నెహ్రూ–రాజాజీ కలిస్తే భారత్ గతి మారేది!
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:28 AM
ఒకేఒక్కసారి చదివే పుస్తకాలు ఉంటాయి. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, రోజులు, నెలలు, సంవత్సరాల తరువాత కూడా మళ్లీ మళ్లీ చదివే పుస్తకాలూ ఉంటాయి. నా దృష్టిలో ఈ రెండో కోవకు చెందిన పుస్తకాలు: రవీంద్రుని ‘నేషనలిజం’, అంబేడ్కర్ రాసిన..
ఒకేఒక్కసారి చదివే పుస్తకాలు ఉంటాయి. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, రోజులు, నెలలు, సంవత్సరాల తరువాత కూడా మళ్లీ మళ్లీ చదివే పుస్తకాలూ ఉంటాయి. నా దృష్టిలో ఈ రెండో కోవకు చెందిన పుస్తకాలు: రవీంద్రుని ‘నేషనలిజం’, అంబేడ్కర్ రాసిన ‘అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్’, సీఎల్‌ఆర్ జేమ్స్ గ్రంథం ‘బియాండ్ ఎ బౌండరీ’, వాల్టర్ క్రాకర్ పుస్తకం ‘నెహ్రూ: ఎ కాంటెంపరరీస్ ఎస్టిమేట్’. వీటిలో అందరికీ పెద్దగా తెలియనిది వాల్టర్ క్రాకర్ రచనే. ఇదే నన్ను ఈ వ్యాసం రాయడానికి పురిగొల్పింది. మరో కారణం: ఈ వ్యాసం జవహర్‌లాల్ 137వ జయంతి రోజున ప్రచురితం కావడం.
వాల్టర్ క్రాకర్ 1945లో భారత్ వచ్చారు. నెహ్రూ జన్మభూమితో అది ఆయన మొదటి పరిచయం. ఆ తరువాత 1952–55, తిరిగి 1958–62 సంవత్సరాల మధ్య ఆయన భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్‌గా ఉన్నారు. క్రాకర్ భారత్‌లో ఉన్నకాలంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిత్వం అనుపమానంగా వెలుగొందుతోంది. హైకమిషనర్‌గా ఉన్న ఆరు సంవత్సరాలలోను నెహ్రూను వ్యక్తిగా, పరిపాలకుడిగా, రాజనీతిజ్ఞుడిగా క్రాకర్ సన్నిహితంగా పరిశీలించారు. నెహ్రూ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, మేధో ప్రభావాల గురించిన విపుల వివరణతో క్రాకర్ పుస్తకం మొదలవుతుంది. ఒక రచయితగా నెహ్రూ విశిష్ట లక్షణాలు క్రాకర్‌ను ప్రభావితం చేశాయి. నెహ్రూ రాసిన మూడు ప్రధాన పుస్తకాల గురించి సంగ్రహంగా వివరించారు. నెహ్రూ ‘ఆటోబయోగ్రఫీ’ గురించి క్రాకర్ ఇలా వ్యాఖ్యానించారు: ఒక అసాధారణ వ్యక్తిని, ఒక అసామాన్య, ఆకర్షణీయ మనిషిని వ్యక్తిగత లోపాలతో సహా చిత్రించింది నెహ్రూ ఆత్మకథ.
క్రాకర్ పుస్తకంలోని ప్రధాన అధ్యాయాలు సహజంగానే నెహ్రూ అధికారంలో ఉన్న సంవత్సరాల గురించి ప్రముఖంగా ప్రస్తావించాయి. ప్రధానమంత్రిగా నెహ్రూ సాధించిన విజయాలలో మొట్టమొదట పేర్కొనవలసింది దేశాన్ని సమైక్యంగా ఉంచడమని క్రాకర్ పేర్కొన్నారు. మత ఘర్షణలు, పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానతలు, కయ్యానికి కాలుదువ్వే కొన్ని ఇరుగుపొరుగు దేశాలు మొదలైన ప్రతికూలతలను సమర్థంగా ఎదుర్కొని సువిశాల, వైవిధ్యపూరిత భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడం నెహ్రూ నాయకత్వ ఘనవిజయమని క్రాకర్ ప్రస్తుతించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పురోగతిని సంపూర్ణంగా ప్రోత్సహించడం నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి చేసిన ఘనమైన సేవలలో ప్రముఖమైనదని క్రాకర్ అన్నారు. భారతదేశ రాజ్యాంగ సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తితో వర్ధిల్లడానికి నెహ్రూనే ప్రధాన కారకుడని క్రాకర్ అభిప్రాయపడ్డారు. అన్ని మతాల వారిని సమానులుగా గౌరవించే లౌకిక రాజ్య వ్యవస్థను నెలకొల్పడం నెహ్రూ సాధించిన మూడో విజయమని ఆయన అన్నారు. అందులో భాగంగా వివిధ సాంఘిక సంస్కరణలను అమలుపరిచారని, ముఖ్యంగా మహిళా హక్కులకు సంబంధించిన ప్రగతిశీల చట్టాలను తీసుకువచ్చారని క్రాకర్ వివరించారు.
నెహ్రూ ఆర్థిక విధానంపై క్రాకర్ అభిప్రాయం పూర్తిగా అనుకూలంగానూ లేదు, ప్రతికూలంగానూ లేదు. నెహ్రూ అనుసరించిన ప్రణాళికాబద్ధ అభివృద్ధి నమూనా ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన పారిశ్రామిక సదుపాయాలను సమకూర్చిందని ప్రశంసించిన క్రాకర్ ఆ విధానమే లైసెన్స్ కోటా రాజ్‌ను నెలకొల్పిందని విమర్శించారు. వ్యవసాయరంగంపై నెహ్రూ దృష్టి పెట్టలేదని ఆక్షేపించారు. ‘ప్రధాని నెహ్రూ మనసులో మార్క్సిస్టు, ఉదారవాద భావజాలాలు గందరగోళంగా మిగిలిపోయాయి. అవి సమర్థ, ప్రభావశీల సమ్మేళనంగా రూపొందలేదని’ క్రాకర్ పేర్కొన్నారు. నెహ్రూ ఆర్థిక చింతన విషయంలో బహుశా ఇది మరింత సత్యమని అంగీకరించక తప్పదు.
నెహ్రూ సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడాన్ని కూడా క్రాకర్ ఆక్షేపించారు. రెండు పర్యాయాలు ప్రధానిగా ఉన్న అనంతరం రాజకీయాల నుంచి వైదొలిగి ఉన్నట్టయితే భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పురోగతికి విశేష దోహదం జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. రాజాజీగా ప్రసిద్ధుడైన రాజగోపాలాచారి మేధో నైశిత్యం క్రాకర్‌ను విశేషంగా ఆకట్టుకున్నది. 1950ల్లో రాజాజీని నెహ్రూ తన క్యాబినెట్‌లో చేర్చుకుని ఉండాల్సిందని, నెహ్రూ అలా చేసి ఉంటే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య రాజాజీ ఒక వారధి అయ్యేవారని క్రాకర్ భావించారు. మిగతా క్యాబినెట్ మంత్రుల వలే నెహ్రూను రాజాజీ గుడ్డిగా గౌరవించేవారు కాదని, ఆచరణయోగ్యంగా లేని నెహ్రూ ఆర్థిక విధానాలను ఆయన తప్పక ప్రతిఘటించేవారని క్రాకర్ అన్నారు. 1950ల్లో నెహ్రూ, రాజాజీల సమష్టి నాయకత్వం అందివుంటే స్వతంత్ర భారతదేశం ఇతోధికంగా లబ్ధిపొంది ఉండేదని క్రాకర్ అభిప్రాయపడ్డారు.
ఒక వ్యక్తిగా నెహ్రూపై ఆ ఆస్ట్రేలియన్ దౌత్యవేత్త అభిప్రాయంలో నిశితదృష్టి ఉన్నది. నదులు, అడవులు, కొండలు, కోనలు, వన్య ప్రాణులు, విహంగాలు.. ఒకటేమిటి, సమస్త ప్రకృతి పట్ల నెహ్రూ అసాధారణ ఆసక్తి చూపేవారని క్రాకర్ మన దృష్టికి తీసుకువచ్చారు. నిజమే, నెహ్రూ వంటి అసాధారణ ప్రకృతి ప్రేమికుడు అప్పుడూ ఇప్పుడూ మనలో తక్కువే. తోటి మనుషుల పట్ల సానుభూతి, సహానుభూతి నెహ్రూలో నిండుగా ఉండేవి. సామాన్య పౌరులతో కలివిడిగా ఉండేందుకు ఆయన ఇష్టపడేవారు. సమస్యలు లేదా సూచనలతో తన వద్దకు వచ్చిన వారితో సంబంధిత విషయాలపై చర్చించేవారు. అన్నట్టు నెహ్రూ మంచి ఆతిథేయి కూడా. అతిథి మర్యాదలను మరింత సమున్నతం చేసిన ఉదాత్తుడు ఆయన. జవహర్‌లాల్ నెహ్రూ అందమైనవారని, ఎంత మనోహరంగా కనిపిస్తారో అంత నిరాడంబరంగా ఉంటారని క్రాకర్ వ్యాఖ్యానించారు. సభ్యతా సంస్కారాలు ఉట్టిపడే మనిషి నెహ్రూ అని, చిన్న విషయాలకు సైతం పెద్ద ప్రాధాన్యమివ్వడం ఆయన నుంచే నేర్చుకోవల్సి ఉందని క్రాకర్ అన్నారు.
నెహ్రూలో ఒక సమ్మోహన శక్తి ఉంది. బహుమతుల ప్రదానం, శంకుస్థాపనలు మొదలైన సాదాసీదా కార్యక్రమాలు సైతం నెహ్రూ ఉనికితో ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయని క్రాకర్ పేర్కొన్నారు. భారతదేశ ప్రజానీకంలో నెహ్రూ పేరు ప్రఖ్యాతులు అద్భుతమైనవని క్రాకర్ రాశారు. అవి జన మాధ్యమాల ద్వారా వచ్చినవి కావు. ప్రజలు ఆయనపై వర్షించిన ప్రేమాభిమానాల మూలంగానే నెహ్రూకు ఆ అసాధారణ పేరు ప్రతిష్ఠలు సమకూరాయి. నెహ్రూ నిరుపమాన పేరు ప్రతిష్ఠలకు కొన్ని ఇతర సహేతుక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి: మహాత్మాగాంధీ తన రాజకీయ వారసుడిగా నెహ్రూను ఎంపిక చేయడం; జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యమివ్వడం (ఇది నెహ్రూను మిగతా భారతీయ రాజకీయవేత్తల నుంచి వేరుచేసి విలక్షణంగా నిలబెట్టింది), శ్రీమంతుడు అయినప్పటికీ దేశ స్వాతంత్ర్య సాధనకు అనుపమాన త్యాగాలు చేయడం.
వాల్టర్ క్రాకర్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన విద్యాధికుడు. ఆయన విస్తృతంగా చదివాడు, విశాల ప్రపంచమంతటా పర్యటించాడు. దౌత్యవేత్తగా అమెరికన్, యూరోపియన్ రాజకీయవేత్తలను సన్నిహితంగా పరిశీలించాడు. ప్రపంచ చరిత్ర, వర్తమాన రాజకీయ వ్యవహారాలపై సంపూర్ణ అవగాహన ఉన్న దౌత్య ధురంధరుడు. ‘నెహ్రూ వలే సొంత ప్రజల నుంచి గౌరవాదరాలు, పేరు ప్రతిష్ఠలు పొందిన నాయకులు సమకాలీన ప్రపంచంలో చాలా తక్కువ’ అని క్రాకర్ అన్నారు. ‘నెహ్రూ తనకు, తన కుటుంబానికి ఏమీ ఆశించలేదని, దయాగుణం ఉన్న పరిపాలకుడు అని భారతీయులలో అత్యధికులు భావించారు. ఆ భావనను వారు ఎన్నడూ కోల్పోలేదని’ క్రాకర్ వ్యాఖ్యానించారు. ‘ఆయన ఉపన్యాసాలు ప్రతిభావంతమైనవి. రాజకీయ వ్యవహారాలతో పాటు సైన్స్, టెక్నాలజీ, లలిత కళలు, నైతిక విలువలు, చరిత్ర, సంక్షేమ కార్యక్రమాలు మొదలైన ఎన్నో అంశాలపై ఆయన ఆశువుగా మాట్లాడేవారు. ఆంగ్లంలో అరగంట సేపు మాట్లాడిన తరువాత, ఆ వెన్వెంటనే అదే ఉపన్యాసాన్ని ఆయన హిందుస్థానీలో వెలువరించేవారు. అది దోషరహితంగా ఉండేదని నా భారతీయ స్నేహితులు చెప్పేవారు’ అని క్రాకర్ రాశారు.
విషపూరిత పక్షపాత వైఖరులతో భాషా కాలుష్యానికి అవధులులేకుండా పోతున్న కాలంలో మనం నివసిస్తున్నాం. ఈ దృష్ట్యా నెహ్రూ గురించి క్రాకర్ చెప్పిన మాటలను సదా గుర్తుంచుకోవల్సిన అవసరమున్నది. ‘నెహ్రూ ఎప్పుడూ భావాల విషయంలో మాత్రమే వాదన చేసేవారు. ఆయన లక్ష్యాలు ఎంత ఉన్నతంగా ఉండేవో వాటిని సాధించేందుకు ఆయన అనుసరించే పద్ధతులూ అంతే సమున్నతంగా ఉండేవి’ (ఈ రెండు సుగుణాలను ఆయన గాంధీ నుంచి అలవర్చుకున్నారు. నెహ్రూ స్వభావం, వ్యక్తిత్వంపై మహాత్మాగాంధీ ప్రభావం గురించి సమగ్రంగా వివరించకపోవడం క్రాకర్ పుస్తకంలో ఒక ప్రధాన లోపమని నేను భావిస్తున్నాను). అబ్రహాం లింకన్ వలే నెహ్రూ కూడా అధికారాన్ని ప్రజల శ్రేయస్సుకే ఉపయోగించిన నాయకుడు. భారతీయులకు, విశాల ప్రపంచానికి మేలు చేసేందుకు మాత్రమే ఆయన అధికారాన్ని కోరుకున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు ఎన్నడూ ప్రాధాన్యమివ్వలేదని క్రాకర్ రాశారు.
క్రాకర్ పుస్తకం ప్రతి పుటలోనూ లోతైన, ఆలోచనా పూర్వకమైన వ్యాఖ్యలు ఉన్నాయి. 1966లో తొలుత ప్రచురితమైన ఈ పుస్తకం నెహ్రూ, ఆయన పాలనా కాలం గురించి వచ్చిన ఉత్తమ గ్రంథాలలో ప్రముఖమైనది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకమది.
(వ్యాసకర్త చరిత్రకారుడు)