విగ్రహాలతో ఆదివాసీల అభివృద్ధి జరగదు!
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:35 AM
దేశ జనాభాలో దాదాపు పది కోట్ల మందికి పైగా ఆదివాసీలు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా, వారు ఇప్పటికీ భూమి, అడవి, సహజ వనరులపై తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు.
దేశ జనాభాలో దాదాపు పది కోట్ల మందికి పైగా ఆదివాసీలు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా, వారు ఇప్పటికీ భూమి, అడవి, సహజ వనరులపై తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రతో ఆదివాసీలకు విడదీయరాని బంధం ఉంది. అడవుల్లోని ఖనిజ సంపదను బ్రిటిష్ పాలకులు దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారికి వ్యతిరేకంగా ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. 1855–56లో జరిగిన సంతాల్ తిరుగుబాటు ఈ ఉద్యమాలకు నాంది పలికింది. అనంతరం బిర్సా ముండా, కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి నాయకుల సారథ్యంలో జరిగిన పోరాటాలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేశాయి.
స్వాతంత్ర్యం అనంతరం... ఆదివాసీల హక్కుల ప్రాధాన్యాన్ని ప్రముఖ ఆదివాసీ నాయకుడు జైపాల్‌సింగ్ ముండా నొక్కి చెప్పారు. బి.ఆర్.అంబేడ్కర్ ఐదవ, ఆరవ షెడ్యూళ్ల ద్వారా ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయంగా కూడా ఆదివాసీల హక్కులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 2007లో ఐక్యరాజ్యసమితి ‘యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్స్’ను ఆమోదించింది. అలాగే, అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా ఆదివాసీల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించే ప్రయత్నం చేసింది.
ఆదివాసీల హక్కుల కోసం పలు చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ‘పెసా’ చట్టం గ్రామసభలకు విస్తృత అధికారాలను కల్పించింది. కానీ అనేక రాష్ట్రాల్లో ఈ చట్టం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అభివృద్ధి పేరుతో చేపట్టే– ఆనకట్టలు, గనుల తవ్వకాలు, పరిశ్రమలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటి అనేక పనులు ఆదివాసీలను నిర్వాసితులుగా మార్చుతున్నాయి. నర్మదా, హీరాకుడ్, పోలవరం వంటి ప్రాజెక్టులే దీనికి ఉదాహరణ.
నేటికీ చాలా రాష్ట్రాల్లో ఆదివాసీలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వాలు ఒకవైపు ఆదివాసీ దినోత్సవాలు జరుపుతూ బిర్సా ముండా వంటి నాయకుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తుండగా, మరోవైపు ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు, కార్యకర్తలు నిర్బంధాలకు గురవుతుండటం ఒక విరుద్ధమైన పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఆదివాసీల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదు. అందువల్ల పెసా చట్టాన్ని కచ్చితంగా అమలుచేయడంతో పాటు, విద్య, ఉపాధి, స్వయం ప్రతిపత్తి, సాంస్కృతిక హక్కుల పరిరక్షణ ద్వారానే ఆదివాసీ సంక్షేమం సాధ్యమవుతుంది. అప్పుడే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి నిజమైన అర్థం చేకూరుతుంది.
- దొగ్గల రాజుకుమార్
(ఆగస్టు 9: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం)