తక్కువ జనాభా కలిగినదిగా ఉండి ఉండవచ్చు. బెజవాడ పేరు ఇంటిపేర్లుగా సాంస్కృతికంగా విస్తరించడం నిజమే. కానీ నా వ్యాసం ఉద్దేశం అది కాదు. విజయవాట, విజయవాటిక, బిజవాడ, బెజవాడ.. ఇలా మారి స్థిరపడి శాసనాలకు ఎక్కిన ప్రతి పేరునూ (నా దృష్టికి వచ్చిన) నేను ప్రస్తావించాను.
ఇక, రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్చినట్లే, విజయవాడను బెజవాడగా మార్చాలనేది ఆమె అభిప్రాయం. ఒక ప్రాంతానికి వేర్వేరు కాలాల్లో వేర్వేరు పేర్లు ఉండవచ్చు. కొన్ని పేర్లు శాసనాల్లో కనిపించవచ్చు. మరికొన్ని ప్రజల నిత్యవాడుకలో ప్రాచుర్యం పొందవచ్చు. విజయవాడ, బెజవాడ పేర్ల విషయంలోనూ ఈ భేదాన్ని గుర్తించాలి. రెండు పేర్లకూ చారిత్రక నేపథ్యం ఉంది. విజయవాట, విజయవాడ రూపాలు ఉనికిలో ఉంటూనే బెజవాడ అనే పేరు వెయ్యేళ్లుగా జనసామాన్యంలో ఉంది. బ్రిటిష్వారు దానిని రికార్డులలో చేర్చారు. 1950లలో బ్రిటిష్ రికార్డులలోని బెజవాడ పేరును బెజవాడ కంటే ముందు రూపమైన విజయవాడ (విజయవాట)గా మార్చారు. ఈ ఏడు దశాబ్దాలలో ఆ పేరు అధికారికంగా కూడా స్థిరపడింది. రాజమండ్రి సూత్రం ఇక్కడ ఇప్పటికే అమలు జరిగింది కదా! కారణాంతరాల వల్ల మారిన పేరు కంటే... విశిష్టార్థం ఉన్న, అంతకు మించిన చరిత్ర ఉన్న ‘విజయ’వంతమైన పేరుకే ఎప్పుడూ ప్రజామోదం ఎక్కువ.
నేటికీ చాలామంది విజయవాడను బెజవాడ అంటుంటారు. ఆ పేరుతో ఇంటిపేర్లు కూడా ఉన్నాయి. స్థానిక సంస్కృతి, ప్రజల జ్ఞాపకాలు, చారిత్రక వాడుకలో బెజవాడకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ అంశాల వల్ల బెజవాడ పేరును గౌరవించాలంటే విజయవాడ పేరును తిరస్కరించాల్సిన అవసరం లేదు. అలాగే, విజయవాడ పేరును సమర్థించాలంటే బెజవాడ చరిత్రను విస్మరించాల్సిన అవసరమూ లేదు.
- టి. కొండబాబు