చంద్రన్న సంకల్పం.. ‘పేదలకు పట్టాభిషేకం’
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:27 AM
దశాబ్దాలుగా సొంతింటి హక్కుల కోసం ఎదురుచూస్తున్న పేదల జీవితాల్లో సరికొత్త వెలుగులను కూటమి ప్రభుత్వం నింపుతున్నది.
దశాబ్దాలుగా సొంతింటి హక్కుల కోసం ఎదురుచూస్తున్న పేదల జీవితాల్లో సరికొత్త వెలుగులను కూటమి ప్రభుత్వం నింపుతున్నది. వారి కళ్లలో ఆనందబాష్పాలను నింపుతూ, వారి కలలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విశాఖపట్నంలో ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమాన్ని నిర్వహించి 28,445 మంది పేదలకు పట్టాలతో పాటు ఆస్తి యాజమాన్య బదిలీ పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. అదే స్ఫూర్తితో ఈ నెల 30న విజయవాడ నగరంలోని 24,057 పేద కుటుంబాలకు పట్టాభిషేకం చేయనుండడం అపూర్వ ఘట్టం.
విజయవాడలో ప్రతి ఎన్నికలోనూ ప్రధాన అజెండాగా మారుతున్న ఇళ్ల పట్టాల సమస్యకు కూటమి సర్కార్ చరమగీతం పాడి సరికొత్త చరిత్రను సృష్టించింది. దశాబ్దాల క్రితం అందించిన ఎన్టీఆర్ పట్టాలకు చట్టబద్ధత కల్పిస్తూ, వాటిపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులను కట్టబెడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ.9,800 కోట్ల విలువైన 617 ఎకరాల భూమిపై పేద, మధ్య తరగతి కుటుంబాలకు అధికారం లభించనుంది. దీనివల్ల ఒక్కో కుటుంబానికి సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. వీరంతా బడుగు బలహీనవర్గాల వారే కావడం విశేషం. ఈ పట్టాల పంపిణీ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు, కృష్ణా జిల్లాలోని గన్నవరం సహా మొత్తం 8 నియోజకవర్గాల్లోని 15 మండలాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. సామాజిక వర్గాలవారీగా చూస్తే బీసీలు 12,093; ఓసీలు 6,130; ఎస్సీలు 4,546; ముస్లిం బీసీలు 955; ఎస్టీలు 333 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి.
గత ప్రభుత్వంలో కేవలం హామీలకే పరిమితమైన విజయవాడ ఇళ్ల స్థలాల సమస్యకు చంద్రబాబు నాయుడు పక్కా వ్యూహంతో ముగింపు పలికారు. ఈ నెల 30న జరగబోయే భారీ బహిరంగ సభలో లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను సీఎం చంద్రబాబు అందజేయనున్నారు. దశాబ్దాలుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా, ఎన్నో ఎన్నికలు వచ్చినా పరిష్కారం కాని ఈ సమస్యను కూటమి ప్రభుత్వం కేవలం కొద్ది నెలల పాలనలోనే పరిష్కరించటం విశేషం. తాము నివసిస్తున్న స్థలాలపై తమకు హక్కులు లేక, ఎప్పుడు ఏ ముప్పు వస్తుందోనని భయపడుతూ బతికిన విజయవాడ పేద ప్రజలకు ఇది నిజంగా పండుగ.
గతంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సెంటు భూమి పేరుతో ఊళ్లకు మైళ్ల దూరంలో, కొండల్లో, గుట్టల్లో, లోతట్టు ప్రాంతాల్లో కేవలం ‘కాగితాలు’ ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పేదలు దశాబ్దాలుగా ఎక్కడైతే నివాసం ఉంటున్నారో, ఆ విలువైన నగర ప్రాంతాల్లోనే వారికి సంపూర్ణ యాజమాన్య హక్కులతో కూడిన శాశ్వత పట్టాలను ఇస్తూ పేదల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 40 ఏళ్ల క్రితమే పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలనే ఆలోచనతో స్వర్గీయ ఎన్టీఆర్ పేదల ఇళ్ల పట్టాలకు శ్రీకారం చుట్టారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రజలు ఇచ్చిన అధికారంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు ఒక్కో ఇటుకా పేరుస్తున్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు.. భయం నుంచి భరోసా వైపు.. నిరాశ నుంచి కొత్త ఆశల వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఇది పట్టాల పంపిణీ మాత్రమే కాదు.. పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకం. పేదల హక్కులకు, పిల్లల భవిష్యత్తుకు పట్టాభిషేకం.
- వాసంశెట్టి సుభాష్
కార్మికశాఖ మంత్రి