Share News

ట్రంప్‌ మాట వినేదెవరు?

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:41 AM

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైన మలుపు తీసుకుంది. పరిమిత లక్ష్యాల స్థానే వైరి పక్షం ఆర్థిక మూలాల ధ్వంసం జరుగుతోంది. అది ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను, ఆర్థికాన్ని, ప్రగతిని దారుణంగా దెబ్బ తీసే స్థితికి చేరుకుంది.

ట్రంప్‌ మాట వినేదెవరు?

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైన మలుపు తీసుకుంది. పరిమిత లక్ష్యాల స్థానే వైరి పక్షం ఆర్థిక మూలాల ధ్వంసం జరుగుతోంది. అది ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను, ఆర్థికాన్ని, ప్రగతిని దారుణంగా దెబ్బ తీసే స్థితికి చేరుకుంది. ఇంతవరకూ ఒక స్థాయిలో సహజవాయువులు, పెట్రో ఉత్పత్తుల సరఫరా దెబ్బతీసేలా దాడులు జరిగాయి. కానీ నిన్న ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్‌లో పెద్ద సహజవాయు క్షేత్రం సౌత్‌ పార్స్‌పై బాంబులు కురిపించాయి, ఉత్పత్తిని కూడా దెబ్బతీసేలా. ప్రతిగా ఖతర్‌లో పెద్ద సహజవాయు క్షేత్రం రస్‌ లఫాన్‌పై ఇరాన్ దాడి చేసింది. సౌదీలో కూడా కొన్ని ఇంధన ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేసింది. ఇప్పుడు సరఫరాలో అవాంతరాలే కాకుండా అసలు ఇంధన ఉత్పత్తే తగ్గి పోతుంది.

భారత్ సహజ వాయువు అవసరాల్లో అధిక భాగం ఖతర్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడా దారి మూసుకుపోతే తీరని నష్టం. ఇరాన్ సహజవాయు క్షేత్రం దెబ్బ తింటే కూడా ఇలాంటి దుస్థితే. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే (ఒక్క నెలలోనే) భారీగా పెరిగాయి. ఉత్పత్తి కూడా నిలిచిపోతే మరింతగా పెరుగుతాయి. అందుకనే ట్రంప్ మాట మార్చారు... సౌత్‌ పార్స్‌పై ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టు తమకు తెలియదని.. ఇకపై అలా జరగదని, ఒకవేళ ఇరాన్ అలాంటి దాడులకు పాల్పడితే సహించబోమని. అయితే ఆయన మాట వినే పరిస్థితి ఉందా? ఇజ్రాయెల్ ఆ తరహా దాడులు చెయ్యకపోయినా, ఇరాన్ ఆపుతుందా? ఇప్పటికైనా ప్రపంచ దేశాలు దౌత్యపరంగా పరిష్కారం వెదకాలి.

– డా. డి.వి.జి. శంకరరావు

Updated Date - Mar 21 , 2026 | 03:43 AM