Share News

యుద్ధం మధ్యలో వాలిన ‘పెట్టుబడి’ రాబందులు!

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:55 AM

మార్క్సిస్ట్ దృష్టికోణంలో యుద్ధం అనేది అనుకోకుండా అకస్మాత్తుగా జరిగేది కాదు. పెట్టుబడిదారీ విధానం విస్తరణలో అది ఒక దశ. మార్కెట్లు స్తంభించిపోయినప్పుడు, ‘పెట్టుబడి’ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటుంది...

యుద్ధం మధ్యలో వాలిన ‘పెట్టుబడి’ రాబందులు!

మార్క్సిస్ట్ దృష్టికోణంలో యుద్ధం అనేది అనుకోకుండా అకస్మాత్తుగా జరిగేది కాదు. పెట్టుబడిదారీ విధానం విస్తరణలో అది ఒక దశ. మార్కెట్లు స్తంభించిపోయినప్పుడు, ‘పెట్టుబడి’ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటుంది. ఆ సందర్భంలో రాజ్యం, కార్పొరేట్ సంస్థలు తమ వర్గ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాయి. ప్రజలకు యుద్ధం అంటే మరణం. కానీ, పెట్టుబడికి అది లాభం. రాజ్యానికి అది నియంత్రణ సాధనం. రాజకీయ నాయకులకు అది భవిష్యత్తు అవకాశాలకు మార్గం.

ఇప్పటి రోజుల్లో యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు. అది స్టాక్ మార్కెట్లలో, రక్షణ ఒప్పందాల్లో, డేటా సెంటర్లలో, చమురు మార్కెట్లలో, డిజిటల్ ప్లాట్‌ఫాంలలో కూడా జరుగుతుంది. అందుకే యుద్ధం కేవలం విధ్వంసమే కాదు; కొన్ని కార్పొరేట్ సంస్థలకు, కొందరు వ్యక్తులకు అది బంగారు అవకాశాలను తెరిచిపెట్టే ద్వారం! ఒకవైపు ఇరాన్ పైన బాంబులు పడుతూ ఉంటే, మరోవైపు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఆయుధ తయారీ కంపెనీల షేర్లు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. యుద్ధం నుంచి ఎవరు లాభపడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోకుండా, శాంతి గురించి జరిగే ఎటువంటి చర్చలైనా అసంపూర్తిగానే ఉంటాయి.

యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్న దానికంటే, యుద్ధం వల్ల ఎవరు ధనవంతులు అవుతున్నారన్నది అత్యంత కీలకం. యుద్ధం కొందరికి లాభసాటి వ్యాపారం. ‘క్షిపణులు’ వారికి ఆయుధాలు మాత్రమే కాదు; అవి వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు, రాజకీయ ఎదుగుదలకు నిచ్చెనమెట్లు. యుద్ధం ఎంతకాలం కొనసాగితే వారికి అంత లాభం. అందుకే ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో యుద్ధం దౌత్యపరమైన వైఫల్యం కాదు. అది ప్రణాళికాబద్ధమైన, లాభాలను ఆర్జించే ఆర్థిక వ్యవస్థలో భాగం.

ఏ యుద్ధం నుంచైనా ఎక్కువ లబ్ధి పొందేవారు– అధికార కేంద్రాలపై పట్టున్నవారు, ఆ పట్టును యుద్ధకాలంలో తమ ప్రైవేట్ ఆస్తుల పెరుగుదలకు, ఆర్థిక సామ్రాజ్యాల విస్తరణకు ఉపయోగించుకోగలిగినవారు మాత్రమే. దీనికి మంచి ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబం. తండ్రి యుద్ధాన్ని ప్రారంభిస్తాడు, కొడుకులు సొమ్ము చేసుకుంటారు. డోనాల్డ్ ట్రంప్ ఇద్దరు కుమారులు– డోనాల్డ్‌ ట్రంప్ జూనియర్, ఎరిక్‌ ట్రంప్ ఇటీవల బాగా వార్తల్లోకి ఎక్కారు. ఇరాన్‌తో యుద్ధంలో మునిగి ఉన్న గల్ఫ్ దేశాలకు ‘డ్రోన్ ఇంటర్‌సెప్టర్‌’లను విక్రయిస్తున్న ఒక డ్రోన్ తయారీ కంపెనీతో వీరిద్దరికీ సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ డ్రోన్లు ఇరాన్ దాడులను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు చేసే ప్రచారంలో భాగంగా గల్ఫ్ దేశాలలో ఈ కంపెనీ డ్రోన్ల ప్రదర్శన నిర్వహించింది. ఈ కంపెనీతో ట్రంప్ సోదరులు చేసుకున్న ఒప్పందం వల్ల, కంపెనీలో వాటాలతో సహా వారు భారీగా లాభం పొందారు. యుద్ధం ద్వారా భారీగా లాభం పొందిన అమెరికన్ అధ్యక్షుల కుటుంబాల్లో డోనాల్డ్ ట్రంప్ కుటుంబం మొదటిది అని వైట్‌హౌస్ లాయర్ రిచర్డ్ పెయింటర్ వ్యాఖ్యానించారు.


ట్రంప్ కుటుంబం తన వ్యాపార వ్యూహాన్ని కూడా మార్చుకుంది. హోటళ్లు, గోల్ఫ్ కోర్సెస్ మాత్రమే గాక, వారిప్పుడు క్రిప్టో కరెన్సీ, రాకెట్ స్పేర్ పార్టులు, అత్యంత శక్తిమంతమైన విండ్‌ టర్‌బైన్లు, రోబోట్లు, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇరాన్‌పై దాడి ప్రారంభానికి పదకొండు రోజుల ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఇజ్రాయెల్‌కు చెందిన డ్రోన్ కంపెనీలో ఎరిక్ ట్రంప్ పెట్టుబడులు పెట్టారు. అమెరికా సైనిక ఖర్చులు, డ్రోన్ల యుద్ధ ఖర్చుల పెంపుదల తదితర విషయాలను ఆ దేశ అధ్యక్షుడైన వారి తండ్రి ట్రంప్‌ నిర్ణయిస్తూ ఉంటాడు. కుమారుడేమో పెంటగాన్ కాంట్రాక్టులతో కూడిన డ్రోన్ల యుద్ధ కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంటాడు. ఎరిక్ ఒక్కరే కాదు, డోనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా మరో డ్రోన్ కంపెనీ సలహామండలిలో చేరారు. ఈ విధంగా, మిలిటరీ టెక్నాలజీ రంగంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బలంగా తిష్ఠ వేశారు.

ఆధునిక యుద్ధంలో టెక్నాలజీ కంపెనీల పాత్ర వేగంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం సంప్రదాయ రక్షణ సంస్థలకే లాభం వచ్చేది; ఇప్పుడు సిలికాన్ వ్యాలీ కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంల ద్వారా యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తున్న కంపెనీలు భారీగా లాభాలు పొందుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత వాటి షేర్ల విలువ కూడా విపరీతంగా పెరిగింది. యుద్ధ ఆర్థిక వ్యవస్థలో టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను రక్షణ విభాగాలతో కలిపి ఉపయోగిస్తున్నాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఈ రంగంలోకి వెళ్తున్నాయి.

యుద్ధం కేవలం కంపెనీలకే కాదు; ప్రభుత్వాలకు కూడా లాభదాయకం. పాలకులు తమ రాజకీయస్థితిని మెరుగుపరచుకోడానికి యుద్ధాన్ని వాడుకుంటారు. దేశీయ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి యుద్ధం ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

చరిత్రంతా ఇదే జరుగుతోంది. యుద్ధం వల్ల ధనిక దేశాలు మరింత ధనికంగా మారతాయి; పేద దేశాలు మరింత పేదవి అవుతాయి. మరి అసలు ప్రశ్న, ప్రపంచశాంతి? యుద్ధం ఒక వ్యాపారంగా విలసిల్లుతున్నంత కాలం ప్రపంచశాంతి కలగానే మిగిలిపోతుంది.

వెలుగూరి రాధాకృష్ణమూర్తి

ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులు

ఇవి కూడా చదవండి..

అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు

మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు

Updated Date - Jun 13 , 2026 | 12:55 AM