Share News

పర్యావరణ చట్టానికి తూట్లు

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:40 AM

చట్టాలలో ప్రజాప్రయోజన చట్టాలకు ఒక విశిష్ట స్థానం ఉంది. వాటికి ఒక సామాజిక కోణం ఉంటుంది. అలాగే ఆ చట్టాన్ని ఉదారంగా నిర్వచించాల్సి వస్తుంది. అయితే ఆ ఉదారత ఆ చట్టం ఎవరి కోసం అయితే నిర్దేశించిందో..

పర్యావరణ చట్టానికి తూట్లు

ట్టాలలో ప్రజాప్రయోజన చట్టాలకు ఒక విశిష్ట స్థానం ఉంది. వాటికి ఒక సామాజిక కోణం ఉంటుంది. అలాగే ఆ చట్టాన్ని ఉదారంగా నిర్వచించాల్సి వస్తుంది. అయితే ఆ ఉదారత ఆ చట్టం ఎవరి కోసం అయితే నిర్దేశించిందో వారికి అనుకూలంగా ఉండాలి కానీ, ఆ చట్టాన్నే నిర్వీర్యం చేసేటట్టు ఉండకూడదు. సుప్రీంకోర్టు జూలై 29న వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు ఒక ప్రజాప్రయోజనార్థ చట్టాన్ని ఆ చట్టం ఉద్దేశాలకు, మౌలిక స్వభావానికి భిన్నంగా నిర్వచించింది. ఆ చట్టం పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986.

పర్యావరణ పరిరక్షణ చట్టం కింద 1994లో పర్యావరణ ప్రభావ అంచనా ఉత్తర్వును విడుదల చేశారు. అందులోని షెడ్యూల్‌లో ‘ఏ ప్రాజెక్టు కొత్తగా మొదలుపెట్టాలన్నా, ఉన్న ప్రాజెక్టును విస్తరించాలన్నా పర్యావరణ అనుమతి లేకుండా చేయడం కుదరదు’ అని ఉంది. 2006లో తెచ్చిన కొత్త ఉత్తర్వులోనూ చాలా స్పష్టంగా– ఏ ప్రాజెక్టు మొదలుపెట్టాలన్నా ముందస్తు పర్యావరణ అనుమతి తప్పనిసరి అని ఉంది. అంటే 1994లో అంతర్లీనంగా ఉన్నది, 2006 నాటికి ప్రస్ఫుటంగా ఉంది. అయితే ఈ చట్టాన్ని ఉల్లంఘించేవారిలో బలమైన పెట్టుబడిదారులు ఉన్నారు. వారు ఎటువంటి పర్యావరణ అనుమతి లేకుండా తమ ప్రాజెక్టులను నిర్మించడమేగాక, కొందరైతే నిర్మాణం పూర్తిచేసి ఆ పరిశ్రమలను నడిపేస్తున్నారు కూడా.


అలా అనుమతి లేకుండా నిర్మాణాలు చేసిన వారికి ఊరటగా కేంద్ర పర్యావరణ శాఖ 1994 నుంచి సడలింపు ఇస్తూ వచ్చింది. ఆ సడలింపు ప్రకారం, ‘నిర్మాణం మొదలుపెట్టేశాక, లేదా పూర్తి చేసేశాక కూడా పర్యావరణ అనుమతి తీసుకోవచ్చు!’ దీనిని ‘ఎక్స్‌పోస్ట్ ఫ్యాక్టో’ అనుమతి అంటారు. అటువంటి సడలింపులు చట్ట విరుద్ధమనీ, అలా చేయడానికి ఏ మాత్రం కుదరదనీ 2004 నుంచి సుప్రీంకోర్టు పలుమార్లు చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. అయినా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన మంత్రిత్వశాఖ 2017లో అటువంటి సడలింపు ఉత్తర్వును పర్యావరణ పరిరక్షణ చట్టం కింద మరొక్కసారి ఇచ్చింది. 2017 మార్చి 14 నాటికి అనుమతి లేకుండా నిర్మిస్తున్న లేదా నిర్మించినవారు తదుపరి ఆరు నెలల్లో అనుమతి తెచ్చుకోవటానికి అవకాశం కల్పించారు. ఈ ఆరు నెలలు కాస్తా 13 నెలలు అయ్యింది. అనుమతి లేకుండా ఇలా నిర్మించిన పరిశ్రమల్లో పర్యావరణ విధ్వంసకరమైనవి ఉంటాయి, ఈ పాటికే అవి చాలా నష్టం చేసి ఉంటాయి అనే సందేహం ఈ ఉత్తర్వు ఇచ్చినవారికి కలిగినట్టు మనకు అనిపించదు. అంతేగాక ‘ఈ ఉత్తర్వును పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్నాం’ అని రాసుకొచ్చారు! ఇది కేవలం ఈ ఒక్కసారికి మాత్రమే అని కూడా చెప్పారు. ప్రతిసారి ఈ ఒక్కసారికే అని చెప్పటం ఈ పాటికి పరిపాటి అయ్యింది.


మళ్లీ 2021లో ఒక ఆఫీస్ మెమోరాండం ఇచ్చారు. దాని ప్రకారం... అనుమతి లేకుండా మొదలుపెట్టినవారు ఏ భయం లేకుండా ఇప్పుడు అనుమతులు తీసుకోవచ్చు అని. ఇది చట్టం కింద ఇచ్చిన ఉత్తర్వు కాదు. అలాగే 2017 నాటి ఉత్తర్వులో లాగా ఇది ఒకసారికి మాత్రమే అని కూడా లేదు. అంటే, ఒక రకంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియకే చమరగీతం పాడిన మెమోరాండం ఇది.

ఈ రెండిటినీ ముందుగా మద్రాస్ హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునళ్లలో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు, ట్రైబ్యునల్ దాటుకుని ఈ వన శక్తి కేసు సుప్రీంకోర్టు వరకూ వచ్చింది. మే 14, 2025న సుప్రీంకోర్టు ధర్మాసనం దీని గురించి ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది– ఇటువంటి ఉత్తర్వులు, మెమోరాండంలు ఇవ్వడమంటే పక్కదారిలో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని నీరుగార్చడమే అని, చట్టం ఉద్దేశం పరిరక్షణ అయితే విధ్వంసకర ప్రాజెక్టులకు పరిరక్షణ చట్టం కింద సడలింపు ఇవ్వడం ఎలా కుదురుతుందని తెలిపింది. అంతేగాక, సుప్రీంకోర్టు ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ‘ఇటువంటి సడలింపులు కుదరవు’ అని చెప్పిన విషయాన్ని ఉటంకిస్తూ పర్యావరణ, న్యాయ సిద్ధాంత మేళవింపుగా తీర్పు ఇచ్చింది. 2017 నాటి ఉత్తర్వుని, 2021 నాటి మెమోరాండంను కొట్టివేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఉత్తర్వులు లేదా మెమోరాండంలు ఇవ్వడానికి వీలులేదని కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది.


ఈ తీర్పు మీద రియల్ ఎస్టేట్ లాబీ సంస్థ క్రెడాయ్ సమీక్ష కోరింది. ఇక్కడ గమనించాల్సింది ఈ కేసులో ప్రధాన పార్టీ అయిన కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పును ఒప్పకుంది. వారు కోరని సమీక్ష క్రెడాయ్ కోరింది. సమీక్ష తీర్పును ముగ్గురు సభ్యుల ధర్మాసనం వెలువరించింది. ఇద్దరు న్యాయమూర్తులు ఈ కేసును మళ్లీ వినాలి అని తీర్మానించగా, ఒక న్యాయమూర్తి మాత్రం ఇచ్చిన తీర్పు సరైనదే అని నవంబర్ 18, 2025న తీర్పు చెప్పారు. దానితో ఈ కేసు మళ్లీ ముగ్గురు సభ్యుల ధర్మాసనం దగ్గరికి వెళ్లింది. ఈ ధర్మాసనం జూలై 29న తన మలి తీర్పు ప్రకటించింది.

ఈ మలి తీర్పులో మొదటి తీర్పులో చెప్పినట్టుగా ఎక్స్‌పోస్ట్ ఫ్యాక్టో అనుమతులకు చట్టంలో స్థానం లేదు అని స్పష్టం చేశారు. ఆఫీస్ మెమోరాండంను కూడా కొట్టివేశారు. అంతవరకే చేసి ఉంటే మొదటి తీర్పును ఎత్తిచూపుతూ, పర్యావరణ పరిరక్షణ చట్టం ఉద్దేశాలకూ, మౌలిక స్వభావానికి అనుగుణంగా ఉండేది. అయితే దానితో పాటు ముందస్తు అనుమతి నుంచి కొన్ని పరిస్థితులలో సడలింపు ఇవ్వవచ్చు అని రాసుకొచ్చారు. దానికి ఒక ప్రాతిపదిక కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నప్పుడు అలా కాకుండా మరో విధంగా చేయడానికి వీలులేదు అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పి నాలుగు దశాబ్దాలు అవుతుంది. అది పర్యావరణ అనుమతి అయినా మరొకటి అయినా.


అయితే పర్యావరణ అనుమతి విషయంలో అది మరింత ముఖ్యం. ఎందుకంటే ఒకసారి విధ్వంసం జరిగాక దానిని తిరిగి మునుపటి స్థితికి తీసుకురావటం అసంభవం కాబట్టి. అందులోనూ వాతావరణ మార్పు ప్రధానంగా ఉన్న ఈ కాలంలో ఆ జాగరూకత, జాగ్రత్త మరింత అవసరం. అయినా కూడా చట్టంలో లేని, అలా కుదరదు అని రాజ్యాంగ ధర్మాసనం చెప్పినా కూడా ‘ప్రజా ప్రయోజనం’ పేరు మీద ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేయడం అవాంఛనీయం. అంతే కాక, 1994 లేదా 2006 నాటి ఉత్తర్వు చట్టంలోని పర్యావరణ పరిరక్షణ సూత్రం కింద తీసుకువచ్చిన ఉత్తర్వు. ఇప్పుడు అదే సూత్రం కింద అదే ఉత్తర్వును నీరుగారుస్తూ... మరొక ఉత్తర్వు ఇవ్వడంలో అసంబద్ధత లేదు అని చెప్పడం ఏ మాత్రం ఆమోదయోగ్యం?

భారతదేశంలో పర్యావరణ చట్ట సిద్ధాంతాన్ని పార్లమెంట్ కన్నా కూడా సుప్రీంకోర్టే అభివృద్ధి చేసిందని చెప్పడం అతిశయోక్తి కాదు. 1990ల్లో ఇచ్చిన పలు తీర్పుల ద్వారా పర్యావరణ సిద్ధాంతానికి సంబంధించిన అనేక విషయాలను సుప్రీంకోర్టే క్రోడీకరించి, జీవించే హక్కులో భాగం చేసింది. ఒకప్పుడు గురుతర బాధ్యతను పోషించిన కోర్టే ఈ రోజు దానికి విరుద్ధంగా కాకపోయినా భిన్నంగా ప్రవర్తించడం బాధాకరం, ప్రమాదకరం కూడా.

- గుత్తా రోహిత్

మానవ హక్కుల వేదిక--–హెచ్‌ఆర్‌ఎఫ్‌

Updated Date - Aug 15 , 2026 | 01:42 AM