Share News

‘క్రెడిట్‌ చోరీ’లో వాస్తవాలు ఇవి!

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:26 AM

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అనేక దశాబ్దాలుగా నీటి కొరతతో అల్లాడుతోంది. భూగర్భ జలాలు అడుగంటాయి. వర్షాధార వ్యవసాయం రైతులకు శాపంగా మారింది...

‘క్రెడిట్‌ చోరీ’లో వాస్తవాలు ఇవి!

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అనేక దశాబ్దాలుగా నీటి కొరతతో అల్లాడుతోంది. భూగర్భ జలాలు అడుగంటాయి. వర్షాధార వ్యవసాయం రైతులకు శాపంగా మారింది. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ జలాలను రాయలసీమ, దక్షిణ కోస్తాకు తరలించే దూరదృష్టి గల ఆలోచన నుంచే వెలిగొండ ప్రాజెక్టు పుట్టుకొచ్చింది. ఈ ప్రాజెక్టును 1996 మార్చి 5న అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల, రైతుల వలసల నివారణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటి ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ, కొందరు పాలకుల నిర్లక్ష్యం, నిధుల కొరత, రాజకీయ అనిశ్చితి కారణంగా వెలిగొండ ప్రాజెక్టు ఎన్నోసార్లు ఆగిపోయింది.

ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ చేస్తున్న క్రెడిట్ చోరీ వాదనలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్టును తానేదో ఉద్ధరించినట్లు, తన క్రెడిట్‌ను చంద్రబాబు చోరీ చేస్తున్నట్లు సొంత పత్రికలో అబద్ధాల కథనం రాసుకొచ్చారు. కేవలం బటన్ నొక్కి ఫొటోలకు పోజులిచ్చినంత మాత్రాన ప్రాజెక్టు క్రెడిట్ సొంతం కాదు. దశాబ్దాల పాటు అడ్డంకులను తొలగించి, సాంకేతిక సవాళ్లను అధిగమించి, నిధులు సమకూర్చి, పనుల వేగం పెంచిన వారికే ఆ క్రెడిట్ దక్కుతుంది. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జగన్ చేస్తున్న వాదనలు– గోరంత పని చేసి కొండంత ప్రచారం చేసుకున్నట్టు ఉన్నాయి. ప్రాజెక్టుకు ప్రాణం పోసింది, దీనిని నిద్రావస్థ నుంచి నిర్మాణ దశలోకి తెచ్చింది చంద్రబాబు హయాంలోనే.


వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైనవి రెండు సొరంగాలు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య మొదటి టన్నెల్ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. అత్యాధునిక మిషనరీని ఉపయోగించి క్లిష్టమైన నల్లమల అడవులలో తవ్వకం పూర్తి చేశారు. మిగిలిపోయిన స్వల్ప పనులను పూర్తి చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి అయిదేళ్లు పట్టింది. 2024 మార్చిలో పనులు పూర్తి కాకుండానే, కేవలం ఎన్నికలు వస్తున్నాయని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూశారు జగన్‌రెడ్డి. సకాలంలో బిల్లులు చెల్లించక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేస్తే, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.140 కోట్ల బకాయిలు చెల్లించి పనులు పునఃప్రారంభించి, ప్రాజెక్టుకు మళ్ళీ ప్రాణం పోసింది.


2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌లో రూ.1,373 కోట్లు కేటాయించి, వాటిలో రూ.1,319 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేసింది. 2019–24 మధ్య వైసీపీ ప్రభుత్వం రూ.3,520 కోట్లు కేటాయించి, కేవలం రూ.648 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే దాదాపు రూ.525 కోట్లు వెచ్చించి, పనులు పూర్తి చేసి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నది. వైసీపీ ప్రభుత్వ కాలంలో 2,770 మీటర్ల టన్నెల్–2 బెంచింగ్ పనులు మాత్రమే చేయగా, కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలోనే 4,563 మీటర్లు పూర్తి చేసింది. మిగిలిన 361 మీటర్లను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నది. వైసీపీ హయాంలో టన్నెల్–2 లైనింగ్ పనులు కేవలం 702 మీటర్లు మాత్రమే చేస్తే, కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలోనే 3,708 మీటర్ల లైనింగ్ పనిని పూర్తి చేసింది. మిగిలిన 3,232 మీటర్లు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. టన్నెల్–2లో 12వ కి.మీ వద్ద నిలిచిపోయిన టీబీఎం మీద ఉన్న కోర్టు కేసులను పరిష్కరించడానికి చర్యలు తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక సాంకేతిక నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించింది.

2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టన్నెల్స్ హెడ్ రెగ్యులేటర్ పనులను ప్రారంభించి టన్నెల్–1 హెడ్ రెగ్యులేటర్‌ను పూర్తి చేయగా, 2019–24 మధ్య వైసీపీ మిగిలిన పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్ల వింగ్స్, రిటర్న్స్ పనులను 52శాతం పూర్తి చేసి, మిగిలినవి మార్చి నాటికి పూర్తి చేయనున్నది. సరైన ప్రణాళిక లేకుండా 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల బురదను టన్నెల్–1లో రోడ్డు నిర్మాణంలో, టన్నెల్–2లో కొల్లం వాగు వద్ద కుప్పగా పోసి పనులకు అడ్డంకిగా మార్చింది. కూటమి ప్రభుత్వం రూ.456 కోట్లు మంజూరు చేసి రిటైనింగ్ వాల్స్, లైనింగ్ పనులు చేపట్టింది. పరిపాలనా అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టి, అనుమతులు రాకపోవడంతో పనులు ఆపేసింది. వైసీపీ చేసిన నిర్వాకాన్ని సరిదిద్ది, కూటమి ప్రభుత్వం రూ.106.39 కోట్లతో పరిపాలనా ఆమోదం తెలిపి పనులు పునఃప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వం కేవలం 96 కుటుంబాలకే పునరావాసం ఇచ్చి, మిగిలిన 7,225 కుటుంబాలను గాలికి వదిలేయగా, కూటమి ప్రభుత్వం వచ్చే జూన్ నాటికి మిగిలిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని నిర్ణయించింది.

వాస్తవాలు ఇలా ఉంటే వెలిగొండ ప్రాజెక్టు తానే పూర్తి చేసినట్లు జగన్‌రెడ్డి తన సొంత పత్రికలో కథనాలు రాయించడం ప్రాజెక్టు చరిత్రను తుడిచేయడమే. వెలిగొండ ప్రాజెక్టుకు బీజం పడింది, పనులు ఎక్కువ జరిగింది చంద్రబాబు హయాంలోనే అన్నది నిర్వివాదాంశం. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను పాడు పెట్టిన జగన్‌కు, నేడు ప్రాజెక్టుల క్రెడిట్ కోసం ఆరాటపడే హక్కు ఎక్కడిది?

-నీరుకొండ ప్రసాద్

Updated Date - Jan 31 , 2026 | 03:26 AM