Share News

సార్థక నామధేయుడు పూల సుబ్బయ్య

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:39 AM

పేరుకు తగ్గట్టుగానే సార్థక నామధేయుడు కీ.శే. పూల సుబ్బయ్య. ఇంటి పేరులో పరిమళాన్ని, తన పేరులోని మంచితనాన్ని నింపుకున్న నాయకుడు. ఎవరీ పూల సుబ్బయ్య? ఆయనకు, వెలిగొండ ప్రాజెక్టుకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?..

సార్థక నామధేయుడు పూల సుబ్బయ్య

పేరుకు తగ్గట్టుగానే సార్థక నామధేయుడు కీ.శే. పూల సుబ్బయ్య. ఇంటి పేరులో పరిమళాన్ని, తన పేరులోని మంచితనాన్ని నింపుకున్న నాయకుడు. ఎవరీ పూల సుబ్బయ్య? ఆయనకు, వెలిగొండ ప్రాజెక్టుకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?.. అనే విషయాలు చాలా మందికి తెలియవు. 1929 జూన్ 29న ఉమ్మడి ప్రకాశం జిల్లా కంభంలో ఓ సాధారణ కుటుంబంలో సుబ్బయ్య జన్మించారు. 1946–1949లో గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. న్యాయవాదిగా కొంతకాలం పనిచేశారు.

అప్పట్లో నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన కంభం, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు బలంగా పనిచేసేవి. గిరిజనుల సమస్యలపై గొలుసుకట్టు ఉద్యమాలు జరిగేవి. 1949లో విద్యార్థి దశలోనే ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘంలో సుబ్బయ్య చురుకైన పాత్ర పోషించారు. పార్టీకి చెందిన పలు హోదాల్లో పనిచేశారు. 1962, 1967 శాసనసభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా యర్రగొండపాలెం (అప్పట్లో కర్నూలు జిల్లా) నుంచి గెలుపొందారు. 1978లోనూ మార్కాపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ప్రకాశం జిల్లా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. సాగు, తాగునీరు లేక గ్రామాలన్నీ కరవు కోరల్లో చిక్కుకునేవి. వెయ్యి అడుగుల లోతులో కూడా నీరు పడేది కాదంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉండేది. ఈ అంశాలన్నింటినీ అధ్యయనం చేసిన సుబ్బయ్య.. ప్రకాశంను కరవు రహిత జిల్లాగా మార్చాలంటే కృష్ణా జలాలను ఆ ప్రాంతానికి తీసుకురావడం ఒక్కటే ఏకైక మార్గంగా భావించారు. ఇదొక సాహసోపేతమైన ప్రాజెక్టు. నల్లమల టైగర్ ఫారెస్ట్‌లోని కొండలను తొలిచి సొరంగాలు ఏర్పాటు చేస్తేనే సాధ్యం.


ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రజల మద్దతుతో సుబ్బయ్య ఉద్యమించారు. దీంతో ఈ వెలిగొండ ప్రాజెక్టు ప్రతిపాదనలకు మొదట స్వర్గీయ ఎన్టీఆర్ ఆమోదం తెలిపారు. ఆయన నిర్ణయానికి కొనసాగింపుగా 1996 మార్చి 5న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీల ప్రజాప్రతినిధులంతా వైఎస్‌ను కలిశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం ఎంతగానో ఉద్యమించి, ఆ క్రమంలోనే అసువులు బాసిన పూల సుబ్బయ్య పేరును ఆ ప్రాజెక్టుకు పెట్టాలని వైఎస్‌ను కోరగా, అందుకు ఆయన అంగీకరించారు.

2014–2019 వరకు చంద్రబాబు పోలవరం పనులతో పాటు వెలిగొండ పనులనూ పరుగులు పెట్టించారు. పలుమార్లు ప్రాజెక్టు పనులను సందర్శించారు. 2019–2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో పూర్తిచేయలేకపోయారు. ‘వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి, 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను’ అన్న మాట తప్పి, నీళ్లు రాకుండానే, ఎకరం నేల కూడా తడవకుండానే ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ‘రక్తి’ కట్టించారు. 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పూర్తి స్థాయిలో రెండు సొరంగ మార్గాలను పూర్తి చేసి, అన్ని అవరోధాలనూ అధిగమించి, 2026 ఆగస్టు 31వ తేదీన ఆ మహాస్వప్నాన్ని సాకారం చేశారు. కృష్ణా నీళ్లతో ఆ ప్రాంతాన్ని తడిపి, ఆ ప్రాజెక్టును తెలుగు ప్రజలకు అంకితం ఇచ్చారు.


ఇక్కడ చిన్న లెక్క చెప్పాలి. వైఎస్సార్‌, వైఎస్ జగన్ హయాంలో ప్రాజెక్టు పనుల కోసం రూ.2,175 కోట్లు ఖర్చు పెట్టారు. ఆయా సందర్భాలలో పనిచేసిన ముఖ్యమంత్రులు రూ.2,417 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు హయాంలో రూ.3,256 కోట్లు ఖర్చు పెట్టారు. మరో రూ.1906 కోట్ల ఖర్చుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.10,200 కోట్లు కాగా, చంద్రబాబు హయాంలో రూ.5,662 కోట్ల ఖర్చు జరిగిందని అధికారుల అంచనా. ఏ ప్రాజెక్టు నిర్మాణమైనా ఏడాదికో, ఐదేళ్లకో పూర్తి కాదు. ఏ అభివృద్ధి పనులనైనా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వివక్షకు తావులేకుండా కొనసాగించాలి.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 53.85 టీఎంసీలు. 4.47లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందించడం ప్రాజెక్టు లక్ష్యం. కాగా తొలి విడతలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. ప్రజాప్రతినిధి అన్న పదాన్ని సార్థకం చేసుకొని, తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకుని వచ్చేందుకు సుబ్బయ్య చేసిన కృషి మహోన్నతమైనది.

- పోతుల బాలకోటయ్య

చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు

Updated Date - Sep 05 , 2026 | 12:42 AM