Share News

హిందువుల ఐక్యతే వీహెచ్‌పీ లక్ష్యం

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:33 AM

హిందూ సమాజాన్ని సంఘటితం చేసి, సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలనే మహోన్నత సంకల్పంతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆవిర్భవించింది.

హిందువుల ఐక్యతే వీహెచ్‌పీ లక్ష్యం

హిందూ సమాజాన్ని సంఘటితం చేసి, సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలనే మహోన్నత సంకల్పంతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆవిర్భవించింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పవిత్ర పర్వదినంతో ముడిపడి ఉన్న విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం ప్రతి హిందువులోనూ ధర్మచైతన్యాన్ని మేల్కొలిపే సందర్భం. ధర్మం కోసం నిలబడటం, సమాజాన్ని సంఘటితం చేయడం, బలహీనులకు అండగా నిలవడం, సత్యాన్ని కాపాడటం ప్రతి హిందువు బాధ్యత అనే స్ఫూర్తిని ఈ ఆవిర్భావ దినోత్సవం మనకు గుర్తుచేస్తున్నది.

1964లో ముంబైలో సాధుసంతులు, ధార్మిక పెద్దలు, సామాజిక నాయకులు కలిసి విశ్వహిందూ పరిషత్‌కు పురుడుపోశారు. భిన్నమైన మఠాలు, పీఠాలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక సంస్థలు, సాధుసంతులను ఒకే వేదికపైకి తీసుకురావడం వెనుక ఉన్న ఆలోచన అత్యంత విశాలమైనది.

దేశంలోని హిందువులందరినీ ఒకే సంప్రదాయంలోకి తీసుకురావడం కాదు.. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ ‘మనమంతా హిందూ సమాజానికి చెందినవారమే’ అనే ఆత్మీయ భావనను బలపరచడం విశ్వహిందూ పరిషత్ ప్రధాన లక్ష్యం. సాధుసంతుల మార్గదర్శకత్వం, సమాజంలోని వివిధ వర్గాల సహకారం, కార్యకర్తల అంకితభావంతో వీహెచ్‌పీ తన ప్రస్థానాన్ని విస్తరించుకుంటూ వస్తోంది. హిందూ సమాజ చైతన్య ప్రస్థానంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి ఉద్యమం ముఖ్యమైన ఘట్టం. శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన శ్రీరామ మందిరం నిర్మించాలనే ఆకాంక్షను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశ్వహిందూ పరిషత్ ప్రముఖపాత్ర పోషించింది. దీర్ఘకాలిక న్యాయ, సామాజిక, ప్రజా ప్రక్రియల అనంతరం అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం సాకారం కావడం కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.


విశ్వహిందూ పరిషత్ దశాబ్దాలుగా సేవ, సంస్కారం, సమరసత, ధర్మజాగరణ, గోరక్షణ, దేవాలయ పరిరక్షణ, సామాజిక చైతన్యం వంటి అనేక రంగాల్లో పనిచేస్తోంది. సమాజంలో అవసరమైన వర్గాలకు విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలు అందించడం, గిరిజన మారుమూల ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం వీహెచ్‌పీ ప్రధాన బాధ్యత. విపత్తుల సమయంలో బాధితులకు సహాయం చేయడం వంటి కార్యక్రమాల ద్వారా పరిషత్ సేవా భావాన్ని ముందుకు తీసుకెళ్తోంది. హిందూ సమాజంలో ఏ వర్గం వెనుకబడినా అది మొత్తం సమాజం వెనుకబడినట్లేననే భావనతో సామాజిక సమరసతకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. కుల, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి హిందువూ పరస్పరం సోదరభావంతో మెలగాలి. ఇదే సనాతన ధర్మం మనకు నేర్పే మానవీయ విలువ.

నేడు హిందువులు ప్రపంచంలోని అనేక దేశాల్లో నివసిస్తున్నారు. విదేశాల్లో జన్మించిన హిందూ యువతరానికి భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, పండుగలు, సంప్రదాయాలు, దేవాలయాలు, ధార్మిక వారసత్వం గురించి అవగాహన కల్పించడం ఒక ముఖ్యమైన బాధ్యత. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని అనుసంధానించే వేదికగా విశ్వహిందూ పరిషత్ పాత్ర మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. ‘ప్రపంచంలో ఎక్కడ హిందువు ఉన్నా.. అతని సాంస్కృతిక మూలాలు భారతీయ సనాతన సంప్రదాయంతో అనుసంధానమై ఉండాలి’ అనే భావనను బలపరచడం అవసరం.


భారత భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక విద్యతో పాటు మన సంస్కృతి, చరిత్ర, కుటుంబ విలువలు, దేశభక్తి, సేవాభావం, ధర్మబద్ధమైన జీవన విధానం గురించి కూడా యువత తెలుసుకోవాలి. ధర్మం అంటే కేవలం దేవాలయానికి వెళ్లడం లేదా పూజలు చేయడం మాత్రమే కాదు. ధర్మం అంటే సత్యం, న్యాయం, కర్తవ్యం, సేవ, త్యాగం, పరస్పర గౌరవం, సమాజం పట్ల బాధ్యత. ఈ విశాలమైన ధర్మ భావనను యువతలో పెంపొందించడమే నేటి అవసరం. హిందూ సమాజంలోని ప్రతి కుటుంబం ధర్మం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ప్రతి గ్రామంలో ధర్మచైతన్యం పెరగాలి. ప్రతి యువకుడిలో సేవాభావం పెంపొందాలి. ప్రతి కుటుంబంలో సంస్కారం బలపడాలి. ప్రతి హిందువు మరో హిందువును తన సోదరుడిగా భావించే పరిస్థితి ఏర్పడాలి.

శ్రీకృష్ణుడు గీతలో చేసిన కర్తవ్యబోధనే మనకు మార్గదర్శకం. ధర్మం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి, సమాజ సేవలో పాల్గొనే ప్రతి కార్యకర్త, సంస్కృతి పరిరక్షణకు కృషి చేసే ప్రతి కుటుంబం... హిందూ సమాజ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది. ఈ పవిత్ర శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా, విశ్వహిందూ పరిషత్ 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘‘హిందవః సోదరాః సర్వే’’ (హిందువులందరూ సోదరులే) అనే భావంతో హిందూ సమాజం మరింత సంఘటితం కావాలని, సనాతన ధర్మం శాశ్వత విలువలను ప్రపంచానికి మరింత బలంగా చాటాలని మనమందరం సంకల్పిద్దాం.

- పగుడాకుల బాలస్వామి

విశ్వహిందూ పరిషత్, తెలంగాణ

Updated Date - Sep 04 , 2026 | 04:35 AM