మన దేశానికి తారు రోడ్లు మేలు!
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:18 AM
స్వాభావికంగా మనది ఉష్ణ మండల దేశం గనుక, మన ప్రభుత్వాలు భూ వాతావరణం వేడెక్కి పోవటానికి కారణమవుతున్న సిమెంట్ రోడ్ల కంటే తారు రోడ్లకి ప్రాధాన్యతనివ్వాలి. సిమెంటు రోడ్లకు ఇరువైపుల...
స్వాభావికంగా మనది ఉష్ణ మండల దేశం గనుక, మన ప్రభుత్వాలు భూ వాతావరణం వేడెక్కి పోవటానికి కారణమవుతున్న సిమెంట్ రోడ్ల కంటే తారు రోడ్లకి ప్రాధాన్యతనివ్వాలి. సిమెంటు రోడ్లకు ఇరువైపుల మార్జిన్లు ఉండే విధంగా చిన్న రోడ్లు వేస్తే, వర్షం నీరు మార్జిన్లు పీల్చుకుంటాయి. కానీ మార్జిన్ కంటే రోడ్డు ఎత్తుగా ఉండడం వల్ల వాహనదారులకి, పాదచారులకి కూడా ఇబ్బందే. మార్జిన్లు లేకుండా వెడల్పు రోడ్లు వేస్తే వ్యయ ప్రయాసలే గాక ఒక మోస్తరు వర్షం కురిసినా, నీటితో రోడ్లు జలమయమై వర్షం నీరు డ్రైనేజీల ద్వారా వృథాగా పోతుంది. ఒకటి రెండు రోజులకే మళ్ళీ ఉక్కపోత పెరుగుతుంది. ఒకప్పుడు ఖాళీ/అటవీ భూములు, బావులు, చెరువులు, కుంటలు విస్తారంగా ఉండేవి. ఇప్పుడు సిమెంట్ రోడ్లు, పట్టణీకరణతో కాంక్రీటు జంగిల్స్ పెరిగాయి. నేడు వాతావరణం వేడెక్కటానికి అదో కారణం. తారు రోడ్లు వేస్తే, పక్కన మార్జిన్ నేల వర్షపు నీరు పీల్చుకుని త్వరగా ఉష్ణోగ్రత పెరగదు, నిర్మాణ వ్యయం చాలా తక్కువ. నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించి తారు రోడ్లు వేస్తే ఎక్కువకాలం మన్నుతాయి. అంతేకాక ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు, జేసీబీలు తిరగటం వల్ల తారు, సిమెంట్ రోడ్లు త్వరలోనే ఛిద్రమైపోతున్నాయి. అవి పబ్లిక్ రోడ్లపైకి రావాలంటే అభివృద్ధి చెందిన దేశాలలో వలె ఆ వాహన డ్రైవర్లు రబ్బరు ప్యాడ్లు, ప్రొటెక్టివ్ కార్పెట్లు వేసి నడిపించేటట్లు మొదట వారిని చైతన్యపరచాలి. లెక్కచేయకపోతే నిబంధనల మేర చర్యలు చేపట్టాలి. ఇనుప చక్రాల వాహనాలను పబ్లిక్ రోడ్లపై నడిపితే ప్రజలకి జరిగే నష్టంపై ప్రసార సాధనాల ద్వారా అవగాహన కలిగించాలి. ఇక గృహ నిర్మాణాల వేళ రాడ్ బెండింగ్ వంటి పనుల్ని పబ్లిక్ రోడ్లపై చేస్తే నిబంధనలు మేరకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
తిరుమలశెట్టి సాంబశివరావు
Also Read:
వర్షాకాలంలో ప్రయాణం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఇంట్లో గులాబీ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి