Share News

15 శతాబ్దాల విజయవాడ ప్రయాణం!

ABN , Publish Date - Oct 10 , 2026 | 01:15 AM

సుమారు 1500 ఏళ్లకు పైగా ఒక నగరాన్ని ఒకే పేరుతోనో స్వల్ప మార్పులతోనో పిలవటం దక్షిణాదిలో అరుదు. విజయవాడకే ఈ ఘనత దక్కింది. తమిళనాడులోని మధురైని అలా పిలిచినా..

15 శతాబ్దాల విజయవాడ  ప్రయాణం!

సుమారు 1500 ఏళ్లకు పైగా ఒక నగరాన్ని ఒకే పేరుతోనో స్వల్ప మార్పులతోనో పిలవటం దక్షిణాదిలో అరుదు. విజయవాడకే ఈ ఘనత దక్కింది. తమిళనాడులోని మధురైని అలా పిలిచినా, దాని పేర్లు మూలంతో సంబంధం లేకుండా చాలా మారాయి. కానీ ఒకే పేరుతోనో లేదా స్వల్ప తేడాతోనో పిలుస్తున్న నగరం విజయవాడ మాత్రమే. జనపదాల నాటి జనస్మృతులు కొన్ని కల్పనలతో కూడి పురాణాలుగా మారడం సహజమే గానీ వాటికి ఆధారాలుండవు. పురాణాలతో సంబంధం లేకుండానే విజయవాడ నామధేయ చారిత్రక దశలు మనకు శాసనాల్లో కనిపించడం విశేషం. విజయవాడ ప్రాంతం ఎంత పాతదో... అంత కాకపోయినా విజయవాడ పేరు కూడా పాతదే. చెన్నై తదితర ప్రఖ్యాత మ్యూజియాలలో ఇప్పటి వరకు లభించిన అనేక శాసనాల ఆధారంగా చూసినప్పుడు విజయవాడ మొదటి పేరు.. విజయవాట.

మనకు లభిస్తున్న ముఖ్యమైన ఆధారాల్లో ఒకటి 7వ శతాబ్దానికి (సామాన్య శకం 673–682) చెందిన తూర్పు చాళుక్య రాజు రెండో విష్ణువర్ధన కాలానికి సంబంధించిన పెదపురప్పాడు తామ్ర పత్రాల మొదటి సముదాయం. ఈ తామ్రపత్రంలోని ప్రారంభ వాక్యం ‘స్వస్తి విజయవాట స్కంధావారాత’ అని ఉంది. దాని భావం ‘విజయవాట రాజ/ సైనిక శిబిరం నుంచి శుభం’, లేదా ‘విజయవాటలోని రాజశిబిరం నుంచి జారీ అయింది’ అని. ఇది ఇప్పటివరకు మనకు దొరికిన శాసనాలలో మొదటిదిగా భావిస్తున్నందున అంతకు కొన్ని వందల ఏళ్ల ముందే ఈ పేరు ఉండి ఉండవచ్చు.


తర్వాతి కాలంలో (719–755) మూడో విష్ణువర్ధనుడి ముసినికుండ రాగి ఫలకాలలో ‘బిజవాడ’ పేరు కనిపించింది. అందులోని 21–23 పంక్తుల్లో ‘ప్రియవల్లభ–అయ్యణ మహాదేవీ–బిజవాడ–నడుంబి–వసత్యై’ అని కనిపిస్తుంది. కుబ్జ విష్ణువర్ధన మహారాజు (624–642) మహారాణి అయ్యణ మహాదేవి ఏర్పాటు చేసిన బిజవాడ నడుంబి వసతికి ముసినికుండ గ్రామాన్ని దానం చేసిన భావం అది.

అద్దంకి పండరంగ శాసనంలో బెజవాడగా పేరు మారి కనిపించింది. భారత పురావస్తుశాఖ దీనిని గుణగ విజయాదిత్యుని మొదటి రాజ్య సంవత్సరానికి అనగా 848కు సంబంధించిందిగా పరిగణిస్తోంది. పాత ఎపిగ్రాఫియా ఇండికా గుణగ విజయాదిత్యుడి పాలనను 844–888గా తీసుకుంది. కాబట్టి ఈ శాసనం 844–845 కాలానిదై ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఇందులో ఎనిమిదవ పంక్తి.. ‘కట్టెపుదుర్గ్గంబు గడు బయల్సేసి కణ్డుకూర్ బెజవాడ గావ మెచ్చి’.. అని బెజవాడ ప్రస్తావన ఇందులో ప్రస్ఫుటంగా ఉంది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న 9వ శతాబ్దం నాటి కిరాతార్జున స్తంభ శాసనంలో పెచ్చవాడ అని ఉంది. 9వ పంక్తిలో ‘కలౌ పెచ్చెవాడ– కలియమ బోయి పుత్రః త్రికోటి బోయి’ అనే పఠనం ఉంది. అంటే త్రికోటి బోయి అనే వ్యక్తిని పెచ్చవాడకు సంబంధించినవాడిగా పేర్కొంటోంది. ‘బెజవాడకు ఈ శాసనంలో పెచ్చవాడ అని పేరు ఉన్నప్పటికీ, తామ్రపత్రాల్లో మాత్రం విజయవాడ, విజయవాట, విజయవాటిక అనే రూపాలు ఉన్నాయి’ అని పురావస్తు సర్వే నివేదిక పేర్కొంది.


928–934 మధ్య పాలించిన తూర్పు చాళుక్య రాజు యుద్ధమల్లుడి స్తంభ శాసనంలో బెజవాడ అనే రూపం కనపడింది. బెజవాడకు వచ్చే యాత్రికులు, అక్కడి దేవాలయం, మఠం వంటి విషయాలు కూడా శాసనంలో ఉన్నాయి. ఇందులోని నాలుగో పద్యంలో... చేబ్రోలు నుంచి బెజవాడ జాతరకు వచ్చిన కుమారస్వామి ఈ ప్రదేశాన్నే ఇష్టపడి ఇక్కడ ప్రత్యక్షంగా నిలిచాడని, దాంతో మల్లుడు ఆలయం, మఠం నిర్మించాడని చెబుతుంది. ఐదో పద్యం.. ‘బెజవాడకెల్ల బెడంగును రక్షయుంగాను న్దమతాత మల్లపరాజు వేరెయు దానుం గట్టించెం..’ అని ఉంది. బెజవాడ మొత్తానికి అలంకారంగా, రక్షణగా నిలిచేలా యుద్ధమల్లుని తాత మల్లపరాజు ఆలయాన్ని నిర్మించాడు అని దీని భావం. ‘బెజవాడ మొత్తానికి’ అనే సూచన చూస్తే బెజవాడ అప్పటికే ఒక పట్టణంగానో, క్లస్టర్‌గానో ఆవిర్భవించినట్లు అనుకోవచ్చు.

పదో శతాబ్దం ప్రారంభానికి సంబంధించి రికార్డు చేసిన మధ్యయుగ జైన మతం అనే పరిశోధన గ్రంథం, తూర్పు చాళుక్య రాజు రెండో అమ్మరాజు కాలంలో విజయవాటికలోని రెండు జైన దేవాలయాలకు దానాలు జరిగినట్లు చెప్పి, ‘విజయవాటికను బిజవాడ’ అని కూడా పేర్కొంది. ఇదే విషయాన్ని ఎపిగ్రాఫియా ఇండికా సంపుటి మరింత స్పష్టంగా ‘విజయవాటిక ఈజ్ క్లియర్లీ ఐడెంటికల్ విత్ మోడరన్ టౌన్ బెజవాడ ఆన్ ది కృష్ణా రివర్‌’ అని పేర్కొంది. రెండో అమ్మరాజు (945–970)కి సంబంధించిన తామ్రపత్ర దానశాసనం విజయవాటికలోని రెండు జైన దేవాలయాలకు భూదానం చేసినట్లు చెప్తోంది. ఈ అమ్మరాజు కాలానికే చెందిన 958 నాటి రాగి ఫలక శాసనంలో తాండికొండతో పాటు మరికొన్ని గ్రామాలను విజయవాటలోని శివాలయానికి దానం చేసినట్లు నమోదై ఉంది. అనగా ఒక శాసన సంప్రదాయంలో విజయవాటిక, మరో శాసనంలో విజయవాట కనిపిస్తున్నాయి. ఇక 1229 నాటి ప్రకాశం జిల్లా వెలిగండ్లలో లభించిన శాసనంలో ‘ఇంద్రకీలాద్రిలోని బెజవాడ మల్లేశ్వరదేవ’కు దానం నమోదై ఉంది. అక్కడ ఇంద్రకీలాద్రి, బెజవాడ, మల్లేశ్వరదేవ... మూడు అంశాలు ఒకే ధార్మిక స్థలాన్ని సూచిస్తున్నాయి.


ఇక విజయవాడ అనే రూపానికి కూడా శాసన ఆధారాలు ఉన్నాయి. పురావస్తు శాఖ శాసనాల జాబితాలో తూర్పు చాళుక్య సర్వలోకాశ్రయ విష్ణువర్ధనుడి పదిహేడో పాలన సంవత్సరానికి చెందిన విజయవాడ శాసనం నమోదై ఉంది. మల్లికార్జున ఆలయం నుంచి కనకదుర్గ ఆలయం వైపు వెళ్లే మార్గంలోని రెండో మెట్ల వరుస వద్ద ఈ శాసన ఫలక ఉన్నట్లు ఆ జాబితా పేర్కొంది. శాసనంలో తెలుగు–సంస్కృత భాషలు, తెలుగు లిపి ఉపయోగించారు.

ఇప్పటివరకు లభించిన శాసనాధారాలన్నిటినీ ఒక క్రమంలో పరిశీలిస్తే.. విజయవాట, బిజవాడ, పెచ్చవాడ, బెజవాడ, విజయవాటిక, విజయవాడ అనే రూపాలు మన ముందుకు వస్తాయి. వీటిలో కొన్ని ప్రత్యక్ష శాసన పఠనాలు, కొన్ని సంబంధిత రూపాలు; మరికొన్ని శాసన సంపాదకులు ప్రదేశాన్ని గుర్తించేందుకు అనుసంధానించిన రూపాలు. మొదటి ‘విజయవాట’ అనే పేరు ఆ స్థానిక జనపదాల సంస్కృతీకరణ ప్రభావంతో ఏర్పడి, ఏ చారిత్రక, భాషాపరమైన కారణాలతోనో ‘బిజయవాడ’గా, తర్వాత ‘బిజవాడ’గా, ‘బెజవాడ’గా మారి ఉండవచ్చు. ఈ మధ్యలో జరిగిన చాలా పరిణామాలు శాసనాలకు ఎక్కకపోయి ఉండొచ్చు. ఈ మార్పుల వెనుక స్థానిక ఉచ్చారణలు, ధ్వని పరిణామాలు, లిప్యంతరీకరణలు, వాడుకలు, వాడుక భేదాలు, సంస్కృతీకృత రూపాలతో కలిసి విస్తరించి, వివిధ రూపాల్లో కొనసాగిన ప్రక్రియగా భావించాల్సి ఉంటుంది. అయితే తొలి రూపం (విజయవాట) పెద్దగా చెరిగిపోకుండా కొనసాగడమే విజయవాడ పేరు చరిత్రలోని ప్రత్యేకత. శాసనాధారాల ప్రకారం ఈ నగర నామానికే 15 శతాబ్దాల చరిత్ర కనిపిస్తుంటే, అంతకు ముందరి శతాబ్దాలవి కనిపించని శాసనాలెన్నో.. ఇక ఈ నగర ఆవిర్భావ తొలి దశలు అంతకు ముందు ఎన్ని శతాబ్దాల నాటివో! విజయోస్తు.. విజయవాడ!!

- టి. కొండబాబు

(రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్)

Updated Date - Oct 10 , 2026 | 01:20 AM