Share News

అది యుద్ధం కాదట!

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:14 AM

ఇరాన్‌, అమెరికా మధ్య జరుగుతున్నది యుద్ధం కాదట. కనుక, అది ఎప్పుడు ముగుస్తుందో, ఎలా ముగుస్తుందో చెప్పలేమన్నది అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వ్యాఖ్య సారాంశం.

అది యుద్ధం కాదట!

రాన్‌, అమెరికా మధ్య జరుగుతున్నది యుద్ధం కాదట. కనుక, అది ఎప్పుడు ముగుస్తుందో, ఎలా ముగుస్తుందో చెప్పలేమన్నది అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వ్యాఖ్య సారాంశం. ఏడు నెలలుగా యుద్ధం సాగుతూ, నవంబరులో ఎన్నికలొస్తున్న తరుణంలో జనానికి ఏం చెప్పుకోవాలో తెలియక ట్రంప్‌ ప్రభుత్వం ఇలా కొత్త నిర్వచనాలు సృష్టిస్తున్నట్టుంది. ఓ నెలపాటు కాస్తోకూస్తో ప్రశాంతత కొనసాగిన తరువాత అమెరికా మళ్ళీ ఇటీవల ప్రళయభీకరంగా ఇరాన్‌ మీద విరుచుకుపడిన నేపథ్యంలో గురువారం జేడీ వాన్స్‌ ఈ వ్యాఖ్య చేశారు. ఇరాన్‌తో చర్చలు నిలిచిపోవడం, తిరిగి రాజుకున్న యుద్ధంతో అమెరికాలో డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడం ట్రంప్‌ రేటింగ్‌లను కుప్పకూలుస్తూ, మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తున్నాయి.


మూడు రోజులనాటి అమెరికా దాడులు వాన్స్‌ పరిభాషలో యుద్ధం కాకపోవచ్చు గానీ, కాస్తంత అదుపులో ఉన్న చమురు ధరలు ఈ దెబ్బతో తిరిగి భగ్గుమన్నాయి. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్‌లో ఒక పెళ్ళి బృందం మీద అమెరికా విమానాలు జరిపిన దాడిలో అరడజను మంది మరణించారు, ఎనభై మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రదిష్టపాలైన అమెరికా ఈ దాడిమీద దర్యాప్తు జరుపుతుందట. ఈ దారుణఘటన సహా అమెరికా రెండురోజులపాటు 60పైగా స్థావరాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగా గల్ఫ్‌లోని దాని మిత్రదేశాలపై ఇరాన్‌ కూడా విరుచుకుపడింది. శత్రువును ఎంతగా దెబ్బతీశామో ఉభయపక్షాలూ ఎంతో గొప్పగా లెక్కలు విప్పుకున్నాయి కానీ, పశ్చిమాసియా మళ్ళీ ఉద్రిక్తంగా తయారైంది. ‘హోర్ముజ్‌’ పూర్తిగా తన నియంత్రణలోనే ఉందనీ, దాని పేరు ‘ట్రంప్‌ జలసంధి’గా మార్చేయాలని అమెరికా అధ్యక్షుడు గొప్పకు పోతున్నారు. హోర్ముజ్‌లో సముద్రంలోని మందుపాతరలను తాకి చమురు ట్యాంకర్లు పేలిపోతున్న వార్తలు కూడా మరోపక్క వింటున్నాం. అమెరికా దాడులు కచ్చితంగా ఒక భయానకమైన, పూర్తిస్థాయి యుద్ధానికి మార్గం సుగమం చేస్తున్నాయి. హోర్ముజ్‌మీద పట్టు, చమురు ధరల నియంత్రణతో గ్లోబల్‌ మార్కెట్లలో విశ్వాసాన్ని నెలకొల్పడంతోపాటు, అమెరికా ఓటరు మనసు గెలుచుకోవాలని ట్రంప్‌ ఆశపడుతున్నారు. దీనికి బదులుగా హోర్ముజ్‌ చేజారలేదని నిరూపిస్తూ మిగతా ప్రపంచంలో అభద్రత, అనుమానాలు కొనసాగేట్టు చేయడం ఇరాన్‌ లక్ష్యం. ఇరాన్‌ తన అణ్వాయుధాలను వదిలేసి, యురేనియం శుద్ధిని నిలిపేసి, పశ్చిమాసియాలోని తన ప్రాక్సీలకు ఆయుధాలు అందించడం ఆపేసి, పూర్తిగా చేతులు ఎత్తేసేంతవరకూ యుద్ధం సాగుతూనే ఉంటుందని అమెరికా విదేశాంగమంత్రి చెబుతున్నారు. అణ్వాయుధాలూ లేవు, నిల్వలూ లేవు, మీకు ఓపికున్నంత కాలం చేతనైనది చేసుకోమని ఇరాన్‌ సవాల్‌ చేస్తోంది.


సముద్రంలో తొమ్మిది నెలలపాటు ఉండిపోయి, తుప్పుపట్టి, తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఐదువేలమంది సైనికులతో అమెరికా యుద్ధనౌక అబ్రహాం లింకన్‌ మొన్ననే థాయ్‌లాండ్‌ తీరం చేరింది. అమెరికన్‌ సైనికులు సేదతీరడానికి వస్తుండటంతో పటాయాలో వ్యభిచార నియంత్రణ చర్యలు చేపట్టినట్టుగా వార్తలు వెలువడ్డాయి. తాజాగా, పశ్చిమాసియాలో దళాల మోహరింపు వచ్చే ఏడాదివరకూ పొడిగిస్తూ అమెరికా రక్షణమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. యుద్ధం ఆరంభించిన అమెరికా అధ్యక్షుడికి దానిని ఇప్పట్లో ముగించే ఉద్దేశం లేదని అర్థమవుతూనే ఉంది. యాభైవేల మంది అమెరికన్‌ సైనికులు, పాతిక యుద్ధనౌకలు, డజన్లకొద్దీ యుద్ధవిమానాల మోహరింపుతో ట్రంప్‌ ఇప్పటివరకూ సాధించిందేమిటో తెలియదు. ఫిబ్రవరిలో ఆరంభమైన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ఫ్యూరీ’ ట్రంప్‌ పరిభాషలో చెప్పాలంటే, ఒక స్వల్పకాలిక సైనిక చర్యగా కాక, ఇరాన్‌ తీవ్రప్రతిఘటనతో యుద్ధంగా మారి ఏడు నెలలుగా సాగుతోంది. అమెరికన్లకూ, మిగతా ప్రపంచానికీ తీవ్రనష్టాన్ని చేకూర్చిన అమెరికా అధ్యక్షుడు వచ్చే ఏడాది కూడా యుద్ధాన్ని కొనసాగించే ఆలోచనతో ఉన్నారన్నది వాన్స్‌ వ్యాఖ్యల్లోని పరమార్థం.

Updated Date - Sep 05 , 2026 | 12:16 AM