గ్రాఫిక్ నవల ప్రచురించటం ఖర్చే కానీ, పాఠకులపై నమ్మకంతో ప్రయోగం చేశాం
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:56 AM
తెలుగు పత్రికల్లో ఒకప్పుడు దేశవిదేశాల రచనలు బొమ్మలతో పాటు ఎపిసోడ్లలాగా ప్రచురితమయ్యేవి. ఈమధ్య అలాంటివి తెలుగు సాహిత్యంలో కనబడటం తక్కువైంది. చాన్నాళ్ళ తర్వాత ఇప్పుడు అనువాద రూపంలో...
తెలుగు పత్రికల్లో ఒకప్పుడు దేశవిదేశాల రచనలు బొమ్మలతో పాటు ఎపిసోడ్లలాగా ప్రచురితమయ్యేవి. ఈమధ్య అలాంటివి తెలుగు సాహిత్యంలో కనబడటం తక్కువైంది. చాన్నాళ్ళ తర్వాత ఇప్పుడు అనువాద రూపంలో ఒక గ్రాఫిక్ నవల తెలుగులో విడుదలైంది. ‘జల్లికట్టు’ ఆట నేపథ్యంలో నడిచే సి. ఎస్. చెల్లప్ప తమిళ నవల ‘వాడివాసల్’కు (1949) ఆ భాషలో మంచి పేరుంది. దీనిని గత ఏడాది పెరుమాళ్ మురుగన్ (రచన), అప్పుపెన్ (బొమ్మలు) కలిసి గ్రాఫిక్ నవలగా అడాప్ట్ చేశారు. ఇప్పుడు ఈ గ్రాఫిక్ నవలను పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగులోకి అనువదించి, తన ప్రచురణ సంస్థ ‘ఎలమి’ ద్వారా వెలువరించారు. ఈ నేపథ్యంలో ఆమెతో సంభాషణ.
ఈ గ్రాఫిక్ నవలను అనువాదానికి ఎంపిక చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు కలిగింది. ఈ పుస్తకం నేపథ్యమేంటి?
నాకు మామూలుగానే గ్రాఫిక్ నవలలపై ఆసక్తి ఎక్కువ. మనం చిన్నప్పుడు చదువుకున్న బొమ్మల పుస్తకాల కన్నా ఇవి భిన్నం. ఈ ప్రక్రియలో బొమ్మలు కథకు ఇల్లస్ట్రేషన్లుగా మాత్రమే కాక, స్వయంగా కథను చెప్పే బాధ్యతను కూడా తీసుకుంటాయి. ఒకవేళ బొమ్మలన్నీ తీసేసి కేవలం డైలాగులు మాత్రమే ఉంచితే, కథేంటో అర్థం కాకపోవచ్చు. సినిమా పరిభాషలో చెప్పాలంటే పాత్రల మనోభావాలు తెలిసేట్టుగా క్లోజప్స్, కథ జరుగుతున్న పరిసరాలను, వాతావరణాన్ని తెలిపేలా పనారిమిక్ వ్యూతో బొమ్మలు గీస్తారు.
సి.ఎస్. చెల్లప్ప గారి నవల ‘వాడివాసల్’ నాకు ఇష్టమైన నవలల్లో ఒకటి. భారతీయ నేపథ్యంలో, గ్రామీణ వాతావరణంలో, క్రీడలపై ఆధారపడి సాగే రచనలు నాకు ఎక్కువ కనిపించలేదు.
జల్లికట్టు ఆధారంగా వచ్చిన ఆ నవలను పెరుమాళ్ మురుగన్, అప్పుపెన్ కలిసి గ్రాఫిక్ నవలగా తీసుకొస్తున్నారని తెలిసినప్పుడు చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. నేను నడిపే ప్రచురణ సంస్థ ‘ఎలమి’కి దాన్ని తెలుగులోకి తీసుకొచ్చే అవకాశం దొరికింది. మామూలు అనువాదాలకన్నా గ్రాఫిక్ నవలల విషయంలో కాపీరైట్స్ పరంగా, ప్రింటింగ్ పరంగా ఖర్చు ఎక్కువ. అయినా తెలుగు పాఠకులపై నమ్మకంతో ఈ ప్రయోగానికి పూనుకున్నాం. ఈ తరహా పుస్తకాల ద్వారా తెలుగుపై పట్టులేక సాహిత్యానికి దూరంగా ఉంటున్న వారిలో ఆసక్తి కలిగించాలని ఆశ.
ఈ గ్రాఫిక్ నవలను అనువదించటంలో మీరు ప్రత్యేకంగా గమనించిన ఇబ్బందులు ఎలాంటివి?
మామూలుగా చేసే అనువాదాల్లో ముఖ్యంగా భాష పట్ల, ఆయా నేపథ్యాలను తెలుసుకోవడం పట్ల దృష్టి వహిస్తూ ఉంటాం. గ్రాఫిక్ నవల అనువాదంలో వాటితో పాటుగా ఫాంట్ కూడా కీలక పాత్ర వహిస్తుంది, ఎందుకంటే దీనికి వాడే ఫాంట్ చేతిరాతను పోలినట్టూ ఉండాలి, అదే సమయం తక్కువ చోటులో ఎక్కువ అక్షరాలు పట్టేలానూ ఉండాలి. నేను ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఉచిత తెలుగు యూనికోడ్ ఫాంట్లలో వైవిధ్యం పెద్దగా లేకపోవడం. బీవీ సత్యమూర్తి, ఎన్టీఆర్ లాంటి ఫాంట్ల డిజైన్ బాగున్నా ఈ నవలలో బొమ్మల పక్కన తేలిపోయాయి. అందుకని పొట్టిశ్రీరాములు ఫాంట్ వాడాం. అయితే అందులో కొన్ని అక్షరాల, ఒత్తుల ఆకారం చదివేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. (ఉదా: ప ఒత్తు ఋ వత్తులా కనిపించడం).
తమిళంలో వాళ్ళు వాడిన ఫాంట్ చేతిరాతను పోలి ఉండడంతో పాటు అక్షరాలు గుదిగుచ్చినట్టు చక్కగా ఒదిగిపోయాయి. అందుకని వాళ్ళు ఒక డబ్బాలో ఎక్కువ పదాలను పెట్టగలిగారు. తెలుగులోకి వచ్చేసరికి మన అక్షరాలు పైనా, కిందా, పక్కన కూడా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటాయి. అందుకని అదే సైజు డబ్బాలో తక్కువ తెలుగు పదాలు పట్టాయి. ఒక ఫాంట్‌ను అతి ముఖ్యమైన ప్రతిబంధకంగా పెట్టుకుని, అటు మూలానికి దగ్గరగా, ఇటు తెలుగు పాఠకులకు తేలిగ్గా అర్థమయ్యేలా అనువాదం చేయడం కత్తి మీద సాములా ఉండింది. ఇదే గ్రాఫిక్ నవలకు ఇంగ్లీషు అనువాదం మూలానికి చాలా దూరం జరిగినట్టు అనిపించ డంతో తమిళం వచ్చిన స్నేహితురాలు శ్యామల సహకారంతో కలిసి ఈ అనువాదాన్ని చేశాను. ఇది కూడా నాకు కొత్త అనుభవం. అలానే జల్లికట్టుకు ప్రత్యేకించి ఉన్న పదాలకు తెలుగులో పదాలు వెతుక్కోవడం కూడా కష్టమైంది.

ఈ పుస్తకంలో ఆకట్టుకున్నది మీరు గ్రామీణ నేపథ్యంలో వాడిన చిత్తూరు యాస. అలా ఎందుకు ప్రయోగించారు?
ఇంగ్లీషు అనువాదం మూలం నుంచి దూరం జరిగింది అన్నానే, దానికి ఒక ఉదాహరణ ఈ యాస. పెరుమాళ్ మురుగన్ తన అడాప్టేషన్‌లో కథ చెప్పేటప్పుడు (నరేటర్ వాయిస్) సాధారణ తమిళం వాడి, పాత్రలు వచ్చేసరికి (డైలాగ్స్) కథ జరుగుతున్న ప్రాంతపు యాసను వాడారు. ఇంగ్లీషులో ఈ తేడాను తీసుకురావడం అసాధ్యం, కానీ తెలుగులో దాన్ని ఎలా అయినా పట్టుకురావాలనుకున్నాను. చిత్తూరు జిల్లాలో అచ్చంగా జల్లికట్టే కాకపోయినా ఎద్దుల పోటీలు జరుగుతాయని తెలుసుకుని వాటి తాలూకూ వీడియోలు, రీల్స్, ఇంటర్వ్యూలూ అన్నీ చూశాను. అయినా కూడా నాకు బుల్–టేమర్ లాంటి పదాలకు తెలుగులో పదాలు దొరకలేదు. ఈ కథా కాలం 1940లలోది, గ్రామీణ ప్రాంతం. అందుకని చిత్తూరు యాస నుంచి ప్రేరణ పొంది దాన్నే పాత్రలకు వాడాను. బూదరాజు రాధాకృష్ణ గారి ‘తెలుగు మాండలికాలు: చిత్తూరు జిల్లా’ అన్న పుస్తకం ఆర్కైవ్.ఆర్గ్‌లో దొరికింది. అదొక ఖజానా!
ఇంటర్వ్యూ : లిఖిత్ కుమార్ గోదా
96400 33378
‘వాడివాసల్’ అనేది తమిళనాడులో రెండు వేల సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఎద్దుల క్రీడైన జల్లికట్టును ఆధారంగా చేసుకుని రాసిన నవల. 1950 లలో సి. సు. చెల్లప్ప రాశారు. ఈ చిన్న నవలను ఒక క్లాసిక్ రచనగా పరిగణిస్తారు. దాన్ని నేను, అప్పుపెన్ కలిసి తమిళంలో గ్రాఫిక్ నవలగా తీసుకువచ్చాం. ఇప్పటికే ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషల్లోకి అనువాదమైంది. ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. మనిషికీ ఎద్దుకీ మధ్య పోరాటం ఒక క్రీడగా రూపాంతరం చెందినప్పటికీ, మనిషి అహం, బలం దాన్ని ఎలా నిర్దేశిస్తాయి అన్నదాన్ని ఈ రచన చెప్పీచెప్పకుండా చూపిస్తుంది. మైదానానికి వెళ్ళి క్రీడను ప్రత్యక్షంగా చూసిన తన అనుభవం ఆధారంగా అప్పుపెన్ ఈ గ్రాఫిక్ నవలలోని బొమ్మలను గీశారు. ఇది తెలుగు పాఠకులను ఆకర్షించే రచన అవుతుందని మా అందరి నమ్మకం.
పెరుమాళ్ మురుగన్