సుంకాల సునామీ
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:23 AM
ఉభయసభలను డెమోక్రాట్లు స్వాధీనం చేసుకున్నంతమాత్రాన తాను వెనకడుగు వేయబోనని ప్రపంచాన్ని హెచ్చరించడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు సుంకాల అస్త్రాన్ని తీశారు.
ఉభయసభలను డెమోక్రాట్లు స్వాధీనం చేసుకున్నంతమాత్రాన తాను వెనకడుగు వేయబోనని ప్రపంచాన్ని హెచ్చరించడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు సుంకాల అస్త్రాన్ని తీశారు. భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ సహా 14 వాణిజ్య భాగస్వాములమీద కొత్త దిగుమతి సుంకాలను ప్రకటించారు. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదంటూ గతంలో ట్రంప్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, 1974నాటి అమెరికా వాణిజ్యచట్టంలోని సెక్షన్ 301కి లోబడి ఈ వాణిజ్యయుద్ధం మొదలైంది. అయితే, గతంలో మాదిరిగా లిబరేషన్ డే అంటూ ఈ మారు పెద్ద హంగామా ఏమీ చేయకపోవడం విశేషం.
వచ్చే ఏడాది జనవరిలో కొత్త కాంగ్రెస్ సమావేశమైనప్పుడు అధ్యక్షుడి సుంకాల అధికారానికి కళ్ళెం వేయడానికి డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా సిద్ధపడుతున్నారని విశ్లేషణలు వెలువడుతున్న తరుణంలో ఈ నిర్ణయం జరిగింది. గత ఏడాది దక్షిణకొరియాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ చేసుకున్న ఒప్పందం జనవరి 10న ముగిసిపోబోతున్నందున వచ్చేనెలలో ఇద్దరిమధ్యా భేటీలో పైచేయి సాధించడానికీ, ఒత్తిడిపెంచడానికీ అమెరికా ఈ సుంకాల అస్త్రాన్ని ప్రయోగించిందని అంటున్నారు. అరుదైన ఖనిజాల సరఫరా పెంచి తన టెక్‌రంగాన్ని బలోపేతం చేయాలనీ, మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు కొనాలని చైనామీద అమెరికా ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఆ గొడవను అటుంచితే, వియత్నాం తరువాత అత్యధికంగా సుంకాన్ని ప్రతిపాదించింది భారత్‌మీదే. ఒకవేళ అన్ని దశలూ దాటి చిట్టచివరకు ఆ 25శాతం సుంకమే అమలైనపక్షంలో బంగ్లాదేశ్, వియత్నాం, చైనా వంటి పోటీదేశాల కంటే భారతీయ ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్‌లో ఎక్కువగా ఉంటూ అంతిమంగా ఎగుమతులు బాగా పడిపోతాయి. అంతలోగానే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకుంటే రిబేటు దక్కి 17శాతమే అమలవుతుంది కనుక, ఆసియాలోని మిగతా పోటీదేశాలకంటే భారత్‌కు స్వల్ప ప్రయోజనం చేకూరుతుంది.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదని అమెరికా అధ్యక్షుడే ఇటీవల పలుమార్లు అన్నారు. భారత్ దానిని కాదనడం లేదు కానీ, కొన్ని రంగాలు, ఉత్పత్తుల విషయంలో ఉభయదేశాల మధ్యా వివాదం తెగనిమాట నిజం. ఆ మేరకు ఒత్తిడి పెంచేందుకే అమెరికా వాణిజ్య ప్రతినిధి (యుఎస్‌టీఆర్) కార్యాలయం ఈ సరికొత్త సుంకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది కనుక, తాము వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ఖరారుచేయడానికి కట్టుబడివున్నామని భారత్ ఓ మర్యాదమాట అంటూనే యుఎస్‌టీఆర్ ఆరోపణలను తిప్పికొట్టింది. భారత్ తన దేశీయ అవసరాలకు మించి వస్తువులను ఉత్పత్తిచేస్తూ, తన చవుకైన మిగులు ఉత్పత్తితో అమెరికా పరిశ్రమలను దెబ్బతీస్తున్నదనీ, భారత్ అమలు చేస్తున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు, అది తమ కంపెనీలకు ఇస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు మార్కెట్ పోటీని దెబ్బతీస్తున్నాయని యుఎస్‌టీఆర్ ప్రధాన ఆరోపణ. తన ప్రయోజనాల పరిరక్షణకోసం మాత్రమే అమెరికా స్వేచ్ఛా మార్కెట్ గురించి మాట్లాడుతూంటుంది. భారత పారిశ్రామిక విధానాలు, తయారీ రంగ విస్తరణలు, కార్మిక రక్షణలు ఇత్యాదివన్నింటినీ అది తప్పుబడుతోంది. దేశం ఒకప్పుడు ఎంతో గర్వంగా చెప్పుకొనే మేడిన్ ఇండియా మోదీ ఏలుబడిలో మేకిన్ ఇండియాకు పరిమితమైపోయిందని స్వదేశంలో ఎంతోమంది విమర్శిస్తూంటే, అమెరికా దీనిని తనకు నష్టం కలిగించే పథకంగా పేర్కొనడం మన పాలకులకు లోలోపల సంతోషం కలిగించివుంటుంది.
ఈ ఏడాది ఆరంభం నాటికే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలిదశ ముసాయిదా తయారైన విషయం తెలిసిందే. అయితే, అమెరికా సుంకాల విధానంలో ఎడాపెడా జరుగుతున్న మార్పులు ఈ వ్యవహారాన్ని తెగనివ్వకుండా చేస్తున్నాయి. యుఎస్‌టీఆర్ ప్రతిపాదనలు ఇంకా అనేక దశలు దాటాల్సి ఉన్నప్పటికీ, వాణిజ్య ఒప్పందానికి దిగిరానిపక్షంలో చేటు తప్పదని భారత్‌ను హెచ్చరిస్తోంది. ఏవో కొన్ని రంగాలకు మినహాయింపులు ఉన్నప్పటికీ శ్రామికశక్తి అధికంగా ఉన్న రంగాలకు పాతికశాతం సుంకం శరాఘాతమే. పదిహేడు శాతం తగ్గింపు రేటుతో బయటపడాలంటే వ్యవసాయం, డెయిరీ సహా పలు అమెరికన్ ఉత్పత్తులకు భారత్ తలుపులు తెరవాలి, దిగుమతి సుంకాలు తగ్గించాలి. రైతులు, చిన్న పరిశ్రమలు సహా పలురంగాలను కాపాడుకుంటూనే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం మనకో పరీక్ష, కత్తిమీద సాము.