Share News

సామాన్యుల సింహ దాహాలు!!

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:24 AM

మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) విభాగం ఇటీవల ఇస్కాన్‌ (కృష్ణ చైతన్య ఉద్యమ సంస్థ) నిర్వహించే ఈటరీ (మెస్‌లు, టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు మొదలైనవి)లపై దృష్టి పెట్టింది.

సామాన్యుల సింహ దాహాలు!!

హారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) విభాగం ఇటీవల ఇస్కాన్‌ (కృష్ణ చైతన్య ఉద్యమ సంస్థ) నిర్వహించే ఈటరీ (మెస్‌లు, టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు మొదలైనవి)లపై దృష్టి పెట్టింది. ఇస్కాన్‌ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు. అదొక అంతర్జాతీయ మత, ఆధ్యాత్మిక ఉద్యమం. లక్షలాది అనుయాయులు ఉన్న ఉద్యమమది. అయితే ఎఫ్‌డీఏ కమిషనర్‌ తుకారామ్‌ ముండే లక్ష్యం స్పష్టంగా ఉన్నది: ఆహార కల్తీని నిరోధించడం. ఆయన దృష్టిలో ఎవరూ చట్టం కంటే ఉన్నతులు కాదు. ఇస్కాన్‌ సైతం అందుకు మినహాయింపు కాదు. అందుకే ఆ సంస్థ నిర్వహించే ఈటరీలపై దాడులు. ఎఫ్‌డీఏ కమిషనర్‌గా తుకారామ్‌ ముండే బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లో వెలుగులోకి వచ్చిన ఆహార కల్తీ ఉదంతాలు, అంతకు ముందు 18 నెలల్లో బహిర్గతమైన అటువంటి మొత్తం ఉదంతాల కంటే చాలా చాలా అధికంగా ఉన్నాయి.

మరి ప్రజలు ముండేను ఒక సింహంలా భావిస్తుండడంలో ఆశ్చర్యమేముంది? ఒక సూపర్‌–కాప్ కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్‌ సినిమా ‘సింఘామ్‌’ ప్రేరణతో ముండేను ఒక నిజ జీవిత సింహం అని ప్రజలు పిలుస్తున్నారు. వినియోగదారుల ఆరోగ్యానికి హాని చేసే కల్తీ ఆహారపదార్థాల విక్రయాన్ని అరికట్టేందుకు ఆయన చేపట్టిన చర్యల పట్ల ప్రజల ప్రతిస్పందనలో ఒక నిజం వెల్లడయింది. నిబంధనలు సరిగా పాటించని వ్యాపార సంస్థలు లైసెన్స్‌లు కోల్పోతామేమోనని భయపడుతున్నాయి. చట్టం తమకు సహాయకారిగా ఉన్నదనే ఆశాభావం ప్రజల్లో నిండుగా ఉదయించింది. ప్రభుత్వం ఎప్పుడో అడగవలసిన ప్రశ్నను ఒక అధికారి ఎట్టకేలకు అడుగుతున్నాడని వారు భావిస్తున్నారు: అసలు మీరు మాకు ఎటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు?


అనునిత్యం ఫలహారాలు, భోజనాలు ఇంటిలో కాక బయట హోటళ్లలో చేసేందుకు మనం అలవాటు పడిపోయిన రోజులివి. మిఠాయిలు, మాంసాహార వంటకాలకు ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఇవ్వడానికి మనం బాగా అలవాటుపడిపోయాం. అవి భద్రమైనవని మనం విశ్వసిస్తున్నాం, నిరభ్యంతరకరంగా భుజిస్తున్నాం. అయితే ముండే నేతృత్వంలో ఎఫ్‌డీఏ సిబ్బంది నిర్వహిస్తున్న దాడుల్లో ఆహార భద్రతా నిబంధనలు ఎంతగా ఉల్లంఘనకు గురవుతున్నాయో దిగ్భ్రాంతికరంగా తేటతెల్లమవుతోంది. చట్టాలు లేకపోవడం వల్లనా ఈ పరిస్థితి? కాదు. చట్టాలు ఉన్నాయి. వాటిని అమలుపరచకపోవడమే అసలు సమస్య. మరి చట్టాలను అమలుపరుస్తున్న తుకారామ్‌ ముండే ప్రజలకు ప్రేమాస్పదుడు కావడంలో ఆశ్చర్యమేముంది?

ఆయన ఒక అసాధారణ వ్యక్తిగా కనిపిస్తున్నారు. నిబంధనలను సాధారణంగా వక్రీకరించే లేదా పూర్తిగా ఎంపిక చేసిన వాటిని మాత్రమే అమలుపరిచే, అసలు పూర్తిగా ఉపేక్షించే వ్యవస్థలో నిర్భయంగా చట్టాలను ఉపయోగించి సత్పరిపాలనను అందిస్తున్న అధికారి ఒక విప్లవశీలిగా కన్పించడం కద్దు. ముండే విషయంలో జరిగింది ఇదే. తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న అధికారిని ఒక సూపర్‌ హీరోగా ఎందుకు భావిస్తున్నారు? ముండేకు అత్యున్నతస్థాయి అధికారాలు లేవు. అయినా తన పరిమిత అధికారాల వినియోగంతోనే సింహంగా పేరు పొందారు. పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్నవారు వ్యవస్థలోని లోపాలను వాడుకుని తప్పించుకోవడాన్ని నిత్యం చూస్తున్న ప్రజలకు చట్టోల్లంఘనలను ఉపేక్షించని అధికారి ఒక హీరోలా కనిపించడం అసహజమేమీ కాదు. ప్రజా శ్రేయస్సుకై స్వార్థపర శక్తులను ఎదుర్కోవడం ముండేకు ఇదే కొత్త కాదు. తన ఉద్యోగ జీవితం ఆరంభం నుంచీ ఆయన ఈ ధర్మ మార్గంలోనే నడుస్తున్నారు. ఎప్పుడూ ఎక్కడా రాజీపడకపోవడం వల్లే 21 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో 25సార్లు బదిలీ అయ్యారు!


ఒక అధికారి తన బాధ్యతల నిర్వహణలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని ఉద్యోగ సోపానాలను అధిరోహించగలడు. అయితే ఉద్యోగ విధులు నిర్వర్తించడంలో అనివార్యంగా తీసుకోవల్సిన ప్రతి నిర్ణయం విషయంలోనూ దాని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని ముందుగా బాగా ఆలోచించవలసిన అగత్యమున్న వ్యవస్థలో నిజాయితీపరుడైన అధికారి మనుగడ సాగించగలగడం చాలా కష్టం. తాను తీసుకోబోయే నిర్ణయంతో ఎవరు ఆశాభంగం చెందుతారు? ఒక రాజకీయవేత్త ఆక్షేపణ తెలుపుతాడా? ధనబలం దండిగా ఉన్న వ్యాపారవేత్త ఎవరైనా అసంతృప్తితో ఫోన్‌ చేస్తాడా? ఏదైనా ఒక మత వర్గం వారు నిరసనకు దిగుతారా? పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నత స్థాయిలో తమకు ఉన్న సంబంధాలను ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటారా? అసలు నిర్ణయాన్ని పూర్తిగా అమలుపరచకముందే బదిలీ ఉత్తర్వు వస్తుందేమో?! ఇటువంటి ప్రశ్నలు, సందేహాలతో సతమతమవ్వక తప్పని పరిస్థితులలో ఏ అధికారి అయినా దీక్షాదక్షతలతో ఎలా వ్యవహరించగలడు?

ప్రభుత్వ వ్యవస్థలు తమ స్వతంత్రతను క్రమంగా కోల్పోతున్నాయి. ఎందుకని? ప్రతి ప్రభుత్వాధికారీ అవినీతిపరుడు అయినందువల్లకాదు. అలా భావించడం ఒక మూస పద్ధతిలో ఆలోచించడమే అవుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవారిని శిక్షిస్తూ, చెప్పినట్లు చేసేవారిని అందలాలు ఎక్కిస్తున్న ఒక వ్యవస్థ సంబంధిత వ్యక్తులందరికీ ఒక శక్తిమంతమైన సందేశాన్ని పంపుతున్నది. ‘స్వతంత్రంగా వ్యవహరించి అపాయాన్ని కొనితెచ్చుకోవద్దు’ అని ఒక తీవ్ర హెచ్చరిక చేస్తున్నది. ప్రభుత్వ వ్యవస్థలో తరచూ అతి సులువుగా చేయగలిగే పని... అసలు ఏమీ చేయకపోవడమే. కష్టమైన పని ఏమిటంటే... చేయవలసిన పని చేయడమే!


చేయవలసిన పని చేస్తున్నాడు కాబట్టే తుకారామ్‌ ముండేను ప్రజలు మౌనంగా మెచ్చుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా ఒక పెద్ద రాజకీయ ఉద్యమానికి వారు ఉపక్రమించలేదు. ఇది గమనార్హం. తుకారామ్‌కు మరొక ఉన్నత బాధ్యతను అప్పగించాలని ఎవరూ డిమాండ్‌ చేయడం లేదు. అయితే ముండే నిర్వహిస్తున్న ప్రతి తనిఖీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రచారంలోకి వచ్చినప్పుడు, పేరు ప్రతిష్ఠలు ఉన్న ఒక సంస్థను ఆయన ప్రశ్నించినప్పుడు ప్రజలు ప్రతిస్పందిస్తున్నారు. వారిలో నిబిడీకృతంగా ఉన్న ధర్మాగ్రహం పురిగొల్పిన ప్రతిస్పందన అది, సందేహం లేదు.

అవును, ఎట్టకేలకు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తున్నారు. భారతీయులు నియమ నిబంధనలను స్వతహాగా ఇష్టపడరని కాదు. వాటి అమలులో పక్షపాతాన్ని వారు కచ్చితంగా ఇష్టపడరు. ఈ సంస్థ ఎవరిది? ఎవరికి ఎవరు తెలుసు? ఆ సంస్థకు ఎంత పలుకుబడి ఉంది? దానిపై చర్య తీసుకుంటే ఏ రాజకీయపక్షం లేదా మత సమూహం అది తమకు వ్యతిరేకంగా తీసుకున్నదేనని నొచ్చుకుంటుంది? అన్న ప్రశ్నలే తలెత్తకూడదు. చట్టం అర్థవంతంగా ఉండాలంటే దానిని నిష్పాక్షికంగా అమలుపరచాలి. అందరికీ సమానంగా వర్తింపజేయాలి.


ఇదే తుకారామ్ ముండే సంచలనశీలత నిజమైన పాఠం. ఆయన తన బాధ్యతల నిర్వహణలో ఒక సింహంలా వ్యవహరిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ‘నిజ జీవిత సింహం’ అని ఆయనను పిలుస్తున్నారు. అయితే ఈ ప్రశంసే ఆయన కథలో ఆశ్చర్యకరమైన విషయం కాదు. అసలు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే– అలాంటి వ్యక్తులే అన్ని అధికార స్థానాలలో ఉండాలని ప్రజలు ఎంతగానో పరితపిస్తుండడమే. ఆహార భద్రత అనేది తుకారామ్‌ ముండే ఎఫ్‌డీఏ ప్రధానాధికారిగా ఉండడంపై ఆధారపడి ఉండకూడదు. రెస్టారెంట్లు శుచి, శుభ్రత ఉన్న ఆహారాన్ని అందించడమనేది ఒక నిర్దిష్ట అధికారి దాడులు, తనిఖీలు చేస్తున్నాడనే విషయంపై ఆధారపడి ఉండకూడదు. కఠిన వైఖరితో వ్యవహరించే అధికారి ఉన్నప్పుడు మాత్రమే ఆహార కల్తీదారులు భయపడడం జరగకూడదు. ఆ అధికారి బదిలీ అయిన తరువాత కూడా వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఇదే ఒక హీరోకు, ఒక వ్యవస్థకు మధ్య వ్యత్యాసం. హీరో ఒక నిర్దిష్ట సమయం లేదా సందర్భంలో మాత్రమే పరిస్థితులను మార్చగలడు. వ్యవస్థ అనేది నిరంతరం నడుస్తుంది. సదా ప్రజాహితంగా నడుస్తుండాలి. అటువంటి వ్యవస్థ ప్రజల దైనిక జీవితాన్ని మెరుగ్గా మార్చివేయగలదు. మన వ్యవస్థలు లేదా సంస్థలు సదా సక్రమంగా పనిచేస్తూ ప్రజల విశ్వసనీయతను పొందగలిగే దాకా ముండే లాంటి వ్యక్తులు అమితంగా ప్రాధాన్యం పొందడమనేది కొనసాగుతూనే ఉంటుంది.


తుకారామ్‌ ముండే తానేదో మానవాతీత కార్యాన్ని నిర్వహిస్తున్నట్టు ఏ కోశానా భావించరు. తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నట్టు మాత్రమే చెబుతారు. మరి ప్రతి ప్రభుత్వోద్యోగి కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, పక్షపాతానికి తావివ్వకుండా, తన పై అధికారులకు భయపడకుండా తన విధులను తాను నిర్వహిస్తే మన ప్రభుత్వ వ్యవస్థల్లోను, సమాజంలోను పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించండి. మన దేశంలో చట్టాలు, విధానాలు, పథకాలు, కమిటీలకు కొరత లేదు. అయితే వాటిని సరిగ్గా అమలుపరచకపోవడమే దేశం అనునిత్యం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య. ప్రభుత్వ సిబ్బంది తమ విధులను నిజాయితీగా స్వచ్ఛందంగా స్వతంత్రంగా నిర్వహిస్తే ఎలా ఉంటుందో కదా. భారతదేశ పాలనా సంక్షోభం గణనీయంగా తగ్గుతుంది, సందేహం లేదు. ఇదే జరిగితే తుకారామ్‌ ముండే లాంటి నిజ జీవిత సింహాలను అన్వేషించవలసిన అవసరం మనకు ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ విధ్యుక్త ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తే అసాధారణ వ్యవహారశైలికి ఆస్కారముండదు. అంతా సాధారణంగానే ఉంటుంది. పరిస్థితులు సజావుగా ఉంటాయి. అందరికీ సమన్యాయం సమకూరుతుంది.

తాజా కలం: తుకారామ్‌ ముండే గురించి మీ అభిప్రాయం ఏమిటి? అని ఒక మహారాష్ట్ర మంత్రివర్యుడిని ప్రశ్నించాను. ‘అతడొక పిచ్చివాడు’ అని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. నిజానికి తమ రాజకీయ యజమానులకు భయపడకుండా ప్రజల శ్రేయస్సు కోసం నిబద్ధతతో పనిచేసే ముండే లాంటి ‘ఉన్మాద’ అధికారులు ఇప్పుడు మన దేశానికి చాలా చాలా అవసరం కదూ?!

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

Updated Date - Sep 18 , 2026 | 01:30 AM