మౌనంగానే ఉండమని అంటోంది మన రాజ్యాంగం!
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:17 AM
2026లో పార్లమెంట్ ఆమోదించిన సవరణ చట్టం 1971 నాటి ‘జాతీయ గౌరవాలకు అవమాన నిరోధక చట్టం’లోని సెక్షన్ 3ను మార్చింది. ఇంతవరకు ఈ సెక్షన్ జాతీయగీతం (జనగణమన) ఆలాపనకు..
2026లో పార్లమెంట్ ఆమోదించిన సవరణ చట్టం 1971 నాటి ‘జాతీయ గౌరవాలకు అవమాన నిరోధక చట్టం’లోని సెక్షన్ 3ను మార్చింది. ఇంతవరకు ఈ సెక్షన్ జాతీయగీతం (జనగణమన) ఆలాపనకు అడ్డుపడటాన్ని మాత్రమే నేరంగా చూసేది. ఇప్పుడు అదే రక్షణను జాతీయ గేయం (వందేమాతరం)కు కూడా వర్తింపజేస్తున్నది. ఈ చట్టం ప్రకారం ‘వందేమాతరం’ పాడుతున్నప్పుడు అడ్డుపడినా, అవమానించినా దానిని నేరంగా పరిగణిస్తారు. అయితే గేయాన్ని పాడకుండా ఎవరైనా మౌనంగా ఉంటే, అది కూడా నేరమేనా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ముందు మరో ప్రాథమిక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. మౌనం అంటే ఏమీ చెప్పకపోవడమేనా, లేక అది కూడా ఒక రకమైన వ్యక్తీకరణేనా? మన రాజ్యాంగం దీనికి స్పష్టమైన సమాధానమే ఇస్తున్నది.
రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రతి పౌరుడికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తున్నది. సాధారణంగా మనం దీన్ని ‘మాట్లాడే హక్కు’గా అర్థం చేసుకుంటాం. కానీ కోర్టులు దీన్ని మరింత లోతుగా చూస్తున్నాయి. ఒక విషయాన్ని చెప్పే హక్కు ఎంత ముఖ్యమో, చెప్పకుండా ఉండే హక్కు కూడా అంతే ముఖ్యమని నొక్కి చెబుతున్నాయి. ఎవరైనా ఒక విషయాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా, మౌనం ద్వారానే తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఆ హక్కును కూడా రాజ్యాంగం కాపాడుతుంది.
భారత అత్యున్నత న్యాయస్థానం దీన్ని పలు సందర్భాలలో నిరూపించింది. 1986లో బిజోయ్ ఇమాన్యుయేల్ వర్సెస్ కేరళ రాష్ట్రం అనే కేసు మంచి ఉదాహరణ. కేరళలో క్రైస్తవ మత విశ్వాసం కలిగిన ఇద్దరు పిల్లలు జాతీయగీతం పాడేటప్పుడు గౌరవంగా నిలబడేవారు. అయితే జాతీయగీతాన్ని ఆలపించడం లేదని పాఠశాల వారిని బహిష్కరించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు గౌరవంగా నిలబడటమే సరిపోతుంది, పాడాలని బలవంతం చేయలేమని, పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు, మతస్వేచ్ఛనిచ్చే 25వ అధికరణ కూడా మద్దతునిచ్చింది. 1978లో నందిని సత్పతి వర్సెస్ పి.ఎల్.దానీ కేసులో, పోలీసుల విచారణలో కూడా మౌనంగా ఉండే హక్కును కోర్టు సమర్థించింది. వేర్వేరు సందర్భాలే అయినా, వీటన్నింటి వెనుక ఉన్న సూత్రం ఒక్కటే. మాట్లాడాలా వద్దా అనేది వ్యక్తి నిర్ణయం. శాసన అధికారం ద్వారా ఒక వ్యక్తి తనకు ఇష్టం లేని విషయాన్ని మాట్లాడాలని బలవంతం చేయడం కుదరదు. ఇదే సూత్రాన్ని ఇతర దేశాలు కూడా అనుసరించాయి. అమెరికాలో 1943లోనే వెస్ట్ వర్జీనియా వర్సెస్ బార్నెట్ కేసులో విద్యార్థులను జెండాకు వందనం చేయాలని బలవంతం చేయలేమని కోర్టు తీర్పు ఇచ్చింది. దేశమేదైనా పౌరుడి నోటిలో బలవంతంగా మాటలు కుక్కడం ప్రజాస్వామ్య విరుద్ధమే.
మరి జాతీయగీతాన్ని గౌరవించాలని కూడా రాజ్యాంగమే చెబుతున్నది కదా? అవును, చెప్పింది. 51ఎ అధికరణ ప్రకారం, జాతీయగీతానికి గౌరవం చూపడం ప్రతి పౌరుడి బాధ్యత. కానీ ఇక్కడ ఒక సూక్ష్మమైన తేడా ఉంది. గేయాన్ని పాడడం మాత్రమే గౌరవం కాదు. గేయంపై గౌరవంతో నిలబడటం, భంగపరచకుండా ఉండటం కూడా గౌరవించడమే. ఉదాహరణకు రాజకీయ సభలు జరుగుతున్న సందర్భంలో మసీదులో కల్మాను చదువుతున్నప్పుడు నాయకులు తమ ప్రసంగాన్ని ఆపి, తర్వాత కొనసాగిస్తారు. నిస్సందేహంగా ఇది గౌరవాన్ని ప్రకటించడమే. వారు కూడా కల్మాను చదివితేనే గౌరవం ప్రకటించినట్లు కాదు కదా? మౌనంగా నిలబడడం కూడా ఒక విధమైన గౌరవ వ్యక్తీకరణలో భాగమే. బాధ్యత, హక్కు ఈ రెండూ కలిసే ఉంటాయి.
ఇప్పుడు 2026లో వచ్చిన కొత్త చట్టాన్ని ఇదే కోణం నుంచి చూద్దాం. ఈ చట్టం వందేమాతరం ఆలాపనకు అడ్డుపడటాన్ని, పాడుతున్నవారిని భంగపరచటాన్ని నేరంగా పరిగణిస్తుంది. ఈ నేరానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంది. అంతేగానీ గేయాన్ని పాడుతున్నప్పుడు మౌనంగా నిలబడి గౌరవాన్ని ప్రకటిస్తున్నవారు నేరస్థులు అని ఈ చట్టం చెప్పడం లేదు. పైన చెప్పిన రాజ్యాంగ సూత్రం ప్రకారం చూస్తే, ఈ మౌనం రాజ్యాంగం కాపాడే వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమే.
అయితే, ఇది రాతలో ఎంత స్పష్టంగా ఉన్నా ఆచరణలో మాత్రం అంత సులభంగా కొనసాగదు. మూడేళ్ల జైలు శిక్ష అనే మాట వినగానే పాఠశాలలు, సంస్థలు భయపడతాయి. రిస్క్ వద్దని అందరినీ పాడమని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఇదే అసలు సమస్య. చట్టం సరిగ్గానే ఉన్నప్పటికీ, దాన్ని అమలు చేసే చేతుల్లో రాజ్యాంగ సూత్రంపై అవగాహన లేకపోతే, హక్కు ఆచరణలో కనుమరుగవుతుంది.
కాబట్టి వందేమాతరం వివాదంలో అసలు ప్రశ్న గేయం ఎన్ని చరణాలు పాడాలి అన్నది కాదు. మౌనాన్ని కూడా ఒక చెల్లుబాటు అయ్యే వ్యక్తీకరణగా గుర్తించగలమా? అన్నదే అసలు ప్రశ్న. ఈ గుర్తింపు ఉంటేనే గేయానికి గౌరవం, పౌరుని వ్యక్తిగత స్వేచ్ఛ రెండూ కలిసి నిలబడతాయి. ఒకటి లేకపోతే మరొకటి అసంపూర్ణమే. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. ఈ విధంగా మౌనంగా ఉండే హక్కు వందేమాతరం విషయంలో సరిగ్గా ఇలాగే వర్తిస్తుందని ఇంతవరకు ఏ కోర్టూ నేరుగా తేల్చలేదు. ఇది గతంలో జాతీయగీతంపై వచ్చిన తీర్పుల ఆధారంగా చేసిన హేతుబద్ధమైన అంచనా మాత్రమే.
అన్ని వర్గాల వారు ఇతరుల విశ్వాసాలను కూడా గౌరవిస్తూ చేయి చేయి కలిపి ముందుకు సాగినప్పుడే నిజమైన స్వేచ్ఛ అనుభవయోగ్యం అవుతుంది. కాబట్టి పాడుతున్న వారికి అభ్యంతరం చెప్పకుండా, పాడని వారిని బలవంతం చేయకుండా ఉండగలిగే సంస్కారమే ఈ దేశానికి నిజమైన రక్షణ కవచం.
- వేలం పళని