Share News

గాంధీ గర్వించే ‘దేశద్రోహులు’!

ABN , Publish Date - Aug 08 , 2026 | 01:43 AM

‘ఏ దేశ పౌరులలోనైనా మహోన్నతులు ఎవరు? ప్రజాహితాన్ని పట్టించుకోని పాలకులను ప్రశ్నించేవారు, అధికారానికి ఎట్టి పరిస్థితులలోను మోకరిల్లనివారు, దేశ స్వాతంత్ర్యాన్ని, జాతి గౌరవాన్ని కాపాడేందుకు..

గాంధీ గర్వించే ‘దేశద్రోహులు’!

‘ఏ దేశ పౌరులలోనైనా మహోన్నతులు ఎవరు? ప్రజాహితాన్ని పట్టించుకోని పాలకులను ప్రశ్నించేవారు, అధికారానికి ఎట్టి పరిస్థితులలోను మోకరిల్లనివారు, దేశ స్వాతంత్ర్యాన్ని, జాతి గౌరవాన్ని కాపాడేందుకు, అవసరమైతే ప్రభుత్వాన్ని సైతం ఎదిరించేందుకు వెనుకాడనివారే నిక్కమైన దేశభక్తులు, గొప్ప పౌరులు’ – ఇవి, ఫ్రెంచ్‌ రచయిత ఆల్బర్ట్‌ కామూ ఉద్ఘాటించిన సత్యాలు.

ఇరవయో శతాబ్ది బ్రిటిష్‌ చరిత్రకారులలో అగ్రగణ్యుడైన ఏజేపీ టేలర్‌ ఆధునిక జర్మనీ, ఆధునిక బ్రిటన్‌, ప్రథమ, ద్వితీయ ప్రపంచ యుద్ధాలు, లార్డ్‌ బీవర్‌ బ్రూక్‌ మీడియా సామ్రాజ్యంపై పలు పుస్తకాలు రాశారు. అయితే అన్నిటిలోకి తనకు బాగా ఇష్టమైన పుస్తకం ‘The Trouble Makers’ అని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. గ్రేట్‌ బ్రిటన్‌ విస్తరణవాద, సామ్రాజ్యవాద విదేశాంగ విధానాలను వ్యతిరేకించిన బ్రిటిష్‌ రాజనీతిజ్ఞుల గురించిన అధ్యయనాలే ఆ విశిష్ట గ్రంథం.

19వ శతాబ్ది ఉదారవాద రాజకీయవేత్త జాన్‌ బ్రైట్‌ ఆ రాజనీతిజ్ఞులలో ఒకరు. బ్రైట్‌ మహాశయుడు ఒక సార్వకాలిక మహావక్త. కామన్స్‌ సభలో పార్లమెంటరీ సంస్కరణలు, విదేశాలలో బ్రిటిష్‌ సైనిక జోక్యాలకు వ్యతిరేకంగా ఆయన ప్రసంగాలు ప్రజలను ప్రభావితం చేశాయి, పాలకులకు దడ పుట్టించాయి. ప్రభుత్వ విధానాలపై ఆయన విమర్శలు టోరీలను కోపావేశులను చేశాయి. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా బ్రైట్‌ వదరుతున్నాడని వారు ఆరోపించారు. ఆ అభియోగంపై ఆ ఉదారవాద రాజనీతిజ్ఞుడు తీక్షణంగా ప్రతిస్పందించాడు: ‘నేను మీ కంటే ఎక్కువగా ఆంగ్లేతరుడిని, దేశ వ్యతిరేకిని ఎలా కాగలను? నేను ఈ గడ్డపై పుట్టలేదా? నేను కూడా మీరు వచ్చిన ఇంగ్లీష్‌ వంశం నుంచే రాలేదా? నా కుటుంబం ఈ దేశ భద్రత, శ్రేయస్సుకు కట్టుబడలేదా? నాకు ఉన్న సిరి సంపదలు ఏవైనా మీ ఆస్తిపాస్తుల మాదిరిగానే మన మాతృభూమి సుపరిపాలనపైనే ఆధారపడి ఉన్నాయి కదా. మరి ఈ దేశ వ్యవహారాలకు సంబంధించిన ఒక అంశంపై తోటి దేశస్థుడు ఒకరు భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉన్నాడనే కారణంతో అతడిని దేశ ద్రోహి, జాతి వ్యతిరేకి అని మీరు ఎలా అంటారు?’


నేను ఈ మాటలను మూడు దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారి చదివినప్పుడు నా మనసులో నాటుకుపోయాయి. ముఖ్యంగా ‘దేశ ద్రోహి’ లేదా ‘దేశ వ్యతిరేకి’ (యాంటీ–నేషనల్‌) అనే నిందాపూర్వకమైన తిట్టు నా యవ్వనకాల భారతదేశంలో సర్వత్రా వినిపిస్తుండేది. సాక్షాత్తూ మన ప్రధానమంత్రే స్వయంగా ఆ దూషణ పదాన్ని ఉపయోగించారు. 1971లో భారీ మెజారిటీతో అధికారాన్ని గెలుచుకున్న ఇందిరాగాంధీ క్రమంగా నిరంకుశ పాలకురాలిగా పరిణమించారు. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను సహించలేకపోయారు. రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు అన్నిటినీ తన అధికారానికి దాసోహం చేసుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌ను తన కుటుంబ సంస్థానంగా మార్చివేశారు. ఇందిర పాలనా విధానాలను స్వాతంత్ర్య సమరయోధుడు, నిష్కళంక ప్రజానాయకుడు జయప్రకాశ్ నారాయణ్‌ ప్రశ్నించారు. ఆయనతో సహా ప్రతిపక్ష నాయకులు చాలామందికి విదేశీ నిధులు అందుతున్నాయని ఇందిర ఆరోపించారు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన విమర్శకులను దేశ వ్యతిరేకులు అని నిందించారు. మోదీ సర్కార్‌ విధానాలను వ్యతిరేకించే వారికి ప్రత్యర్థి దేశమైన పాకిస్థాన్‌ నుంచి ఆర్థిక లబ్ధి సమకూరుతుందని లేదా అమెరికా వ్యాపార దిగ్గజం జార్జి సోరోస్‌ తరఫున వ్యవహరిస్తున్నారని ప్రధానమంత్రి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ పాలనను, మెజారిటేరియన్‌ విధానాలను వ్యతిరేకించేవారిని ‘తుక్డే తుక్డే గ్యాంగ్‌’గా అభివర్ణిస్తున్నారు. ఈ సువిశాల భారతదేశాన్ని మరోసారి ముక్కలు చెక్కలు చేసేందుకు విదేశీ ప్రభుత్వాల తరఫున వ్యవహరిస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు. ‘అర్బన్ నక్సల్స్‌’, ‘మెకాలే పుత్రులు’ సహా మరెన్నో నిందాపూర్వక మాటలతో దూషిస్తున్నారు.


ఈ దూషణలు, ఆరోపణలు అన్నీ నిరాధారమైన అనుమానాలే. ఒక స్పష్టమైన మానసిక రుగ్మతకు అవి తార్కాణాలు. ప్రశ్న పత్రాల లీక్‌లతో సహా ప్రభుత్వ విద్యావ్యవస్థలోని అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద అశేష విద్యార్థుల నిరసనలపై సంఘ్‌ పరివార్‌ విమర్శలు ఆ అనుమానాస్పద ఆలోచనా విధానానికి తాజా నిదర్శనాలు. భారతీయులను రెండు వర్గాలుగా విభజించడం సంఘ్‌ పరివార్‌కు చెందిన అతి జాతీయవాదులకు పరిపాటి. మొదటి వర్గం దేశభక్తులు. వీరు జాతిశ్రేయస్సుకు అంకితమయినవారు. రెండో వర్గం దేశద్రోహులు. వీరు విశ్వాసఘాతకులు. మాతృభూమి ఉన్నతికి వ్యతిరేకులు. మోదీ ప్రభుత్వ మద్దతుదారులు మొదటివర్గం కిందకు వస్తారు. ప్రభుత్వ విధానాలతో విభేదించేవారు రెండో వర్గం కిందకు వస్తారు. అప్పుడప్పుడూ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేవారు సైతం దేశద్రోహుల కిందే లెక్క.

విద్యార్థుల నిరసనల సందర్భంలో ‘దేశద్రోహి’ అనే నిందాపూర్వక మాటలోని ద్వేషపూరిత కపటత్వం సుస్పష్టంగా కనిపిస్తున్నది. నేహా దీక్షిత్‌ ఇటీవల ‘హిమల్‌’లో రాసిన ఒక వ్యాసంలో, ఆ నిరసనల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్‌ విద్యార్థిని ఒకరు చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు: ‘నాకు ఊహ వచ్చినప్పటి నుంచీ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారంతా ‘దేశద్రోహులే’ అన్న తిరస్కారపూరిత మాట వింటున్నాను. అయితే జాతీయ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌లు, వాటికి కారణమైన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చేందుకు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ చేసిన ప్రయత్నాలు అవగతమైన తరువాత నేను ఒక సత్యాన్ని గ్రహించాను– లీక్‌లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు దేశద్రోహులు కారని, భారత ప్రభుత్వమే దేశద్రోహానికి పాల్పడుతోందని’. నిండు సత్యం ఉన్న నిశిత వ్యాఖ్య ఇది, సందేహం లేదు.


ప్రభుత్వాన్ని అధిక్షేపించేందుకు వ్యంగ్యాన్ని ఉపయోగించుకోవడం ప్రస్తుత విద్యార్థి నిరసనల విలక్షణ విశేషం. ఈ యువ నిరసనకారులకు తెలియకపోవచ్చుగానీ దేశ పాలకులను నిలదీసేందుకు తాము ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యంగ్యాత్మక అవహేళనలకు గౌరవార్హమైన పూర్వ దృష్టాంతాలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు విదేశీ ప్రభుత్వాల నుంచి ఆర్థిక లబ్ధి పొందుతున్నారని ఇందిరాగాంధీ ఆరోపించినప్పుడు స్వతంత్ర పార్టీ ఎంపీ పిలూ మోడీ ఒకరోజు ‘నేను సీఐఏ ఏజెంట్‌ను’ అని రాసి ఉన్న ప్లకార్డును మెడకు కట్టుకుని లోక్‌సభకు వచ్చారు. దశాబ్దాల అనంతరం మోదీ సర్కార్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు ప్రజ్వరిల్లినప్పుడు బెంగళూరులో ఒక బహిరంగ సభకు స్వాతంత్ర్యానంతర భారతీయ సాహిత్య దిగ్గజాలలో ఒకరైన గిరీశ్‌ కర్నాడ్‌ ‘నేనూ అర్బన్‌ నక్సల్‌నే’ అని రాసి ఉన్న ఒక ప్లకార్డును మెడకు కట్టుకుని వచ్చారు. అధికారాన్ని వెటకారం చేయడంలో ఈ విలక్షణ సంప్రదాయాన్ని విద్యార్థి నిరసనకారులు మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లారు.

నిజమైన జాతీయవాది ఎవరు? ఆగ్నేయాసియా దేశాలలో జాతీయోద్యమాలను సమగ్రంగా అధ్యయనం చేసిన ఆంగ్లో–ఐరిష్‌ రాజకీయ శాస్త్రవేత్త బెనిడిక్ట్‌ ఆండర్సన్‌ ఒకసారి ఇలా రాశారు: ‘ఇంట సొంత పౌరులపైన, బయట విశాల ప్రజానీకానికి వ్యతిరేకంగా తమ సొంత దేశం లేదా ప్రభుత్వం పాల్పడుతున్న నేరాలకు సిగ్గుపడనివారు, పడలేనివారు ఒక నిజమైన జాతీయవాది కాడు, కాలేడు కూడా. ఆండర్సన్‌ భావనతో గాంధీ, అంబేడ్కర్‌ అంగీకరించి ఉండేవారు. భారతీయ సమాజంలో సర్వత్రా ఉన్న అసమానతలు, జాతి పురోభివృద్ధికి ఆటంకమవుతున్నాయని, బ్రిటిష్‌ వలసపాలన నుంచి విముక్తమయ్యే లోగానే సామాజిక అంతరాలు, ఆర్థిక అసమానతలను అంతమొందించే కృషి ఆరంభమవ్వాల్సిన అవసరం ఉందని గాంధీ, అంబేడ్కర్‌ ఇరువురూ భిన్నరీతుల్లోనే అయినప్పటికీ, పూర్తిగా గుర్తించారు. మరీ ముఖ్యంగా నిమ్న కులాల వారు ఎదుర్కొంటున్న అణచివేతలు, మహిళలకు మానవ హుందాను నిరాకరిస్తోన్న సామాజిక దురాచారాలు, దౌష్ట్యాలు శిఖరసమానులైన ఆ మానవీయులను అమితంగా వ్యాకులపరిచాయి. వివక్షలు, అన్యాయాల నుంచి వారిని విముక్తం చేసేందుకు ఆ ఇరువురూ దృఢ సంకల్పంతో కృషి చేశారు.


పరాయి పాలనను వదిలించుకుని, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా వ్యవస్థీకృతమైన భారత్‌, కుల అస్తిత్వాలను, జెండర్ అసమానతలను నిషేధించిన రాజ్యాంగాన్ని శిరసావహిస్తోంది. అయినప్పటికీ నిత్య జీవితంలోను, రాజ్య వ్యవహారాలలోను, విశాల సమాజ జీవితంలోను వివక్షలు, అన్యాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ శోచనీయ స్థితికి ఒక జాతీయవాది విధిగా లజ్జాభరితుడు కావాలి; ప్రభుత్వ భద్రతా దళాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించాలి; అడుగడుగునా ఎదురవుతున్న అవినీతిపై ఆగ్రహించాలి; ప్రభుత్వాధికారుల, రాజకీయవేత్తల అసమర్థతను గర్హించాలి. జాతి శ్రేయస్సుకు అవరోధమవుతున్న అధికార భ్రష్టత్వాలను చూస్తూ ఉండిపోకూడదు. చైతన్యశీలి అయిన పౌరుడు, ధర్మ జ్వలిత అయిన పౌరురాలు జాతి దుస్థితి పట్ల తమ సిగ్గు, అపరాధ భావనను బహిరంగంగా పాలకులను నిలదీసే మాటలు, నిరసనలతో వ్యక్తం చేయకుండా ఉంటారా? చేస్తారు, తప్పక చేస్తారు. అది, దేశాన్ని మరింత సమున్నత, ఘనమైన భవిష్యత్తుకు తీసుకెళ్లాలని తోటి దేశస్థులకు పిలుపునిస్తూ వారు కదన శంఖం పూరించడమే అని భావించాలి. ‘హిమల్‌’ వ్యాస రచయిత్రి ఉటంకించిన ఉత్తరప్రదేశ్‌ విద్యార్థిని వ్యాఖ్యలు సంపూర్ణ సత్యాలు. ఆ విద్యావతి, ఆమె తోటి యువ భారతీయుల చైతన్యశీలతను చూసి గాంధీ, అంబేడ్కర్‌, జయప్రకాశ్‌ నారాయణ్‌ తప్పక గర్వించి ఉండేవారు.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Aug 08 , 2026 | 01:46 AM