Share News

నవ్విపోదురుగాక...!

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:42 AM

ఇంత నిస్సిగ్గుతనం ఎక్కడైనా ఉందా? తన స్వార్థం కోసం అమెరికా అధ్యక్షుడు ఎంతకైనా దిగజారుతారని, దేశ పరువు ప్రతిష్ఠలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడరనడానికి మరో దృష్టాంతం ఇది.

నవ్విపోదురుగాక...!

ఇంత నిస్సిగ్గుతనం ఎక్కడైనా ఉందా? తన స్వార్థం కోసం అమెరికా అధ్యక్షుడు ఎంతకైనా దిగజారుతారని, దేశ పరువు ప్రతిష్ఠలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడరనడానికి మరో దృష్టాంతం ఇది. అమెరికా సెనేట్‌, ప్రతినిధుల సభలో మూడోవంతు స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, తనకున్న ఆ స్వల్పమెజారిటీని నిలబెట్టుకోవడానికి ఇప్పుడాయన ఏకంగా శత్రుదేశంతో చేయి కలిపారు. రష్యాతో డీజిల్‌ దిగుమతి ఒప్పందం చేసుకోవడంతో పాటు, రష్యా ఇంధనరంగం మీద ఉక్రెయిన్‌ తన దాడులను తక్షణమే నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. రష్యా కూడా సానుకూలంగా స్పందించిందనీ, ఉభయదేశాలూ ఇందుకు అంగీకరించాయని ట్రంప్‌ నిర్ధారించారు. ఈ విషయంలో ఏ మాత్రం కట్టుతప్పినా, అమెరికానుంచి ఏ సహాయాలూ, రక్షణలూ దక్కవని జెలెన్‌స్కీని ట్రంప్‌ బెదిరిస్తున్నారట.


రష్యానుంచి ఎన్నిలక్షల టన్నుల డీజిల్‌ అమెరికాకు ఎన్ని విడతల్లో ఎప్పుడెప్పుడు చేరుతుంది, అది అమెరికా అవసరాలను ఎంతమేరకు తీర్చగలదన్న వివరాలను అటుంచితే, ఈ ఒప్పందం గురించి ట్రంప్‌ ప్రకటించగానే అమెరికాలో డీజిల్‌ ధరలు అరశాతం మేరకు తగ్గాయట. రష్యానుంచి భారీగా డీజిల్‌ దిగుమతి అయి ధరలు చల్లబడతాయన్న సందేశాన్ని ఆయన ఈ చర్య ద్వారా తన మీద గుర్రుగా ఉన్న రైతులు, ట్రక్కు యజమానులకు ఇవ్వగలిగారు. రష్యన్‌ డీజిల్‌ ఎగుమతులమీద ఆంక్షలు ఎత్తివేయడం ద్వారా తన ఓట్లు దెబ్బతినకుండా చూసుకోవడంతో పాటు, ప్రపంచమార్కెట్లను కూడా కాపాడినట్టు ఆయన చెప్పుకోవచ్చు. డీజిల్‌ ఎగుమతుల మీద జూలై నుంచి అమల్లో ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్టు రష్యా కూడా ప్రకటించింది. పుతిన్‌తో నేరుగా మాట్లాడి ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్న ట్రంప్‌, మళ్ళీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని తిట్టిపోయడం మొదలుపెట్టారు. రష్యా రిఫైనరీలపై దాడులు చేస్తూ, అమెరికాలో డీజిల్‌ కొరతకు కారణమవుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని ఎన్నికల్లో ఓడించాలంటూ ఉక్రెనియన్లకు ట్రంప్‌ పిలుపునిచ్చారు. మాస్కోతో ఒప్పందం కుదర్చుకోవడానికి అనేక అవకాశాలున్నా జెలెన్‌స్కీ ఉద్దేశపూర్వకంగా జారవిడిచారనీ, అందువల్ల వెంటనే అక్కడ ఎన్నికలు జరపాలని, రష్యాతో రాజీపడగల కొత్తనాయకుడిని ఎన్నుకోవాలని ట్రంప్‌ సలహా. నాలుగేళ్ళుగా యుద్ధం పేరిట ఎన్నికలు వాయిదావేస్తున్న జెలెన్‌స్కీని ఉక్రెయిన్‌ నేతగా గుర్తించడానికి నిరాకరిస్తూ, ఆయనతో చర్చలు జరిపే ప్రసక్తిలేదని వ్లాదిమిర్‌ పుతిన్‌ చేస్తున్న వాదననే ట్రంప్‌ ఇలా ఎత్తిపట్టారని అర్థం. రష్యా, అమెరికా అధ్యక్షులకు ఉక్రెయిన్‌ ఎన్నికలమీద అంతపట్టింపు ఉంటే ఓ రెండునెలలు కాల్పుల విరమణ అమలయ్యేట్టు చూడాలని జెలెన్‌స్కీ అంటున్నారు. ఇంధన వ్యవస్థలమీద దాడులు తక్షణమే ఆగినట్టు ట్రంప్‌ ప్రకటించిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్‌లోని పలు విద్యుత్‌ స్థావరాలపైన రష్యా దాడులు జరిపినప్పటికీ ట్రంప్‌ ఆ ఊసెత్తడం లేదని జెలెన్‌స్కీ బాధ.


ప్రధానంగా, ఇరాన్‌తో తాను చేస్తున్న యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే, ఉక్రెయిన్‌ను నిందిస్తూ, రష్యాతో ఒప్పందం చేసుకోవడం ట్రంప్‌ అతితెలివికి నిదర్శనం. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఉభయసభల్లో ఉన్న ఆ కాస్త మెజారిటీని కోల్పోతారని, ఒకసభలోనైనా డెమోక్రాట్లకు ఆధిక్యం తథ్యమని అంచనాలున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ విన్యాసానికి తెగించారు. రష్యానుంచి చమురు కొనుగోలుచేస్తున్న దేశాలను ఆయన ఇంతకాలం ఎన్నేసిమాటలన్నారో, ప్రతీకార సుంకాలతో ఎంత వేధించారో చూశాం. యుద్ధపిపాసి పుతిన్‌ను ఆర్థికంగా నిలబెడుతూ, రష్యన్‌ యుద్ధయంత్రాంగానికి కందెనలు పూ‍స్తూ ఉక్రెయిన్‌మీద మరింత విరుచుకుపడటానికి భారత్‌ సాయపడుతోందంటూ ఆడిపోసుకున్నారు, కక్షసాధించారు. రష్యా, ఇరాన్‌లనుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ప్రయోగించడానికి ఆయన మరో బ్రహ్మాస్త్రాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. రష్యాను శిక్షించేందుకు, దానినుంచి చమురుకొంటున్న దేశాలమీద వందశాతం సుంకాలతో మెడలు వంచేందుకు ఉద్దేశించిన లిండ్సే గ్రాహం చట్టం మీద తాను చేసిన సంతకం తడి ఆరకముందే ట్రంప్‌ మడమ తిప్పేశారు, నవ్విపోదురుగాక... అని తేల్చేశారు.

Updated Date - Oct 13 , 2026 | 12:47 AM