కార్పొరేట్లపై అమెరికన్ రైతుకవి యుద్ధం
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:16 AM
ఇప్పటికీ అమెరికాలోని ఏ నగరానికి వెళ్ళినా అది కొత్తకొత్తగా వుండి నన్ను భయపెడుతుంది. 2013లో బాల్టిమోర్ నగరంలో అమెరికన్ అకాడెమీ ఆఫ్ రెలిజియన్స్ (AAR) సదస్సుకి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే జరిగింది.
ఇప్పటికీ అమెరికాలోని ఏ నగరానికి వెళ్ళినా అది కొత్తకొత్తగా వుండి నన్ను భయపెడుతుంది. 2013లో బాల్టిమోర్ నగరంలో అమెరికన్ అకాడెమీ ఆఫ్ రెలిజియన్స్ (AAR) సదస్సుకి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే జరిగింది. కానీ, అలాంటి భయాన్ని పునాది వేళ్ళతో పెకలించిన ఒక వ్యక్తిని చూశాను. అప్పటికీ ఎనభైలు దాటుతున్న నీడలతో ఆయన ముఖంమీద వృద్ధాప్యం ఎక్కువగానే ఆవరిస్తూ వస్తోంది. ఆయన వాక్యాలు మాత్రం నా మనసులో లేలేతగా ప్రవహిస్తున్నాయి. ఆయనే గత వారం 92 ఏళ్ల వయసులో కన్ను మూసిన అమెరికన్ మహాకవి వెండెల్ బెర్రీ (Wendell Berry). ‘‘mad farmer’’ అని ముద్రపడిన రైతు కవి. కార్పొరేట్ యుగంలో ధిక్కార వచనం ఎలా వుంటుందో ఆయన జీవితమే ఒక మానిఫెస్టో.
అదిగో కచ్చితంగా అప్పుడే
ఇంకేం చేస్తాంలే అనుకుంటున్నప్పుడే
నిజంగా ఏం చేయాలో తెలిసిపోతుంది.
అదిగదిగో కచ్చితంగా అప్పుడే
ఎటు వెళ్తాంలే అని అలసినట్టు అనిపిస్తుందే
అప్పుడే ప్రయాణం మొదలవుతుంది అచ్చంగా-
కాసింత కూడా నలగని మెదడు వుందే
అది కచ్చితంగా పనికిమాలిందే
అడ్డంకిని దాటేటప్పుడు కదా
సెలయేటి పాట మొదలవుతుంది నిజంగా
– ఇది 2013 నాటి నా మనసుకి దగ్గిరగా వచ్చిందేమో పెదవి మీద అలా తిరుగుతూ వుంది. ఆ ఏడాది పీర్ల పండగ మీద నా మొదటి ఇంగ్లీషు పుస్తకం ‘ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ నుంచి ప్రచురణ అయిన సందర్భంగా ఆ సదస్సులో ఒక సెషన్ జరగబోతోంది. అదే సదస్సులో కీలకోపన్యాసం ఇవ్వడానికి ఆయన వచ్చారు. ఉపన్యాసం అయ్యాక నేను అడిగిన ఒక ప్రశ్నతో మా ప్రత్యక్ష స్నేహం మొదలైంది. అనేక వందల మంది ఉన్న ఆ సభలో నేను ఆయన్ని అడిగిన ప్రశ్న- ‘‘కార్పొరేట్ రాజకీయాలు, మత రాజకీయాలూ మన ఉనికిని నిర్ణయిస్తున్న ఈ కాలంలో పంట పొలాల గురించో, పల్లె సీమ గురించి ఏ కాస్త మాట్లాడినా, రాసినా దాని మీద nostalgia అనే ముద్ర పడిపోతుంది. మీకు ఆ భయమేమీ లేదా?!’’
కనీసం ఆరు దశాబ్దాలుగా సన్నరైతుల వెన్ను విరిచేస్తున్న బడా కంపెనీల మీద యుద్ధం చేస్తున్న కవి వెండెల్బెర్రీ. అమెరికాలోని కేంటాకీ అనే చోట చిన్న రైతు కుటుంబంలో పుట్టిన ఈ కవి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో సృజనాత్మక రచనలో డిగ్రీ తీసుకున్నారు. కొంతకాలం న్యూయార్క్ యూనివర్సిటీలో సాహిత్య పాఠాలు చెప్పి, నగర జీవితం సరిపడక మళ్ళీ తన చిన్న ఊరికి వెళ్లిపోయారు. అక్కడ రెండు గదుల ఇంట్లో వుంటూ వ్యవసాయం చేసుకుంటూ వుండిపోయారు. అమెరికాలో నగరజీవితం అలవాటుపడిన ప్రాణాలకి ఇది అంత తేలికైన వ్యవహారమేమీ కాదు. కానీ, వెండెల్బెర్రీది వెన్నెముక నిటారుగా వున్న వ్యక్తిత్వం. ‘‘ఏదో ఒక బార్‌లో ఒక మూల కూర్చొని మా ఊరూ, మా పొలాలూ అని ఏడుపు కథలు చెప్పుకోవడమో, ఒంటరి ప్రేలాపనలు చేయడమో నాకు నచ్చలేదు.’’ అందుకే ఆయన ప్రొఫెసర్ ఉద్యోగానికి చెల్లుచీటి ఇచ్చేసి, ఇల్లు చేరారు. అదీ- కరంటు దీపాలు లేని రెండు గదుల ఇల్లు. టీవీని వెలివేసిన ఇల్లు. ఆ ఊరి మీదుగా వచ్చే కరంటు ఒక బొగ్గు గని కంపెనీ దయవల్ల వస్తోంది. ఆ కంపనీ కొన్ని వేల ఎకరాల వ్యవసాయ భూమిని మింగేసింది. తనకున్న చిన్నపాటి నేలని ఆ కంపనీకి ఇవ్వడానికి నిరాకరించడమే గాక, ఆ కంపనీ మీద ఆయన యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధం కూడా తన దగ్గిరే మొదలు పెట్టారు, కరంటుని రానివ్వకుండా- పగటి వెలుగు వున్నంతసేపే ఆయన పనిచేసేవారు. అంటే, పొద్దున లేవగానే నాలుగైదు గంటలు చదువుకోవడమో, రాసుకోవడమో చేసేవారు. మధ్యాన్నం భోజనం చేసి, సాయంత్రం పొద్దు వాలేదాకా పొలంలో కాయకష్టం చేసేవారు. మొక్కజొన్నలు, తృణ ధాన్యాలు ఆయనకి ఇష్టమైన పంటలు. అవే ఆయన జీవనాధారం కూడా.
యంత్రభూతం మీద ఆయనకి ఎంత ఆగ్రహం అంటే చివరిదాకా ఆయన కంప్యూటర్ జోలికి వెళ్లలేదు. కాగితం మీద పెన్సిల్ తోనే 50 పుస్తకాలపైన రాశారు. వాటిని 1956 నాటి ఒక టైప్‌రైటర్ మీద టైప్‌కి మాత్రం అనుమతించారు. 50ఏళ్లు వచ్చేదాకా ఆయన మొబైల్ ఫోన్ ముట్టుకోలేదు. అది కూడా దూర ప్రయాణాల వరకే వాడకం. ఇంటి పరిధిలో వాటిని దూరంగా వుంచేసే వారు. ఆయనతో మాట్లాడాలన్నా, ఇంకేమైనా కావాలన్నా ఎవరైనా సరే వాళ్ళ వూరు వెళ్ళాల్సిందే. ‘‘కార్పొరేట్ మీద యుద్ధం వ్యక్తిగత స్థాయిలో మొదలయినప్పుడే దాని తీవ్రత తెలుస్తుంది. యంత్రాలన్నీ వాడుకుంటూ కార్పొరేట్‌ని తిరస్కరించడం అంటే ఆత్మవంచన’’ అని ఆ రోజు బాల్టిమోర్‌లో మా కబుర్లలో ఆయన మరోసారి చెప్పారు. ఒక చిన్న కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటునప్పుడు నా చేతుల్లో అప్పటికీ మొబైల్ నెమ్మదిగా మోగుతూనే వుంది. మరునాడు నా పుస్తకం మీద సెషన్ వుంది కాబట్టి, స్నేహితులు పదేపదే ఫోన్ చేస్తూనో, మెసేజ్ పెడుతూనో వున్నారు. ఈలోపు ఆయన ‘‘రేపు మీ సెషన్ ఎప్పుడు?’’ అని అడిగారు. నా ఫోన్ తీసి, సదస్సు వెబ్‌సైట్‌లో వెతుక్కుంటూ వుండగానే, ఆయన తన దగ్గిర వున్న ప్రోగ్రామ్ ప్రింట్ బుక్ తీసి, ఆయనే వెతుక్కొని ‘‘ఇదిగో ఇక్కడ!’’ అని చూపించారు. చాలా సిగ్గుపడిపోయాను. ఆయన అది గమనించి ‘‘ఏమీ పర్లేదు. ఈ యంత్రాలకు మనం వెట్టి బానిస అయిపోయాం. మనం కేవలం వస్తువులం ఇప్పుడు,’’ అన్నారు. అసలు ముందు అమెరికాలో రెండు గదుల ఇంట్లో వుండడం ఎలాగో కూడా నేర్చుకోవాలి కదా! ‘‘ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా, నన్ను నన్నుగా నిలబెట్టేది నా నేల. ఈ పరిసరాల్లోవున్నప్పుడే నా తప్పులూ ఒప్పులూ తెలిసి వస్తాయి. ఏ యుద్ధం ఎక్కడిదాకా చేయాలో తెలుస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ ఒకే ఒక లక్ష్యం సన్నకారు రైతుని నిలువునా కూల్చేయడం. అందుకే నా దగ్గిర వున్న ప్రతి ఆయుధం వాటిమీదే గురిపెట్టాను’’ అన్నారు మాటల మధ్యలో.
అట్లా అని వెండెల్బెర్రీ తన గూటికే పరిమితమై వుండలేదు. ఏదైనా నిరసన తెలపాల్సిన సందర్భం వచ్చిందని తెలిసిపోయినప్పుడు వెంటనే ఆయన వీధుల్లోకి వెళ్ళి, ప్రదర్శనల్లో ముందు భాగాన నిలిచారు. సన్నకారు రైతుల వ్యవసాయం కేంద్రంగా రాజకీయ పోరాటాలను తిరగ రాయాల్సిన అవసరం చెప్తూ, ‘‘The Unsettling of America: Culture and Agriculture’’ అనే శీర్షికతో ఆయన 1977 లో రాసిన ప్రసిద్ధ రచన చిన్నకారు రైతుల పోరాటాలకి మానిఫెస్టోగా మారింది. దేశంలోని సంపదనంతా కొద్దిమందే కలిసి పంచుకునే కుట్రని మనం మన ఊరిపొలాల నుంచే గుర్తించాలని, అసలైన పోరాటం అదే అని ఆయన కన్నుమూసే వరకూ నిర్విరామంగా చెప్తూనే వున్నారు. నిజానికి వెండెల్బెర్రీ కవిత్వం దానికదే బలమైన ఆయుధం. కానీ, ఈ మధ్య కాలంలో ఆయన వ్యాసాలూ, ఉపన్యాసాలు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. మొత్తం ప్రపంచాన్నే యుద్ధ శిబిరంగా మార్చాలనే అమెరికా రాజకీయ కుట్రని కూడా ఆయన చాలా బహిరంగంగా విమర్శించారు. ఆ కారణం వల్ల కవిగా ఆయనకి దక్కాల్సిన పేరుని తుడిచిపెట్టే ప్రయత్నం కూడా కొంతకాలంగా మొదలైంది. నిజానికి 2013లో మేం కలిసేనాటికే అలాంటి ‘‘కుట్ర’’లు మొదలయ్యాయి. ఆ విషయం నేను అడిగినప్పుడు- ‘‘కవిగా వచ్చే పేరు నేనేం చేసుకుంటాను?! అయినా, నేను రాసే ప్రతి వాక్యం నాలోని ఆగ్రహమే!’’ అందుకే ఆయనకి mad farmer (కోపిష్టి రైతు) అని రాజ్య ప్రేమికులు పేరు పెట్టారు.
బాల్టిమోర్‌లో నా పుస్తకం మీద జరిగిన చర్చలో ఆయన నన్ను అడిగారు: ‘‘మనిద్దరినీ కలిపేది స్థానికత. ఇద్దరమూ ఊరి గురించే మాట్లాడుతున్నాం కానీ, ఇది ఎటు పోతుందో అన్న ప్రశ్నకి మీరేం చెప్తారు?!’’ ముందు రోజు నేను అడిగిన ప్రశ్నే ఇంకో కోణం నుంచి నన్ను అడిగారు. ‘‘మనిద్దరి కోపమూ ఏదో ఒక కుట్ర మీదే! కార్పొరేట్ మీద మీకున్న స్పష్టత రావడానికి నాకు ఇంకాస్త సిద్ధాంత బలమో, అనుభవ బలమో కావాలి. నా ప్రస్తుత ఆగ్రహం స్థానికతని తుడిచేస్తున్న మతరాజకీయాల మీదే’’ అనడంతో ఆయనతో తిరుగుప్రయాణంలో మరో సంబాషణకి వీసా దొరికింది. గంటపైనే జరిగిన ఈ సంభాషణలో ఆయన్ని ఇంకాస్త అర్థం చేసుకునే అవకాశం చిక్కింది. తన ఊరి పొలిమేరల్లో వుండి, ఆయన చేస్తున్న ఒంటరి సమరం అర్థం కావడానికి మాత్రం నాకైనా, ఆమెరికాకైనా ఇంకా చాలా సమయమే కావాలి. భోజనం తరవాత వీడ్కోలు చెప్తూ- ‘‘ఇలా కాదు కానీ, మీరు మా ఊరు రండి. ఆ ఊరిలో మాత్రమే నిజమైన వెండెల్బెర్రీ దొరుకుతాడు మీకు!’’ వెళ్ళే వెసులుబాటు ఎంతో దూరం లేదని అనుకుంటూ వుండగానే ఆయన వెళ్లిపోయారు. అంతేకదా! కలవాలి అనుకున్న వాళ్ళని వెంటనే కలవకపోతే!
- అఫ్సర్