Share News

నినాదప్రాయంగానే హైందవ ఐక్యత!

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:19 AM

విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీహెచ్‌పీ నాయకుడు పగుడాకుల బాలస్వామి ‘హిందువుల ఐక్యతే వీహెచ్‌పీ లక్ష్యం’ అంటూ వ్యాసం రాశారు.

నినాదప్రాయంగానే హైందవ ఐక్యత!

విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీహెచ్‌పీ నాయకుడు పగుడాకుల బాలస్వామి ‘హిందువుల ఐక్యతే వీహెచ్‌పీ లక్ష్యం’ అంటూ వ్యాసం రాశారు (సెప్టెంబర్‌ 4). ఆ వ్యాసం చదివిన ఒక మామూలు హిందువుగా నాకు అనేక సందేహాలు వచ్చాయి.

‘హిందవః సోదరాః సర్వే’– అనే భావనతో హిందూ సమాజం మరింత సంఘటితం కావాలని బాలస్వామి కోరారు. ఒక హిందువు మరో హిందువును సోదరుడిగా భావించాలన్న మంచి సూచన చేశారు. దేశ విదేశాల్లో ఉన్న హిందువుల అనుసంధాన వేదికగా వీహెచ్‌పీ పని చేస్తోందన్నారు. కానీ నేడు హిందూ మతంలో అబ్బాయీ అమ్మాయి ప్రేమించి పెళ్లాడితే కులం పేరుతో హిందువులే హిందువుల్ని చంపుతున్నారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అమ్రాబాద్ సాయికుమార్ (2014), మంథని మధుకర్ (2017), మిర్యాలగూడ ప్రణయ్ (2018), ఆత్మకూర్ స్వాతిరెడ్డి (2018), సదాశివపేట హేమంత్‌కుమార్ (2020), సరూర్‌నగర్ నాగరాజు (2023), ఇబ్రహీంపట్నం మహిళా పోలీస్ కానిస్టేబుల్ నాగమణి (2024), సూర్యాపేట మాల బంటి (2025), షాద్‌నగర్‌ ఎల్లంపల్లి ఎర్ర రాజశేఖర్ (2025)... వీరంతా ఇలాగే దారుణ హత్యలకు గురయ్యారు. బీరంగూడలో శ్రవణ్‌ సాయి (2025) అనే సంపన్న యువకుడిని యువతి కుటుంబ సభ్యులు క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపారు. ఇలాంటి ఏ సందర్భంలోను వీహెచ్‌పీ సంస్థ సభ్యులెవ్వరూ బాధిత కుటుంబాలను పరామర్శించలేదు, కనీసం సానుభూతి ప్రకటించలేదు. హిందువుల ఐక్యతే లక్ష్యంగా ప్రకటించుకుంటున్న వీహెచ్‌పీ మరి ఇటువంటి సందర్భాలలో హిందూ కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? కుల భేదాలు తొలగిపోయే విధంగా ఎలాంటి కార్యక్రమాలనూ ఎందుకు నిర్వహించడం లేదు? అసలు కుల భేదాల తొలగింపునకు వారి వద్ద ప్రణాళిక ఏదైనా ఉన్నదా?


ఇటీవల ఆరెస్సెస్‌ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఒక సమావేశంలో... అసలు హిందూ అనే పదమే లేదని, హిందూ అనేది మతం కాదని తేల్చేశారు. హిందూ మతానికి పునాదిగా చెప్పుకొనే నాలుగు వేదాలు, 18 పురాణాలు, 108 ఇతిహాసాల్లో ఎక్కడా ‘హిందూ’ అన్న పదం లేదని ఇప్పటికీ అనేకమంది వేదపండితులు, మఠాధిపతులు పలు సందర్భాల్లో చెబుతుంటారు. ఇదే విషయాన్ని మన చినజీయర్ స్వామి కూడా ఒకసారి చెప్పినట్లు విన్నాను. ఇంతమంది ప్రముఖులు లేదని చెబుతున్న హిందూ పదం, హిందూ మతం ఎలా వచ్చాయి? అసలు బాలస్వామి చెబుతున్న హిందువులు ఎవరనేది ఇప్పుడు మూల ప్రశ్న. వైదికాన్ని ఆచరిస్తున్నవారు హిందువులైతే వైదికంలోని వర్ణ వ్యవస్థే వర్ణాల మధ్య స్పష్టమైన తేడాను చూపుతున్నది. పునాదిలోనే తేడాలున్నప్పుడు బాహ్యంగా ఎంతటి ఐక్యత సాధించినా ప్రయోజనం ఏమిటి? హిందూ మతంలోనే కులాంతర వివాహాలు చేసుకుంటే బతుకుతామన్న భరోసా లేనప్పుడు హిందువుల ఐక్యత ఎలా సాధ్యం?

హిందూ మతం నుంచి ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి వలసలు పెరగడానికి ప్రధాన కారణం హిందూ మతంలోని సామాజికపరమైన ‘కుల’ అంతరాలే అంటే వీహెచ్‌పీ అంగీకరించకపోవచ్చు, కానీ ఇది నిజం. 1947లో మతం ఆధారంగా దేశ విభజన జరగకపోయి ఉంటే నేడు అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో కలుపుకుని చెప్పుకొనే అఖండ భారతదేశంలో 50శాతానికి పైగా ముస్లింలు ఉండేవారు. ఇప్పుడు ఈ మాత్రం హిందూ మతం మనుగడలో ఉన్నదంటే అది బ్రిటిష్ వారి రాజ్యవిస్తరణతో ముస్లిం రాజ్యాల పతనం అవటంతో పాటు, బ్రిటిష్ వారి కాలంలో దయానంద సరస్వతి, రాజారాంమోహన్‌రాయ్ లాంటి ఎందరో హిందూ సంఘ సంస్కర్తలు చేసిన కృషి ఫలితమే. ఇప్పటికీ మతమార్పిడులు జరుగుతున్నాయంటే దానికి హిందూ మతంలోని సామాజిక రుగ్మతలే కారణమన్న నిజాన్ని వీహెచ్‌పీ లాంటి సంస్థలు అంగీకరించాలి.


పట్టణాలలో ఇప్పటికీ ఫలానా కులం వారికి మాత్రమే ఇల్లు కిరాయికి ఇస్తామన్న బోర్డులు కనపడుతున్నాయి. దళితులను గుళ్లలోకి రానివ్వని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దళితుల శ్మశానాలకు కనీసం దారిలేని పరిస్థితులెన్నో హిందూమతాన్ని వెక్కిరిస్తున్నాయి. ఫలితంగా అనేకమంది నిమ్న కులాలవారు ముస్లింల, క్రైస్తవుల పంచన చేరుతున్నారు. హిందూ మతంలోని సామాజిక రుగ్మతలకు శస్త్రచికిత్స చేయకుండా, పైపై మేకప్‌లతో ‘హిందువులందరూ బంధువులే’ అనే నినాదంతో ముందుకెళ్లడమంటే చిల్లులు పడిన నావతో సముద్ర ప్రయాణం లాంటిదే అవుతుంది.

- మామిడి నారాయణ

సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్

Updated Date - Sep 30 , 2026 | 12:21 AM