Share News

గోరీలదిబ్బపై కొత్తగాజా!

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:27 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, పశ్చిమాసియా సలహాదారుగా ఉన్న అల్లుడు జరాడ్‌ కుష్నర్‌ ఆరంభించిన ఆ భారీ రియలెస్టేట్‌ ప్రాజెక్టులో పాలుపంచుకోవాలా వద్దా అని కొన్ని దేశాలు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయి.

గోరీలదిబ్బపై కొత్తగాజా!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, పశ్చిమాసియా సలహాదారుగా ఉన్న అల్లుడు జరాడ్‌ కుష్నర్‌ ఆరంభించిన ఆ భారీ రియలెస్టేట్‌ ప్రాజెక్టులో పాలుపంచుకోవాలా వద్దా అని కొన్ని దేశాలు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయి. మామ కలల ప్రాజెక్టును ఎంతవేగంగా సాకారం చేయబోతున్నానో వ్యాపారవేత్త అయిన ఈ అల్లుడుగారు గురువారం ఇచ్చిన ప్రదర్శన చూసినవారికి కళ్ళు చెదిరిపోయాయి. శవాలదిబ్బమీద కట్టబోతున్న ఆ ఆకాశహార్మ్యాలను, బాంబర్లు భస్మీపటలం చేసిన ఇళ్ళూ ఆస్పత్రుల స్థానంలో పుట్టుకొచ్చే బడా ఇండస్ట్రియల్‌ కాంప్లెక్సులను ఆయన చిత్రాలు కళ్ళకుకడుతున్నాయి. గాజాను సమూలంగా పెకిలించివేసి, మనిషన్నవాడిని లేకుండా చేసి దానిని ఓ అంతర్జాతీయస్థాయి రిసార్టుగా మార్చేయాలన్న మామ అలనాటి ఆకాంక్ష నెరవేర్చడానికి కుష్నర్‌ యుద్ధసన్నద్ధతతో ఉన్నాడు. అది తమ సొంత ఆస్తిలాగా, ఏదో వారసత్వంగా వచ్చిన ఓ పాతకొంప కూల్చుకొని స్వస్థలంలో కొత్త భవనం కట్టుకుంటున్నట్టుగా వీరిద్దరూ ఆవిష్కరించిన ఆ ప్రాజెక్టుకు అస్మదీయులంతా జేజేలు పలుకుతున్నారు. ఊపిరితీసినవారే ఉద్ధారకులుగా అవతరించి, తాము వల్లకాడుగా మార్చిన దానిని భూతలస్వర్గంగా తీర్చి్దిద్దుతామంటూ శాంతిని పైపూతగా వాడుతున్నారు.


బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌ తొలి సమావేశంలో కుష్నర్‌ ప్రదర్శించిన ఈ రోడ్‌మ్యాప్‌ ట్రంప్‌ మనసు దోచుకుంది. ఏవో రెండు వాక్యాలు మర్యాదగా అనబోయాడు కానీ, ఆ చిత్రాలు చూడగానే ఆయనలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బయటకు వచ్చేశాడు. అద్భుతం, మహాద్భుతం, బ్యూటిఫుల్‌ పీస్‌ ఆఫ్‌ ప్రాపర్టీ..పక్కనే ఆ సముద్రం ఓహ్‌.. ఎంత అందంగా ఉందో అంటూ పరవశుడైపోయాడు. ఇప్పుడంటే ఆప్తమిత్రుడు కాకపోవచ్చును కానీ, ట్రంప్‌ మనసెరిగిన ఎలాన్‌మస్క్‌ అందుకే డావోస్‌లోనే ట్రంప్‌ ప్రవచిస్తున్నది శాంతిలో ‘పీస్‌’ కాదని, ప్రాపర్టీలో ‘పీస్‌’ అని వెంటనే జోకేశాడు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా, గాజావాసులను ఊచకోతకోయడమే కాక, దాని చారిత్రక, సాంస్కృతిక మూలాలు కూడా చెరిపివేసి, ఆ మానవ నివాసాన్ని ఒక పారిశ్రామికవాడలాగా, పర్యాటకస్థలంలాగా మార్చివేస్తున్న ఈ అమానుషకార్యానికి ప్రపంచదేశాలు తలూపడం సరైనదేనా అంటూ కొందరు ఛాందసులు ఇంకా ఏదో మిగిలివున్నట్టుగా తెగ బాధపడిపోతున్నారు. తమ సొంతభూమిలో చవుకకార్మికులుగా మారబోతున్న పాలస్తీనియన్లు ఈ ఆకాశహార్మ్యాల్లో ఉండబోరనీ, గోడలకు ఆవల, గేట్ల వెనుక బతుకీడుస్తారన్నది నిజం. పునర్నిర్మాణంకోసం రాళ్ళెత్తిన ఈ కూలీలూ రాబోయే తరాలూ దురాక్రమణదారులకు సేవకులుగా తరించడం వినా చేయగలిగేదేమీలేదు. తమది కాకుండా పోయినచోట ఆ స్వస్థలంలో నిరంతర నిఘాలో వెలివాడకు పరిమితం కావాల్సిందే.

ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణ, భాగస్వామ్యం ఇత్యాది చాదస్తపు ఆలోచనలు పొరపాటున కూడా ఎవరి మనసులోకీ రాకుండా ఉండేందుకు ట్రంప్‌ ఆ అంతర్జాతీయ వేదిక చచ్చుదీ, పుచ్చుదీ, చేతకానిదీ అని ఢంకా బజాయించారు. సదరు సంస్థ ఏదో చేయాలని అనుకుంటూ, ఏమీ చేయకుండా ప్రపంచానికి ఓ భారంగా పరిణమించిందనీ, దాని బదులు ఎనిమిది యుద్ధాలు ఆపిన తన మార్గదర్శకత్వంలో నడవడం యావత్‌ ప్రపంచానికి క్షేమకరమని ఆయన ఉపన్యాసం సారాంశం. రెండో ప్రపంచయుద్ధం తరువాత మానవజాతికి కాస్తంత జ్ఞానం కలిగి ఏర్పాటు చేసుకున్న ఈ సమష్టివేదికమీద తనకున్న ఆగ్రహాన్ని, ఏవగింపునూ ఈ ప్రసంగంలో పూర్తిగా దట్టించారాయన. సమితికి చిల్లిగవ్వ ఇవ్వకుండా, ముప్పైఒక్క విభాగాలనుంచి తనదేశాన్ని ఉపసంహరించుకున్న ట్రంప్‌, దానిని పూర్తిగా తుడిచిపెట్టేసి, ఆ స్థానంలో కూర్చోవాలనుకుంటున్నారు. ఆయనకు అంతర్జాతీయ చట్టాలంటే చిన్నచూపు. ఏడాదిలో ఏడుదేశాలమీద బాంబులు వేసి కూడా తనకు నోబెల్‌శాంతి ఎందుకు ఇవ్వలేదని నార్వేను బెదిరించగలడు. అది ఇవ్వనందుకు శాంతి అంటేనే విరక్తి కలిగిందనీ, గ్రీన్‌ల్యాండ్‌ను లాక్కుంటానని నాటోను వొణికించగలడు. చివరకు తూచ్‌ అనేసి, భయపడ్డారు కదూ...బలే బలే అంటూ ఆప్తమిత్రులనే అవమానించగలడు. ప్రపంచపెద్దగా, సమస్యల పరిష్కర్తగా, తీర్పరిగా ఉండాలనుకుంటున్న తన పక్షాన ఎవరెవరున్నారో ఈ గాజా తొలి అడుగులో ఆయన పరీక్షిస్తున్నాడు. పీస్‌ బోర్డు సభ్యులుగా ఉన్నవారిలో అత్యధికులు ఆయన బంధుజనం, పెట్టుబడిదారులు, పార్టీ విరాళాల దాతలు, వందిమాగధులే. విలువలతో మనకు పనేమిటని అనుకున్నవారు బిలియన్‌ డాలర్ల ఖరీదైన సభ్యత్వం కొనుక్కొని ఆయన ఔదార్యానికి పాత్రులు కావచ్చు.

Updated Date - Jan 24 , 2026 | 05:30 AM