Share News

ఘనమైన పర్యటన

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:47 AM

చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన సందర్భంగా ఉభయదేశాలు ఏమి సాధించాయన్నది అటుంచితే, డోనాల్డ్‌ ట్రంప్‌ చూపిన ఆత్మీయత, ప్రదర్శించిన ఆ గౌరవం జిన్‌పింగ్‌ను కచ్చితంగా ఆశ్చర్యపరిచివుంటాయి.

ఘనమైన పర్యటన

చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన సందర్భంగా ఉభయదేశాలు ఏమి సాధించాయన్నది అటుంచితే, డోనాల్డ్‌ ట్రంప్‌ చూపిన ఆత్మీయత, ప్రదర్శించిన ఆ గౌరవం జిన్‌పింగ్‌ను కచ్చితంగా ఆశ్చర్యపరిచివుంటాయి. తనకు గిట్టని విదేశీ అతిథులతో కఠినంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే ట్రంప్‌లో ఇంత మార్పేమిటంటూ మీడియా చానెళ్లు ఆశ్చర్యపోతున్నాయి. చైనా అధ్యక్షుడికి అమెరికాలో దక్కిన ఈ మహాగౌరవాన్ని కళ్ళారా చూస్తున్న రష్యా పుతిన్‌ కుళ్ళుకున్నారంటూ సోషల్‌ మీడియా జోకులు వేస్తోంది. ఈ పర్యటనను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచవాసులంతా ట్రంప్‌ ఎంతో పద్ధతిగా, బుద్ధిగా వ్యవహరించడం చూసి తెగ ఆశ్చర్యపోయారు.

నాలుగునెలల క్రితమే ట్రంప్‌ బీజింగ్‌ వెళ్ళివచ్చారు కనుక, ఇంతవెంటనే జిన్‌పింగ్‌ అమెరికాలో కాలూనడం విశేషమే. ఉభయదేశాల మధ్య సత్సంబంధాలకంటే, ప్రపంచంలో రెండు శక్తిమంతమైన దేశాల మధ్య వైషమ్యాలు మరింత పెచ్చరిల్లకుండా చూడటానికి ఈ రాకపోకలు ఉపకరిస్తాయన్నది విశ్లేషకుల అశాభావం. ఇదే ఏడాది ట్రంప్‌ను మరోమారు కలుసుకోవాలని తాను కోరుకుంటున్నానంటూ నవంబరులో చైనాలో జరగబోతున్న ఆసియా–పసిఫిక్‌ ఆర్థికసహకార సదస్సుకు ట్రంప్‌, మెలానియాలను జిన్‌పింగ్‌ ఆహ్వానించడం, తప్పవస్తాం, మరింత మాట్లాడుకుందామని ట్రంప్‌ అనడం బాగుంది. డెమోక్రాట్లను కమ్యూనిస్టులుగా చిత్రీకరిస్తూ ఇష్టంవచ్చినట్టు విమర్శలు చేసే ట్రంప్‌ ఈ పర్యటనలో జిన్‌పింగ్‌ను ఆకాశానికి ఎత్తేయడం చూడముచ్చటగా ఉంది. అమలులో ఉన్న సంప్రదాయానికి భిన్నంగా ట్రంప్‌ దంపతులు స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి వందడుగుల ఎర్రతివాచీ పరిచి మరీ జిన్‌పింగ్‌ దంపతులను స్వాగతించడం, కిందన సైనిక వందనాలు, పైన స్టెల్త్‌బాంబర్ల విన్యాసాలతో ఆ కార్యక్రమం ఘనంగా జరగడం చైనా మీడియాను ఆశ్చర్యపరిచింది.


ఇది బలప్రదర్శనా, గౌరవ సంకేతమా అని జిన్‌పింగ్‌ అనుమానించారో లేదో తెలియదు కానీ, నెత్తిన ఆ విమానం మోతలకు ట్రంప్‌ మొఖకవళికల్లో వచ్చిన మార్పు మాత్రం అమెరికా మీడియాకు బాగా చిక్కింది. తేనీటి విందులు, అమెరికా సర్వవ్యవస్థల అధిపతులు, టెక్నాలజీ రంగానికి చెందిన ప్రముఖులతో కలిపి ఏకంగా ఓ నూటయాభైమంది హాజరైన ఆ అద్భుతమైన డిన్నర్‌, జిన్‌పింగ్‌ దంపతులు వైట్‌హౌస్‌ అంతా కలయదిరగడం, మాజీ అధ్యక్షుల చిత్రాలు అలంకరించిన గ్యాలరీ గోడను చూపుతూ ట్రంప్‌ ఏదో చెప్పడం వంటివి అమెరికా మీడియాను కచ్చితంగా ఆశ్చర్యపరిచివుంటాయి. ఇక, ట్రంప్‌ పొగడ్తలకు అడ్డేలేదు. అందుకే కాబోలు, తమకు తెలిసిన ట్రంప్‌లో కనిపించిన ఈ మార్పును అది అసాధారణ విధేయత అంటోంది. వైట్‌హౌస్‌నుండి మూడు వార్తాసంస్థలను గెంటేసిన అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, ఆ సంస్థలకు తిరిగి తక్షణ ప్రవేశం కల్పిస్తూ ఫెడరల్‌ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడం కూడా ఇదే సమయంలో జరిగింది కనుక, పత్రికాస్వేచ్ఛలో చిట్టచివర ఉన్నందంటూ విమర్శలకు గురవుతున్న చైనా అధ్యక్షుడి దృష్టికి ఈ పరిణామం కూడా కచ్చితంగా వచ్చేవుంటుంది.


ఇద్దరు నాయకులు గంటన్నరపాటు శ్వేతసౌధంలో ఏకాంతంగా జరిపిన చర్చల్లో ఏమి మాట్లాడుకున్నారన్నది ఎలాగూ తెలియదు. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌, కొరియా గురించి మనసువిప్పుకున్నారని చైనా మీడియా అంటోంది. వైట్‌హౌస్‌ అధికారికంగా చెప్పింది తక్కువే కానీ, చెప్పనిది చాలా ఉన్నదంటూ, ఇరాన్‌ యుద్ధం జోలికి రావద్దని ట్రంప్‌ హెచ్చరించినట్లు పాశ్చాత్య మీడియా విశ్లేషిస్తోంది. అమెరికా–చైనా సంబంధాల్లో అతిపెద్ద సమస్య వాణిజ్యం. చైనా తమకు చేస్తున్న అన్యాయం వల్లనే భారీ వాణిజ్యలోటు పేరుకుందని, అమెరికన్లు 37లక్షల ఉద్యోగాలు కోల్పోయారని ట్రంప్‌ ఆరోపిస్తూంటారు. గత సంవత్సరం వరుస సుంకాలతో చైనాను మోది, ఒత్తిడి పెంచి, దారికి తెచ్చానని, ఆ లోటు తగ్గించానని ట్రంప్‌ గొప్పగా చెబుతూంటారు కూడా. అరుదైన లోహాల ఎగుమతుల నిషేధం సహా ట్రంప్‌ వాణిజ్యయుద్ధానికి చైనా చాలా రకాల ప్రతీకార చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

నాలుగునెలలక్రితం ఉభయదేశాధినేతల మధ్యా జరిగిన శిఖరాగ్ర సమావేశం ప్రతిష్ఠంభనకు గురైంది కనుక, ఇప్పుడు చాలా రంగాల్లో చర్చలు సాగి, అడుగులు వడివడిగా పడతాయని జిన్‌పింగ్‌ పర్యటనకు ముందు విశ్లేషకులు భావించారు. అయితే, ఈ పర్యటనలో ఆ రకమైన పురోగతికంటే, ఆడంబరాలు, అట్టహాసాలకే అధిక ప్రాధాన్యం దక్కింది. అమెరికా–చైనా సంబంధాల్లో క్లిష్టమైన సమస్యలన్నీ పక్కకు పోయి, రెండు జెయింట్‌ పాండాలు చైనానుంచి అట్లాంటా జూకు తరలడం వినా, ఉభయదేశాలు సాధించిందేమీ లేదని వారి బాధ.

Updated Date - Sep 26 , 2026 | 12:51 AM