Share News

చెడుకు పరాభవం

ABN , Publish Date - Mar 19 , 2026 | 07:00 AM

పేరులోనే పరాభవముందని తీరు కూడా అలాగే వుంటుందని ఆందోళన వద్దు! ఎన్ని పరాభవాలు వచ్చినా ఘోర అవమానాలు ఎదురైనా...

చెడుకు పరాభవం

చెడుకు పరాభవం

పేరులోనే పరాభవముందని

తీరు కూడా అలాగే వుంటుందని

ఆందోళన వద్దు!

ఎన్ని పరాభవాలు వచ్చినా

ఘోర అవమానాలు ఎదురైనా

రాజ పూజ్యాలు మనకు ఎక్కువే!

వ్యయాలు అధికమైనా

ఆదాయాలు తక్కువైనా

పరాభవంలో వచ్చేది ప్రాభవమే!

ఆరు రుతువుల కౌముది

ఆరు రుచులతో పచ్చడి

చిగురాశలకు పునాది వేస్తూ

నిరాశలను సమాధి చేస్తూ

పరాభవ నామ యుగాది వచ్చే!

ఈ పరాభవ నామ సంవత్సరం

యుద్ధానికి పరాభవం కావాలి

ఉన్మాదులకు పరాజయమవ్వాలి

అప్పుడే విశ్వశాంతికి మనశ్శాంతి

తెలుగువారికి నిజమైన విజయ క్రాంతి!

జి.సూర్యనారాయణ


పరాభవ కాదు, ప్రాభవ

వచ్చుచుండె పరాభవ వత్సరమ్ము,

సమరములు కోరు రాక్షస జాతి కొరకు,

తెచ్చుచుండెను ప్రాభవ దీప్తులెన్నొ

శాంతి దీపాలు వెలిగించు కాంతి కొరకు...

వచ్చుచుండె పరాభవ వత్సరమ్ము

సమతలో మత గరళ మాత్సర్యములకు,

తెచ్చుచుండె శుభంకర ధీర గుణము

భయము మింగిన సుకుమార భావుకులకు...

వచ్చుచుండె పరాభవ వత్సరమ్ము

కసవునైన పంటగ తిను కంటకులకు,

తెచ్చుచుండె జయంకర దేవ వరము

కరుణ రక్తిలో కొనసాగు ఘనుల కొరకు...

వలస పోయిన కోకిలల్ కలత తీర్చి

మధుర జీవనమగుచు రమ్మా ఉగాది,

కలికి పులికి పుట్టిన యుద్ధ కర్కశునకు

మది పరాభవమగుచు రమ్మా ఉగాది...

వచ్చుచుండె పరాభవ వత్సరమ్ము,

తెచ్చుచుండె జయీభవ తేనె ఫలము...

రావి రంగారావు


నిత్యనూతనం

పండుగ వచ్చెనంచు నిడ పాయస భక్ష్యము భోజనంబులన్

నిండుగ భక్తితో నిడితి నమ్మవె నీ పద సేవ జేసెదన్

అండగ నుండుమా వెతలు ఆర్తిగ తీర్చగరావె కోరితిన్

కొండన నున్న వెల్గులతొ కోర్కెలు తీర్చవె నందనందనా!

సంతస సంబురంబొసగు సాత్వికమున్ ఉగాది పండగన్

వింత పరాభవం తెలుగు వీరత విజ్ఞులకేల కల్గునే?

ఎంతటి వారలైన సరె ఎప్పటికప్పుడు నూత్న రీతులన్

చింతలుమాని సత్ఫలము సిద్ధము సేయగ నిత్యనూతనన్

వరకాల యాదగిరి


పరాభవా! సద్విభవా

ఉగాది కాలచక్రమా మహోన్న తాబ్ద రూపమా

ప్రగాఢ గూఢ నేత్రమా నిబద్ధ సూత్ర ధామమా

అగాధ సత్య రక్షితా మహత్వ తత్త్వ భాసితా

అగమ్య యాన జీవితార్హ హ్లాద ఖేద వల్లరీ.

జగానికంత మేలుసేయ స్వస్తి మంత్ర సారమై

నిగారమౌ యుగాదివై యనిత్య భ్రాంతి మాన్పగా

ప్రగర్జనన్ దురంత కోటి పారద్రోలి క్రోధమున్

దిగంతమున్ పరాభవంబు త్రెంచితెమ్ము శాంతమున్

ఎన్.వి.ఎన్.చారి


ఆశాదీపాల సందేశం

మనిషికి యవ్వనం ఎలాగో,

కాలచక్రానికి వసంతం అలానే;

నిస్సత్తువైన రోజులపై

కొత్త ఆశల అక్షరాలు రాసే ఋతువిది.

మానుల లేతచిగుళ్లలో పచ్చని నవ్వులు,

మనసుల లోతుల్లో నూతన స్వప్నాలు

ఆమని అడుగులతో ప్రకృతి

ఆశాదీపాలు వెలిగించే సందేశమిది.

పచ్చదనం కోసం తరువులు తపనపడినట్లు,

సుసంపన్న ఉదయాల కోసం మనుషులు

వసంతాల్ని, ఉగాదుల్ని

ఆత్మీయంగా ఆహ్వానించాలి.

సుఖ–దుఃఖాల సమతుల్య సారం

సంవత్సరాది తత్త్వాన్ని చెబుతోంది.

మానవ సమాజాన్ని సవాలు చేస్తున్న వికృత శక్తుల పరాభవం కోసం,

ధర్మం–మానవతా విలువలు పునరుద్ధరించేందుకు..

‘పరాభవ నామ సంవత్సర ఉగాది’

మనలో కొత్త చైతన్యాన్ని నింపాలి.

– మేకిరి దామోదర్


వేప పూల గాలి

వత్సరములు యెన్నొ వచ్చి పోవుచునుండు

తీపి, చేదు, వగరు తీసుకొచ్చి.

వచ్చుచుండె నదిగొ వరుసలో మరొకటి

అది ‘పరాభవ’ యని అలరునిలను!

కొత్త మాఁవిచిగురు, కోకిలమ్మల పాట

వేప పూల గాలి వేడుకలుగ

రాశిఫలము తెలిపి రాజిల్లగా జేయు

కోరువారికెల్ల కొత్త యేడు.

కొత్త చింతపండు, కోరిన మామిడి

చెరకు గడల తీపి, చేదు వేప

వాటమైన తేనె, వలపు మల్లెల వాన

కొత్త వత్సరాన చిత్తమలరు!!

మాఁవి తోరణములు, మధుర భాషణములు

కవనసీమలలరు కవుల ఠీవి

పండితులు వచించు పంచాంగ శ్రవణాలు

తెలుగువారి వేడ్క తీపి గనుము

శ్రీధర్ కొమ్మోజు


ఉగాది సిరులు

మొదలౌ పండుగలు తెలుగు

ఎదలందున సుందరముగ ఏటా వచ్చే

కందాయ ఫలము లందరి

కందించేదౌ ‘ఉగాది’ కతి మోదముగా!

కొమ్మల చివరల వేప్పువు

రెమ్మల చిగురుల పగడపు రీతులు సొగసై

కమ్మని వాసనతొ దరికి

రమ్మని పిలుచునటులుండు రయమున కాదా!

వేకువ వేళల వేటరి

కోకిల జంటలును మావి కొమ్మల కొనలం

దాకులు కొసరుచు ‘కో’ యను

చుం ‘కూ’ యుటలును వినపడుచుండును కాదా!

ద్వారముల మామిడాకుల

తోరణములు మధురములగు ధూపమ్ములతో

తీరుగ నిండిన ఇండ్లను

చేరును తానుగ ‘ఉగాది’ సిరులొసగుచుగా!

భట్టు వెంకటరావు

ఇవి కూడా చదవండి..

అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..

మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 19 , 2026 | 07:00 AM