అర్ధరాత్రి స్వతంత్రం..
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:30 AM
అసలు మనం అర్ధరాత్రి వేళ స్వేచ్ఛను ఎందుకు కోరుకున్నాం? అది మన నిర్ణయమేనా? మన ‘విధితో ముఖాముఖి’ (ట్రిస్ట్ విత్ డెస్టినీ)కి ఆ అర్ధరాత్రికీ ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి..
తప్పనిసరి రాజీ
అసలు మనం అర్ధరాత్రి వేళ స్వేచ్ఛను ఎందుకు కోరుకున్నాం? అది మన నిర్ణయమేనా? మన ‘విధితో ముఖాముఖి’ (ట్రిస్ట్ విత్ డెస్టినీ)కి ఆ అర్ధరాత్రికీ ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, నేను నా జ్ఞాపకాలను 1980ల నాటికి తీసుకెళ్ళాలి. నేను జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో పీహెచ్‌డీకి అర్హత సాధించి, సివిల్స్ రాయడానికి ఇంకా వయసు చాలని కాలం అది. నాకు కొంత ఖాళీ సమయం ఉండటంతో నా ప్రొఫెసర్ నన్ను ఓ పనిలో సాయం చేయమన్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన రచయితలు లారీ కొల్లిన్స్, డొమినిక్ లాపియర్ (ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్)లు చివరి వైస్రాయ్ లార్డ్ లూయిస్ మౌంట్‌బాటన్‌కు సంబంధించి సేకరించిన వ్యక్తిగత పత్రాలు, ప్రైవేట్ పత్రాలను ఎడిట్ చేయడంలో నన్ను సహాయపడమన్నారు నా గైడ్. నా ముందు పెద్ద ఎత్తున వచ్చిపడిన సమాచారం నుంచి కొత్త ప్రచురణల కోసం విషయాలను వెలికితీసే పని అది. ఆ తర్వాత అవి ‘మౌంట్‌బాటన్ అండ్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా’, ‘మౌంట్‌బాటన్ అండ్ ఇండిపెండెంట్ ఇండియా’ అనే రెండు విడివిడి సంపుటాలుగా వెలువడ్డాయి.
అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ పరిశోధన సమయంలో, ఆ పుస్తక రచయితలు లార్డ్ మౌంట్‌బాటన్‌ను చేసిన ఒక ఆసక్తికరమైన ఇంటర్వ్యూ నా కంటపడింది. రికార్డ్ చేసిన ఆ ఇంటర్వ్యూ ‘మౌంట్‌బాటన్ అండ్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా’ మొదటి భాగంలో ప్రచురితమైంది. మౌంట్‌బాటన్ తనదైన అహంకారం, నిర్లక్ష్య వైఖరితో ఈ ఇంటర్వ్యూలో పంచుకున్న ఈ ముఖ్యాంశాన్ని ఆయన మాటల్లోనే విందాం.
ప్రశ్న: ఆగస్టు 15న వేడుకలు నిర్వహించడానికి ముందస్తు ఉదాహరణలు ఏవీ లేవు. దాన్ని ఎవరు కనిపెట్టారు, ఎవరు ప్లాన్ చేశారు?
సమాధానం: నేను దీని గురించి నెహ్రూతో చర్చించాను. ఆగస్టు 15ను ఎంచుకోవడానికి కారణం, సరిగ్గా రెండేళ్ల క్రితం (సింగపూర్‌లో మిత్రదేశాల దళాల కమాండర్‌గా నా ముందు) జపాన్ లొంగిపోయిన తేదీ అది. కానీ... నేను జ్యోతిషులను సంప్రదించలేదు. భారతీయులకు జ్యోతిషంపై నమ్మకం ఎక్కువన్న విషయం నాకు తెలియదు. అశుభకరమైన రోజున వారు ఏ పనీ చేయరు. నెహ్రూకు జ్యోతిషంపై నమ్మకం లేకపోయినా, చాలామంది నమ్ముతారని, నేను ఎంచుకున్నది మంచి రోజు కాదని చెప్పారు. జ్యోతిషులను సంప్రదించకపోవడం పొరపాటే, కానీ నేను ఆ విషయాన్ని మరిచిపోయాను. అప్పుడు నెహ్రూ, ‘పరవా లేదు. మనం సమావేశం ఏర్పాటు చేసుకుని, అర్ధరాత్రి గడియారం కొట్టే ముందు అధికార మార్పిడి చేసుకుంటే, అది ఇంకా శుభప్రదంగా ఉంటుంది’ అన్నారు. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ అర్ధరాత్రి సమావేశం నిర్వహించడం ఎంత అద్భుతమైన, నాటకీయమైన ఆలోచన అని నేను అనుకున్నాను. ఇది ఏదో నాటకీయ సమయం కోసం చేసింది కాదు, నేను తప్పు రోజును ఎంచుకోవడం వల్ల జరిగింది! ఎందుకంటే అది శుభప్రదమైన రోజు కాదని జ్యోతిషులు చెప్పారు కాబట్టి!
వైస్రాయ్ అహంకారానికి, జ్యోతిష సర్దుబాటు లేదా ‘ఉపాయానికి’ మధ్య జరిగిన రాజీ ఫలితంగా అర్ధరాత్రి స్వాతంత్ర్యం మనపై శాశ్వతంగా రుద్దారు. స్వార్థపరుడైన వైస్రాయ్ ఏకపక్షంగా తేదీని నిర్ణయించగా, భారతీయ నాయకులు ఆ నిర్ణయానికి లొంగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నెహ్రూ ఈ విషయాన్ని ఇతర నాయకుల వద్ద ప్రస్తావించినప్పుడు, ముఖ్యంగా సర్దార్ పటేల్, జె.బి.కృపలానిల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారు ఆ అశుభకరమైన రోజును నివారించాలనుకున్నారు. చివరికి, ఈ చిక్కుముడిని విప్పడానికి జ్యోతిష ఉపాయంపై ఆధారపడవలసి వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం తిథులు సూర్యోదయంతో ప్రారంభమవుతాయి, కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం తేదీ అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. ఈ వ్యత్యాసమే అర్ధరాత్రి స్వాతంత్ర్య వేడుకకు కారణమైంది. రెండు వైపులా గెలుపుగా కనిపించిన ఈ పరిష్కారం, వాస్తవానికి ఒక అనివార్యమైన రాజీ.
- బి.పి. ఆచార్య
విశ్రాంత ఐఏఎస్ అధికారి
ఓ మంచి ముహూర్తం
భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత యావత్ భారతీయులు ఆనందంగా పండుగ జరుపుకుంటూ ఉండగా ఇద్దరు గొప్ప జ్యోతిషులు మాత్రం విచారంగా ఉన్నారు. వారే సోలన్‌కు చెందిన పండిట్ హరదేవ్ శర్మ త్రివేది, ఉజ్జయినికి చెందిన సూర్యనారాయణ వ్యాస్. ఈ ఇద్దరూ కలిసి కాబోయే మన మొదటి ప్రెసిడెంట్ బాబు రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్ళి, ఎవరూ ఊహించని ఒక నిజం చెప్పారు. ‘గ్రహాల ప్రకారం ఆగస్టు 15 అనే రోజు అసలు బాగాలేదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ముహూర్తం అసలు కుదరలేదు. ఒక దేశం ఇలాంటి టైమ్‌లో పుడితే, దాని భవిష్యత్తు ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది.’ ఇది విన్న రాజేంద్రప్రసాద్ షాక్ అయ్యారు. కానీ, లార్డ్ మౌంట్‌బాటన్ మాత్రం తేదీని మార్చడానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు వారు... తేదీ మార్చడం కుదరనప్పుడు కనీసం టైమ్ అయినా మార్చొచ్చు కదా అని ఆలోచించారు. ఒక్కసారి కాదు, మూడుసార్లు హరదేవ్ లెక్కలు వేసి చూశారు. ఆయనకు కచ్చితంగా చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండాలి. మన జ్యోతిషంలో దీనికి మించిన పవర్‌ఫుల్ నక్షత్రం లేదు. లగ్నం వృషభం అవ్వాలి. ఇది స్థిర లగ్నం. అంటే దేశం ఎన్ని వందల ఏళ్ళయినా చెక్కుచెదరకుండా నిలబడాలి. అందునా అది అభిజిత్ ముహూర్తం అవ్వాలి. ఆ రోజులోనే అత్యంత పవిత్రమైన సమయం అది. ఈ మూడు నిబంధనలు సరిగ్గా ఒకే ఒక్క సమయంలో కలిశాయి. అదే అర్ధరాత్రి 12 గంటల సమయం. ఆ అద్భుత క్షణంలో సరిగ్గా అర్ధరాత్రి కాన్‌స్ట్యుయెంట్ అసెంబ్లీలో నెహ్రూ లేచి నిలబడి ‘‘ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, అర్ధరాత్రి 12 గంటల సమయానికి, భారతదేశం సరికొత్త జీవనానికి, స్వేచ్ఛకు మేల్కొంటున్నది’’ అన్నారు. నిజానికి అది కేవలం పొలిటికల్ ఉపన్యాసం కాదు. పక్కాగా ప్లాన్ చేసిన ముహూర్తం!
మరోవైపు జిన్నా... పాకిస్థాన్‌కు కొన్ని గంటల ముందే గ్రహస్థితి అసలు సరిగాలేని మేష లగ్నంలో అక్కడ ప్రమాణ స్వీకారం చేయించారు. ఫలితం? ఏడాది తిరక్కుండానే ఆ దేశంలో అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయి, కొన్ని దశాబ్దాల్లోనే దేశం ముక్కలైపోయింది. కానీ ఇండియా ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలబడింది. మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. ఆ ముహూర్తం శక్తి అలాంటిది. ఇది ఎవరో కల్పించిన కథ కాదు. 1988లో లండన్‌కు చెందిన ప్రసిద్ధ పత్రిక ‘లండన్ టైమ్స్’లో సర్ ఉడ్రో వ్యాట్ ఈ విషయాన్ని తెలియజేశారు. అమెరికా ప్రెసిడెంట్ రీగన్... జ్యోతిషులను సంప్రదించడాన్ని సమర్థిస్తూ ‘‘ఇండియా లాంటి పెద్ద దేశమే ఒక ముహూర్తం చూసుకుని పుట్టింది, అందులో తప్పేముంది’’ అని మన దేశాన్ని గొప్ప ఉదాహరణగా చెప్పారు. ఆ తర్వాత సోలన్‌లో ‘విశ్వవిజయ్ పంచాంగ్’ అనే పంచాంగాన్ని హరదేవ్ ప్రారంభించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఇప్పటికీ దీనిని నమ్మకంగా అనుసరిస్తున్నాయి.
- డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య