విశ్వనాథ విస్తృతిని తెలిపే చిన్న కథలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:41 AM
‘వేయిపడగలు’ వంటి మహా కృతిని రచించిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విశ్వరూపాన్ని అచ్చులో రెండు మూడు పేజీలు మాత్రమే ఉండే కథలలోనూ చూడవచ్చు. ‘చిన్న కథలు’ పేరుతోనే వెలువడిన..
‘వేయిపడగలు’ వంటి మహా కృతిని రచించిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విశ్వరూపాన్ని అచ్చులో రెండు మూడు పేజీలు మాత్రమే ఉండే కథలలోనూ చూడవచ్చు. ‘చిన్న కథలు’ పేరుతోనే వెలువడిన సంకలనంలో 31 కథలు కనిపిస్తాయి. లోతైన భావాన్నీ, శాశ్వత సత్యాలనూ అందించడానికి కథానిక కూడా అనువైనదేనని కవిసమ్రాట్ నిరూపించారు. చరిత్ర, సామాజిక పరిణామాలు, స్త్రీపురుష సంబంధాలే కాదు, ‘ఇంకొక విధం’గా ఉండే పురుష పురుష సంబంధాలను కూడా ఆయన గమనించారు.
సంస్కరణవాదం చాలా సందర్భాలలో సంస్కర్తల చేతిలోనే భంగపడిందని చెప్పేందుకు ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తాయి. జాలీ దయల గురించి ఉపన్యాసాలు దంచేవారు ఆచరణలో వాటికి కాస్త దూరంగానే ఉంటారని చెప్పినా అతిశయోక్తి కాదు. ఆ విషయంలో సిద్ధాంతం, ఆచరణ రైలు పట్టాల వంటివి. ఎక్కడా కలియలేవు. మనుషులలోని ఈ భేషజాలను, దంద్వ వైఖరిని అత్యంత లాఘవంగా చిత్రించిన కథ ‘మాక్లీదుర్గంలో కుక్క’. గుంతకల్లు–బెంగళూరు మార్గంలో ఉన్న చిన్న రైల్వేస్టేషన్ మాక్లీదుర్గం. అక్కడే బతుకుతూ ఉంటుంది ఓ మగ ఊరకుక్క. బెంగళూరు వెళుతున్న ఓ ‘పెద్దమనిషి’ ఆ స్టేషన్‌లో దిగాడు. వెంట ఒక ఆడ సీమకుక్క ఉంది. ఊరకుక్కకీ, సీమకుక్కకీ ‘ప్రథమ దర్శనంలోనే ప్రణయం’ ఏర్పడింది. సీమకుక్కను కటకటాలకు కట్టేసి, పెద్దమనిషి సామగ్రి తూకం వేయించడం పనికి దేనికో లోపలికి వెళ్లాడు. స్టేషన్ మాస్టర్ చదువుకున్నవాడు కావడంతో ఆ పెద్దమనిషితో సిద్ధాంత రాద్ధాంత చర్చకు దిగాడు. విషయం– వర్ణ వ్యవస్థ. స్టేషన్ మాస్టర్ ఉండాలంటాడు.
పెద్దమనిషి దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. పతాక సన్నివేశంలో ‘అయితే మీరు వర్ణ వ్యవస్థను తీసిపారవేయాలి అంటారా?’ అన్నాడు స్టేషన్‌మాస్టర్. పెద్దమనిషి ఎలాంటి శషభిషలు లేకుండా ‘తీసివెయ్యాలంటాను. ఈ వ్యవస్థ మూలంగా అనేక భేదాలేర్పడుతున్నవి. కొందరనవసరంగా తాము గొప్పవాళ్లమనుకుంటున్నారు. తక్కువ కులాల మీద అధికారం చెలాయిస్తున్నారు. వర్ణాంతర భోజనములూ, వివాహములు జరగవలె. అప్పుడే దేశానికి ముక్తి’ అంటూ ప్రకటించాడు. ఇంకో అడుగు ముందుకు వేసి, ‘మనవాళ్లు (పెద్దలు) సంఘానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు’ అని ముక్తాయించి బయటకు వచ్చాడు. అక్కడి దృశ్యం ఏమిటి? సీమకుక్క ఊరకుక్కను కలుసుకున్నది. సీమకుక్క ‘వర్గభేదం’ మరచిపోయినందుకు అప్పటిదాకా అంతా సమానమని ఘోషించిన పెద్దమనిషి ఆనందించలేదు. సరికదా, పట్టలేనంత ఆగ్రహంతో తన దగ్గరున్న కర్రతో ఊరకుక్కని చావగొట్టాడు. సీమకుక్కకి నాలుగు మాత్రమే వడ్డించాడు. తన తోలుపెట్టె తెరిచి తువాళ్లు, సబ్బు తీసి వెంటనే అభ్యంగనం చేయించాడు. విషయం ఏమిటంటే, తన ‘జాతిగల’ సీమకుక్క రుతువుకు వచ్చింది. తగిన జంటను చూద్దామని కుక్కతో సహా ఆయన బెంగళూరు వెళుతున్నాడు. మధ్యలో ఈ సంకరం జరిగిపోయింది. దాని బొచ్చు, కుచ్చుతోక, ముఖం మీద మచ్చ చూశాక, అది పిల్లలు పెడితే తనకి ఒకటి ఇమ్మని స్టేషన్‌మాస్టర్ కోరాడు. దీనికి కొనసాగింపు– ఇద్దరు విద్యార్థుల సంభాషణ. స్టేషన్‌లో ఉన్న మిఠాయి దుకాణంలో ఏదో కొని, తింటూ మాట్టాడుకుంటూ ఉంటారు. ఎవరికీ దయాదాక్షిణ్యాలు లేవన్నది వారు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇంతలో ఆ ఊరకుక్క వాళ్ల దగ్గరికి వచ్చి తోక ఊపుతుంది.
కాస్తయినా విదిలించలేదు సరికదా, ఒకడు బూటు కాలితో డొక్కలో తన్నాడు. తల్లిడిల్లిపోయింది కుక్క. అదే మిఠాయి దుకాణం వాడు పడేసినదేదో తిని కుక్క జబ్బు పడిపోయింది. నెల్లాళ్లకి ఒకసారి మాత్రమే మార్చే నూనెలో తయారై వచ్చిన మిఠాయి అది. పైగా ఈసారి ఈ దౌర్భాగ్యపు ఊరకుక్క కనిపిస్తే నరికి చంపేయాలని ప్రతిన పూనిన పెద్దమనిషి ఆశ నెరవేరకుండా చనిపోయింది కూడా. కొన్నాళ్లకి మళ్లీ పెద్దమనిషి ఆ స్టేషన్‌లో దిగాడు. కుక్కని బెంగళూరు తీసుకుపోయాడు కానీ, అది అవతలి జాతికుక్కతో కలయికకు అంగీకరించలేదు. పైగా ‘మీ కుక్క’ తన కుక్కను పాడు చేసిందని, ఫలితంగా రెండు పిల్లలు పుట్టాయని, వాటికి ఊరకుక్కల పోలికే దాపురించిందని వాపోయాడు. ఒక పిల్ల చచ్చిపోయింది. రెండో దానిని స్టేషన్ మాస్టర్‌కి ఇచ్చి వదిలించుకున్నాడు. కానీ దీనికి తీవ్రమైన మనుష ద్వేషం. తండ్రి మాదిరిగానే అది స్టేషన్‌లోనే బతుకుతూ ఉంటుంది. సిద్ధాంతాల రాద్ధాంతాలతో ఊకదంపుడు మాటలు మాట్లాడేవాళ్లంటే మరీ కోపం. ఇలా ముగించారు కథ. సున్నిత హాస్యంతో నడిచే ఈ కథలో మిఠాయి దుకాణం వర్ణనలు, నెలకోసారి మాత్రమే మార్చే నూనెతో చేసిన వంటకాల గురించి విశ్వనాథ రమణీయంగా చెప్పారు. అన్నట్టు ఈ దుకాణం మీద కూడా కొత్త ఊరకుక్కకి అసహ్యం. ఎందుకంటే అందులోవి తినే తన తండ్రి కుక్క తీసుకుని తీసుకుని పోయింది. ఈ కథను 1936లో రచించారు.
విశ్వనాథ వారి ప్రాపంచిక దృష్టికి, విప్లవాల పేరిట సముద్రపు కెరటాల మాదిరిగా ఎగసి, ఊహకు అందనంత అసబద్ధంగా విప్లవ ఫలితాలు ఛిద్రమవుతాయో గమనించారని చెప్పడానికి ఉదాహరణ ‘సప్తాశ్వము’ కథ. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కొన్ని ప్రపంచ దేశాల విప్లవ గమనాలను విశ్వనాథ ఒక దుఃఖంతో చిత్రించారనిపిస్తుంది. కొందరు కలసి ఒక విప్లవం తెచ్చారు. కొన్ని కారణాలతో డామట్ అనే విప్లవనేతను వారిలోనే ఎవరో హత్య చేశారు. అందుకు ఏడుగురిని బాధ్యులను చేసి మరణదండన విధించారు. వీరే ఒక్కొక్కరు విప్లవ పంథాలలోని శూన్యాన్నీ, ఆధిపత్య ధోరణులనీ, చంపడం కొనసాగిస్తేనే విప్లవానికి మనుగడ పేరుతో ఆ క్షణపు విజేతలు తీర్చుకునే రక్తదాహాన్నీ వివరించి చెబుతారు. ఇవాళ మీరు అధికారం హస్తగతం చేసుకున్నారు కాబట్టి మమ్మల్ని బోను ఎక్కించారు. నిన్న మనమంతా కలసి అధికారంలో ఉన్నప్పుడు కొందరికి ఉరి బిగించాం. రేపు వేరొకరు మీకు ఇలాంటి ముగింపే రాస్తారు అని శపిస్తారు. ఇలాంటి పరిణామాలనూ, విప్లవ ఫలితాలనూ సమీప గతంలోనే మనం గమనించాం. ఇది తెలుగు కథలలోనే ఒక విశిష్ట ప్రయోగమనిపిస్తుంది.
ఇరవయ్ దశకంలో రాసిన ‘ఇంకొక విధము’ విశ్వనాథ సునిశిత రచనా సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. స్వలింగ సంపర్కులు, మనో విజ్ఞానశాస్త్రం వంటి పదాలు పెద్దగా ప్రాచుర్యం పొందని కాలంలో ఆయన స్వలింగ సంపర్కం మీద విశిష్టమైన కథను అందించారు. అచ్చులో రెండు పేజీలు కూడా పూర్తిగా ఉండని ఈ కథ చాలా పెద్ద కాన్వాస్‌ను ఇముడ్చుకుని కనిపిస్తుంది. ముప్పయ్ ఏళ్ల గోపీనాథుడు, పదిహేనేళ్ల మలయగిరి మధ్య ‘ఇంకొక విధం’ అనదగిన బంధానికి విశ్వనాథ అక్షరరూపం ఇచ్చారు. ఈ ఇద్దరూ రంగస్థల నటులు. ఇరువురికి దేహములు మాత్రమే రెండు అన్నారు రచయిత. పారిజాతాపహరణ నాటకం ప్రదర్శించాలి. గోపీనాథుడు కృష్ణుడు. మలయగిరి సత్యభామ. కానీ మలయగిరి విఫలమవుతాడనే అనుకున్నాడు గోపీనాథుడు. కానీ వారి నటన గురించి ఎవరి నోట విన్నా ఒక్కటే మాట, ‘భార్యాభర్తల అనురాగం మాదిరిగానే ఉన్నది.’ ఈ ముగింపు కోసం విశ్వనాథ కథనాన్ని, అంటే ఆ ఇద్దరి మధ్య విచిత్ర బంధాన్ని చాలా గొప్పగా చిత్రించారు.
స్త్రీపురుష సంబంధాన్ని విశ్వనాథ సమదృష్టితోనే చూశారు. దానిని నిరూపించేదే ‘భావనాసిద్ధి’ (1923) కథ. భర్త వస్తే లేచి నిలబడనక్కరలేదనే చెప్పగలిగిన లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ. తాను లక్ష్మణస్వామి కంటే చక్కని దాననని ఆమె నమ్మకం. పురుషుడూ సుందరుడే అని నిరూపించడానికి లక్ష్మణస్వామి వినూత్నమైన ప్రయోగం చేస్తాడు. ఆఖరికి మునిమాపువేళ గదిలో కూర్చున్న లక్ష్మణస్వామిని చూసి తల్లి, భార్య కూడా స్త్రీగా పొరపడడంతో, ఊర్మిళ తన అభిప్రాయం తప్పని ఒప్పుకోవడంతో కథ ముగించారు. ఆ విధంగా ఆయన అర్ధనారీశ్వరతత్త్వాన్ని కథలో చెప్పారు.
తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత విశ్వనాథ తెలుగు కథకూ కొత్త సొబగులను అద్దారు. ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ సొబగులు మహోన్నతమైనవి కూడా.
(అక్టోబర్ 18 విశ్వనాథ 50వ వర్ధంతి)
- గోపరాజు నారాయణరావు
98493 25634