Share News

అసంపూర్ణ రాజ్యాంగానికి కర్త ఎవరు?

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:34 AM

భారత రాజ్యాంగ కర్తలు ఎవరు?– ఈ ప్రశ్నకు సాధారణంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరో లేదా రాజ్యాంగ పరిషత్‌లోని ప్రముఖుల పేర్లో వినిపిస్తుంటాయి. అయితే, రాజ్యాంగాన్ని, దాని కర్తృత్వాన్ని ఒక వ్యక్తిలోనో..

అసంపూర్ణ రాజ్యాంగానికి కర్త ఎవరు?

భారత రాజ్యాంగ కర్తలు ఎవరు?– ఈ ప్రశ్నకు సాధారణంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరో లేదా రాజ్యాంగ పరిషత్‌లోని ప్రముఖుల పేర్లో వినిపిస్తుంటాయి. అయితే, రాజ్యాంగాన్ని, దాని కర్తృత్వాన్ని ఒక వ్యక్తిలోనో కొందరు వ్యక్తులలోనో మాత్రమే చూడటం, దాన్ని మరేదో గ్రంథానికి (మనుస్మృతి) ప్రతివాదంగా వచ్చిన పుస్తకంగా భావించడం వల్ల ఒక ప్రమాదం ఉంది. అలా చూస్తే అది ఒక సజీవ స్రవంతిగా కాక, కేవలం ఒక ‘కవిలి కట్ట’ (పాత పత్రం)గా మిగిలిపోతుంది. నిజానికి భారత రాజ్యాంగాన్ని కేవలం నాలుగు గోడల మధ్య నిపుణులు, పండితులు మాత్రమే రూపొందించాలని భావించారు. కానీ చివరికి రాజ్యాంగ ముసాయిదా బయటకు వచ్చి, పుస్తకాల రూపంలో, వార్తాపత్రికలలోని వ్యాసాల రూపంలో పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ప్రజాసంఘాలు, స్త్రీ, గిరిజన, దళిత సంఘాలు, ప్రతినిధులు దానిని నిశితంగా పరిశీలిస్తూ, అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రశ్నిస్తూ రాజ్యాంగ స్వరూపాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. 1946–1949 మధ్య కాలంలో భరతఖండమంతా ఉన్న ప్రజలు, వివిధ వర్గాలు, పీడితులు తీసుకువచ్చిన ఒత్తిడి వల్ల కూడా రాజ్యాంగం రూపుదిద్దుకుంది.


ఇంగ్లిష్ సామ్రాజ్యవాదులు భారతీయులకు పూర్తి స్థాయి స్వేచ్ఛ, సర్వాధికారాలు ఇవ్వడం ప్రమాదకరమని భావించి, స్థానికులను కేంద్రప్రభుత్వం ద్వారా నిరంతరం నియంత్రించాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టారు. అదే వలసవాద ఆలోచనా ధోరణిని మన రాజ్యాంగ రూపకర్తలు కూడా కొంతవరకు వారసత్వంగా స్వీకరించారు. స్థానికులకు పూర్తిస్థాయి హక్కులు ఇస్తే అది అరాచకానికి దారితీస్తుందని, కేంద్రం ద్వారా నిరంతర నియంత్రణ అవసరమని వారు భావించారు. అయితే, పాశ్చాత్య రాజ్యాంగాలకు భిన్నంగా, భారతదేశంలో అశేష ప్రజానీకం పోరాటాల ద్వారా, చర్చల ద్వారా కేంద్ర ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ రాజ్యాంగ స్వరూపాన్ని నిర్ణయిస్తూ వచ్చారు. భారత రాజ్యాంగం ఎప్పుడూ ఒక చర్చనీయాంశంగా, ఒక బహిరంగ ఉద్యమంగానే ఉంటూ వచ్చింది, ఇప్పటికీ అలాగే ఉంది. కేవలం ఢిల్లీలోని రాజ్యాంగసభకే పరిమితం కాకుండా, దేశంలోని అట్టడుగు ప్రాంతాల ప్రజలు, గిరిజన సంఘాలు, స్థానిక సముదాయాలు తమ ఆకాంక్షలను ప్రతిబింబించేలా స్వయంగా ప్రత్యామ్నాయ రాజ్యాంగ నమూనాలను రూపొందించడంలో క్రియాశీలకంగా భాగస్వామ్యమయ్యాయి.


విభిన్న సిద్ధాంతాల వారు తమదైన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరిషత్‌లో చర్చలు జరుగుతున్న కాలంలోనే తమ మానాన తాము అనేక ప్రావిన్సుల్్లో, సంస్థానాల్లో రచించుకుంటూ వచ్చారు. వాటి ప్రభావం కూడా రాజ్యాంగంపై ఉందనే అనుకోవాలి. అదే సమయంలో, ఒక జాతీయ రాజ్యాన్ని (నేషనల్‌ స్టేట్‌) ఏర్పరిచే క్రమంలో రాజ్యాంగ పరిషత్తు స్థానిక రాజ్యాంగాలను అణచివేసే విధానాన్ని అవలంబించింది. కొన్ని ప్రాంతాలను బలవంతంగా ఇండియన్ యూనియన్‌లో చేర్చుకున్నట్లే, అక్కడ అమలవుతున్న రాజ్యాంగాలను కూడా రద్దు చేశారు. ఫలితంగా వాటిలోని అనేక ప్రజాస్వామిక లక్షణాలు భారత రాజ్యాంగంలోకి చేరనిమాటా నిజమే. రాజ్యాంగ పరిషత్ చర్చలు జరుగుతున్న కాలంలోనే మణిపూర్‌లో ఒక అద్భుతమైన రాజ్యాంగం రూపొందింది. అది భారత రాజ్యాంగం కంటే విశాల దృక్పథం కలిగినది. మానవ హక్కుల మేధావి బాలగోపాల్ జీవితాంతం మరణశిక్ష రద్దు కోసం కృషి చేశారు. కానీ, మణిపూర్ రాజ్యాంగంలో (ప్రధానంగా గారో గిరిజన రాజ్యాంగంలో) అప్పట్లోనే మరణశిక్ష లేదు. నల్లచట్టాలకు మూలమైన ‘ప్రివెంటివ్ డిటెన్షన్’ వంటి ఎమర్జెన్సీ నిబంధనలు అసలు లేవు. అయితే, ఆ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపేసుకోవడంతో ఆ రాజ్యాంగం రద్దయింది. స్త్రీలకు రాజకీయ రిజర్వేషన్లతో పాటు ఓటు హక్కు, మొదటిసారిగా సార్వత్రిక ఓటు హక్కుతో ఎన్నికలు ఈ గిరిజన ప్రావిన్సులలోనే జరిగాయి. రాజ్యాంగ పరిషత్‌లో మాత్రం నల్ల చట్టాలు, ఎమర్జెన్సీ నిబంధనలు, ప్రివెంటివ్ డిటెన్షన్ల చేర్పు బలంగా జరిగింది. మహావీర్ త్యాగి వంటి స్వతంత్ర ఉద్యమకారులు రాజ్యాంగ పరిషత్తులో ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రశ్నలు లేవనెత్తారు.


ఔంధ్ సంస్థానంలో గాంధీ మార్గదర్శకత్వంలో గ్రామీణ స్వరాజ్యానికి సంబంధించిన ఒక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. గ్రామాలలో సకల సౌకర్యాలకు, ఉచిత విద్యకు ఇది అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. రత్లాం సంస్థానం కూడా ఉచిత విద్య హక్కు కల్పించింది. అలాగే రాంపూర్, మాళ్వా సంస్థానాలలో స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించారు. కుల, మత వివక్ష రద్దు చేశారు. ప్రాథమిక హక్కుల భావన ఆ రాజ్యాంగాలలోనే ఉంది. అయితే నేషనల్ స్టేట్‌కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఇటువంటి చిన్న రాజ్యాంగాలు కనుమరుగయ్యాయి. దీనికి మూలకారణం ఏమిటంటే– ఒక కేంద్రీకృత రాజధాని అన్ని ప్రాంతాలను, అన్ని గ్రామాలను, అన్ని రాష్ట్రాలను నియంత్రించాలని, అటువంటి నియంత్రణ ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం అమలవుతుందనే భావన ఉండటం. స్థానికత అనేది సంకుచితమైనది, కుల వ్యవస్థకు నిలయమైనది అనే అభిప్రాయం రాజ్యాంగకర్తలలో ఉండేది. దానివల్ల వచ్చిన నష్టాన్ని మనం ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాం.


అమెరికా లాంటి ఆధునిక దేశాల్లో ప్రతి రాష్ట్రానికి సొంత లిఖిత రాజ్యాంగం, రెండు పౌరసత్వాలు (Dual Citizenship) ఉంటాయి. కానీ, భారతదేశంలో అటువంటి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పూర్తిగా లోపించింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్ని కూడా మొదటినుంచి కొందరు పెద్దలు వ్యతిరేకించారు. ఇటీవల దాన్ని రద్దు చేశారు. అంబేడ్కర్‌ అమెరికాలోని ఫెడరలిజాన్ని కూడా వ్యతిరేకించారు. కేంద్రానికి రాష్ట్రాలపై ఎంత ఆధిపత్యం ఉంటుందంటే, వాటికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా విడిపోయే హక్కు లేదు. గవర్నర్ల వ్యవస్థపై కేంద్ర ఆధిపత్యం, రాజ్యసభ నియంత్రణ, న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి లోపించడం వంటి సమస్యలు నాటి నుంచీ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. బలమైన జాతీయ రాజ్యాన్ని నిలపడమే ప్రధానం అనే భావన స్థానిక ప్రత్యేకతలకు మొదటి నుంచీ ముప్పుగా పరిణమించింది. వాటిని కాపాడుకోవటానికి ప్రజలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ఘర్షణ కారణంగానే రాజ్యాంగం నిరంతరం మారుతూ వస్తోంది. అందువల్ల రాజ్యాంగ రచన ఇంకా పూర్తి కాలేదనే భావించొచ్చు, అందువల్ల, ‘రాజ్యాంగ కర్త ఎవరు?’ అనే ప్రశ్నను ఒక్క వ్యక్తికో, సంస్థకో పరిమితం చేస్తే– అది రాజ్యాంగాన్ని ఇప్పటికే ఘనీభవించిన జడ పదార్థంగా మారుస్తుంది. రాజ్యాంగం అంటే పుస్తకం కాదు. అది ప్రజల ఆకాంక్షలు, పోరాటాలు, ఘర్షణల నుంచి నిరంతరం జనించే ఒక సజీవ ప్రవాహం.

- రాణి శివశంకరశర్మ

Updated Date - Nov 24 , 2026 | 01:37 AM