స్మృతి
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:07 AM
చాలకాలంగా ఆ ఇంట్లో ఎవరున్నారో ఎవరూ అడగలేదు ఉదయం తలుపులు తెరిచిన వారెవరో..
చాలకాలంగా ఆ ఇంట్లో ఎవరున్నారో ఎవరూ అడగలేదు
ఉదయం తలుపులు తెరిచిన వారెవరో
సాయంత్రం దీపాలు వెలిగించిన వారెవరో
పెరట్లో అంత ఎత్తు పెరిగిన పోక చెట్లు వేసిన వారెవరో
ఎలా మాయమయ్యారో ఎవరూ ప్రశ్నించలేదు
ఆంతరంగికాలు రోడ్ల మీదకు రావు
దినాలు నిష్క్రమించినట్టు
తేదీలు అంతర్ధానమై
ప్రతీదీ వచ్చి పోతుంది ప్లాట్‌ఫామ్ మీద ట్రైను లాగ
ఎక్కేవాళ్ళు ఎక్కితే దిగేవాళ్ళు దిగుతారు
తినేవాళ్ళు తింటే కిటికీల్లోంచి సంభ్రమభరితంగా
చూసేవాళ్ళు చూస్తారు
కొద్ది క్షణాలు కొన్ని లిప్తలు
కాస్త వ్యాకులత అంతే
అనంత కాల వాహినిలో
ఫలానా ఏడాది ఆ వీధిలో ఆ ఇంట్లో ఆ నంబరులో
ఎవరున్నారో ఎవరూ అడగలేదు
కనీసం కొన్ని ఆనవాళ్ళు– రంగో పుట్టుమచ్చో వృత్తో
గుర్తు చేసి అడగొచ్చు మరి అడగలేదు
గాలివానకు విరిగిన గేటు
కూలిన ప్రహరీ గోడ
తల చెదిరిన ఇంటి పైకప్పు
రోజూ ఇంటి వాకిలి కడిగి ముగ్గుపెట్టిన స్త్రీలు
ఆరుబైట గోల గోలగా ఆడుకున్న పిల్లలు
రాత్రి వేళ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సాగిన చర్చలు
చాలాకాలంగా ఎవరూ వాకబు చేయలేదు
ఎందుకనో ఆ ఇంటి ముందు ఎవరూ ఆగనూ లేదు అడగనూ లేదు
మరి గుర్తులు ఎన్నాళ్ళుంటాయి చెరిగిపోవా
మరి ఇళ్ళు ఎన్ని యుగాలుంటాయి కూలిపోవా
శిథిలం కాని ఇల్లు పేరు దేహం ఉంటాయా
- విజయ చంద్ర
94387 20409