Share News

The Return of Imperialism: జాతుల సార్వభౌమత్వంపై సామ్రాజ్యవాద పంజా

ABN , Publish Date - Jan 10 , 2026 | 03:58 AM

యూరోపియన్‌ దేశాలు ఉభయ అమెరికా ఖండాలలోని స్వతంత్ర దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని, ఉభయ అమెరికాల్లో కొత్త వలసలకు పూనుకోకూడదని....

The Return of Imperialism: జాతుల సార్వభౌమత్వంపై సామ్రాజ్యవాద పంజా

యూరోపియన్‌ దేశాలు ఉభయ అమెరికా ఖండాలలోని స్వతంత్ర దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని, ఉభయ అమెరికాల్లో కొత్త వలసలకు పూనుకోకూడదని, ఇందుకు ప్రతిగా యూరోపియన్ వలసలలో గానీ, యూరోపియన్‌ రాజ్యాల అంతర్గత వ్యవహారాలలో గానీ తాము జోక్యం చేసుకోబోమని అమెరికా అయిదవ అధ్యక్షుడు జేమ్స్‌ మన్రో 1823లో ప్రతిపాదించారు. రెండు శతాబ్దాల అనంతరం అమెరికా 47వ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జనవరి 2 అర్ధరాత్రి ఆ సుప్రసిద్ధ మన్రో సిద్ధాంతంలోని ప్రతి మౌలిక అంశాన్ని ఉల్లంఘించారు. దక్షిణ అమెరికా ఖండంలోని ఒక సార్వభౌమిక రాజ్యాన్ని దురాక్రమించేందుకు అమెరికా అపార సైనిక శక్తిని ఆయన ఉపయోగించారు. దురాక్రమించిన దేశ అధ్యక్షుడిని బంధించి, న్యూయార్క్‌కు తీసుకువచ్చి నేర విచారణా న్యాయస్థానంలో నిలబెట్టారు. ట్రంప్‌ తెగువకు ప్రపంచదేశాలు నివ్వెరబోయాయి.

ట్రంప్‌ అమలుపరిచిన కొత్త మన్రో సిద్ధాంతం బుష్‌–ట్రంప్‌ సిద్ధాంతంగా పిలిచేందుకు అర్హమైనది. వెనెజువెలా ఉదంతానికి సమాంతర ఘటనగా 1989లో పనామాలో అమెరికా జోక్యాన్ని చెప్పవచ్చు. అమెరికా నాటి అధ్యక్షుడు సీనియర్‌ జార్జి బుష్‌ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం పనామాపై దండయాత్ర చేసి, పనామా సైన్యాలను ఓడించింది. పనామా అధ్యక్షుడు నోరియేగా తమ రాజధానిలోని వాటికన్‌ రాయబార కార్యాలయాన్ని శరణుజొచ్చారు. అయితే అంతిమంగా అమెరికా సైన్యానికి లొంగిపోక తప్పలేదు. అమెరికా దురాక్రమణ లక్ష్యం పనామాలో తమకు సానుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని నెలకొల్పడమే. ఆ లక్ష్యం నెరవేరింది.

ట్రంప్‌ ప్రకటనలను నిశితంగా పరిశీలిస్తే వెనెజువెలాలోని అపార చమురు సంపదపై నియంత్రణ సాధించే లక్ష్య పరిపూర్తికి మదురో బాధితుడు అయ్యాడన్నది స్పష్టమవుతున్నది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా చమురు నిల్వలు వెనెజువెలాలో ఉన్నాయి. తన చమురును ప్రధానంగా చైనాకు ఎగుమతి చేస్తూ ఆ దేశం నుంచి ఆయుధాలు, విదేశీ పెట్టుబడులను వెనెజువెలా దిగుమతి చేసుకొంటున్నది. మరే ఇతర దేశమూ, మరీ ముఖ్యంగా రష్యా, చైనాలు వెనెజువెలా చమురు సంపదను స్వాయత్తం చేసుకోకుండా అడ్డుకునేందుకు అమెరికా కృతనిశ్చయంతో ఉన్నది. ఆ చమురు నిక్షేపాలు పూర్తిగా తన నియంత్రణలో ఉండాలని అమెరికా పట్టుదలతో ఉంది. మదురోను పట్టుకున్న అనంతరం ట్రంప్‌ విలేఖర్లతో మాట్లాడుతూ, వెనెజువెలాలో చమురును ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు అమెరికా కార్పొరేట్‌ కంపెనీలకు అనుమతినిచ్చినట్టు వెల్లడించారు.


నికోలస్‌ మదురోను పట్టుకునేందుకు ఉద్దేశించిన నాలుగు గంటల ‘ఆపరేషన్‌ అబ్సల్యూట్‌ రిజాల్వ్‌’ అమెరికా సైనిక దళాల అపూర్వ శక్తి సామర్థ్యాలకు నిలువెత్తు నిదర్శనం. అధునాతన సాంకేతికతల తోడ్పాటుతో పటిష్ఠ ప్రణాళికతో అంతే దక్షతతో దానిని అమలుపరచడం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. అర్ధరాత్రిపూట మరొక దేశంలోకి ప్రవేశించి, దేశాధ్యక్షుడిని బంధించి తీసుకురావడమనేది అమెరికా సేనలకు మాత్రమే సాధ్యమయ్యే పని. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఏ దేశానికీ లేని మహాశక్తిమంతమైన యుద్ధ యంత్రాంగం అమెరికాకే సొంతం. ఈ సైనికశక్తిని ఉపయోగించుకుని చైనా మినహా, మిగతా ప్రపంచమంతటిపై పెత్తనం చెలాయించడానికి అమెరికా ఆరాటపడడం ఆందోళన కలిగిస్తున్న విషయమే.

‘ఆపరేషన్‌ అబ్సల్యూట్‌ రిజాల్వ్‌’కు పూర్వమూ, పిమ్మట భారత్‌ అనుసరించిన వైఖరి ఏమిటనేది ఎవరికీ పట్టలేదు! ట్రంప్‌ ఇప్పటికే ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలోనూ, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్న విషయంలోనూ ప్రధాని మోదీని చిన్నబుచ్చే విధంగా పలుమార్లు మాట్లాడారు. ట్రంప్‌ వైఖరికి భయపడుతున్న కారణంగానే, వెనెజువెలా విషయమై మోదీ సర్కార్‌ విడుదల చేసిన ప్రకటనలో మదురో అరెస్ట్‌ను ఖండించనే లేదు. అసలు ఆ వ్యవహారంలో అమెరికా ప్రమేయాన్ని గురించి కూడా ప్రస్తావించనే లేదు. ‘వెనెజువెలాలో ‘ఇటీవలి పరిణామాల గురించి’ ప్రస్తావిస్తూ ‘అన్ని సమస్యలనూ సంబంధిత వ్యక్తులు చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని’ ఆ ప్రకటన సూచించింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో స్కోర్‌ విషయమై నెలకొన్న వివాదంపై పెద్దమనిషి తరహా సలహా ఇస్తున్నట్టుగా ఆ ప్రకటన ఉన్నది! చెప్పవచ్చినదేమిటంటే, విశ్వగురు అనే ఘనతలకు పోతున్న భారత్‌ ప్రపంచ వ్యవహారాలలో తన ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ‘ఇండియా ఏమి చెప్పినా అది ఎటువంటి ప్రభావాన్నీ చూపదు’ అని భారత మాజీ రాయబారి ఒకరు నిష్కర్షగా వ్యాఖ్యానించడం గమనార్హం.


ట్రంప్‌ అమెరికా వలే, పుతిన్‌ రష్యా, కమ్యూనిస్టు చైనా సైతం ఇతర దేశాలను దురాక్రమించేందుకు సాహసించవచ్చు. అందుకు ఆ రెండు అగ్రరాజ్యాలను ‘అబ్సల్యూట్‌ రిజాల్వ్‌’ ప్రోద్బలిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్‌ను స్వాయత్తం చేసుకుంటామని ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు సూచనప్రాయంగా చెప్పారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఒక కొలిక్కి రావడం అంటూ జరిగితే ఉక్రెయిన్‌ తప్పనిసరిగా తన భూభాగాలను రష్యాకు వదులుకోవల్సి ఉంటుంది. చైనా తన ‘ఒకే చైనా’ విధానాన్ని దాని తార్కిక పర్యవసానానికి తీసుకువెళ్లే అవకాశం ఎంతైనా ఉన్నది.

చైనా కనుక మరోసారి మన ఉత్తర సరిహద్దుల్లోకి లేదా అరుణాచల్‌ప్రదేశ్‌లోకి చొరబడిన పక్షంలో మనలను ఆదుకునేందుకు ఏ దేశమూ ముందుకురాదు. భారత్‌ తనను తానే రక్షించుకోవల్సి ఉంటుంది. వెనెజువెలా చమురు నిక్షేపాలపై నియంత్రణ సాధించిన అమెరికా, ఇప్పుడు భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపదు. వాణిజ్య ఒప్పందం లేకుండానే సుంకాలను పెంచుతూ, తగ్గిస్తూ అమెరికాకు భారత్‌ ఎగుమతులను ట్రంప్‌ ఏదో ఒక రీతిలో అనుమతిస్తాడు. ఏడాది క్రితం రెండవసారి అధికారంలోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా చరిత్రలోనే అత్యంత జోక్యందారీ అధ్యక్షుడు. ఆయన జోక్యం చేసుకున్న దేశాల జాబితాలో గతంలో పాలస్తీనా, ఇరాన్‌, సిరియా, యెమెన్‌, నైజీరియా, తాజాగా వెనెజువెలా ఉన్నాయి. మదురో, ఆయన భార్య విపత్కర పరిస్థితికి మనం ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చకపోవచ్చు కానీ, సామ్రాజ్యవాదం పునర్విజృంభణ, జాతుల సార్వభౌమత్వం సమసిపోయే సంకటం ప్రపంచానికి వాటిల్లినందుకు మనం దుఃఖించాలి.

పి. చిదంబరం

Updated Date - Jan 10 , 2026 | 03:58 AM