ట్రంప్, మోదీ మధ్య పోలికలన్నీ పైపైనే!
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:41 AM
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అక్కడి రిపబ్లికన్ పార్టీకి అనూహ్య ఓటమి ఎదురుకావటం చూసి ప్రపంచవ్యాప్తంగా లిబరల్స్ చాలా సంతోషంగా ఉన్నారు. వారే కాదు, ట్రంప్ పాలన ప్రపంచవ్యాప్తంగా ఎంత గందరగోళాన్ని సృష్టించిందో చూసి ఆందోళన చెందినవారంతా..
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అక్కడి రిపబ్లికన్ పార్టీకి అనూహ్య ఓటమి ఎదురుకావటం చూసి ప్రపంచవ్యాప్తంగా లిబరల్స్ చాలా సంతోషంగా ఉన్నారు. వారే కాదు, ట్రంప్ పాలన ప్రపంచవ్యాప్తంగా ఎంత గందరగోళాన్ని సృష్టించిందో చూసి ఆందోళన చెందినవారంతా ఈ ఫలితాలను చూసి సంతోషించారు. ప్రపంచమంతా ఎందుకు ఇంత ఊరట చెందిందో అర్థం చేసుకోవడం సులువే.
మనలో చాలామంది అమెరికాను, దాని రాజకీయ వ్యవస్థను చాలా కట్టుదిట్టమైనదని భావిస్తూ పెరిగారు. మా యూనివర్సిటీలో కూడా అమెరికా రాజకీయ వ్యవస్థ గురించి అలాగే బోధించారు. అమెరికాలో వ్యవస్థల మధ్య పరస్పర నియంత్రణ చాలా బలంగా ఉంటుందనీ, అందుకే ఎవరో ఒక వ్యక్తి దూకుడు వల్ల మొత్తం వ్యవస్థ తడబడే అవకాశం లేదనీ మాకు చెప్పారు. ఆ దేశంలో ప్రతి నిర్ణయం వెనుకా అందరి ఏకాభిప్రాయమూ ఉండటమన్నది తప్పనిసరి అన్నారు. కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆ భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. తన దేశం ఏ ఆదర్శాల మీద నిలబడిందో వాటి పట్ల ఏ ఖాతరూ లేని ఒక బలమైన నాయకుడు తల్చుకుంటే వ్యవస్థల మధ్య పరస్పర నియంత్రణను సులభంగా రద్దు చేయగలడు, సుప్రీంకోర్టు నుంచి మద్దతు కూడగట్టుకోగలడు, చట్టసభలను చెప్పుచేతల్లో పెట్టుకుని నడిపించగలడు, మీడియాను బెదరగొట్టగలడు, మైనారిటీలను పీడించగలడు, కుబేరులైన దోస్తులకు మరింత దోచిపెట్టగలడు, కీలక నిర్ణయాల వెనుక ఏకాభిప్రాయం ఉండాలన్న సూత్రాన్నే అపహాస్యం చేయగలడు.
భారత్ విషయానికొస్తే– ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థపై మనకు ఆ మాత్రం భ్రమలు కూడా లేవు. ఇక్కడ ఒక బలమైన నాయకుడు తల్చుకుంటే చాలా సులభంగా రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయగలడని మనకు తెలుసు. ఇందిరాగాంధీ ఆ పని చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ కూడా, ఏకాభిప్రాయ సూత్రాన్ని లెక్కచేయకుండా, ప్రజాస్వామ్య గత ఆనవాయితీలను పట్టించుకోకుండా, ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయగలుగుతున్నారు.
ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలినందుకు భారత్‌లో కొందరు ఆలోచనాపరులు సంతోషించారంటే దానికి కారణం– అమెరికా పరిణామాలను మన దేశ పరిస్థితులకు అన్వయించుకున్నప్పుడు వారిలో చిగురించిన ఆశే! ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన ట్రంప్ లాంటి వ్యక్తికే ఎదురుదెబ్బ తగిలిందంటే, మరి మన దేశ నాయకత్వం పరిస్థితి ఏమిటి? ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉందా? అన్నది వారి ఆలోచన. క్లుప్తంగా చెప్పాలంటే, అవును, జరిగే అవకాశం ఉంది. అయితే అమెరికా, భారతదేశాల మధ్య పోలికల గురించి మనం అతిగా ఊహించుకోకూడదు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ముఖ్యమైన తేడాలు కూడా ఉన్నాయి.
ముందు పోలికల గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ గెలిచిన డెమొక్రటిక్ అభ్యర్థులు చేసిన ప్రసంగాలను వింటే, అవి మనకు ఎంతోకొంత ఈ దేశంలోని పరిస్థితిని గుర్తుచేయక మానవు. ఉదాహరణకు, మిషిగన్ నుంచి కొత్తగా ఎన్నికైన 42 ఏళ్ల సెనేటర్ అబ్దుల్ ఎల్ సయెద్– తన ప్రత్యర్థులు ఇస్లాంను ఒక దుష్ట మతంగా చిత్రీకరించారనీ, ముస్లింలపై వ్యతిరేకత తీసుకురావటం ద్వారా తనను ఓడించాలని చూసారనీ చెప్పారు. సెనేటర్‌గా ఎన్నికైన 37 ఏళ్ల జేమ్స్ తలారికో మన రాహుల్‌గాంధీని గుర్తు తెస్తూ, విభజన రాజకీయాల స్థానంలో ప్రేమతో కూడిన రాజకీయాలను తేవాలని పిలుపునిచ్చారు. అలాగే, 39 ఏళ్ల సెనేటర్ జాన్ ఒసాఫ్ తన ప్రసంగంలో– ఒకపక్క ప్రజలంతా పేదరికంలోకి కూరుకుపోతుంటే మరింత డబ్బు కూడబెడుతున్న కుబేరులను తీవ్రంగా విమర్శించారు. ఇవన్నీ మనకు ఇక్కడి పరిస్థితినే తలపిస్తాయి. అయితే గమనించాల్సిన అంశం ఒకటుంది. రిపబ్లికన్లు ఓడిపోవటానికి కారణం సమాజంలో చీలికలు తెచ్చిన ట్రంప్ విధానాలో, అతను మైనారిటీల పట్ల వెళ్లగక్కిన విద్వేషమో కాదు. అమెరికన్లకు నిజంగానే అలాంటి ధోరణి నచ్చకపోతే, వారు అసలు ట్రంప్‌ను ఎన్నుకునేవారే కాదు.
రిపబ్లికన్ల ఓటమికి ప్రధాన కారణం అక్కడి ద్రవ్యోల్బణం (Inflation) అని ఎన్నికల సర్వేలు చెప్తున్నాయి. అలాగే అమెరికా ఇరాన్‌తో చేస్తున్న ఎప్పటికీ గెలవలేని యుద్ధం కూడా మరో కారణం. అలాగే ప్రపంచంలోని పలు దేశాలపై ట్రంప్ విధించిన అర్థంపర్థంలేని సుంకాలు కూడా ద్రవ్యోల్బణ పరిణామాలకు దారితీశాయి. అక్కడ ఫలితాలను ప్రభావితం చేసిన కీలకమైన అంశాలు ఇవే. ఈ విషయాల్లో మన దేశం పరిస్థితి పూర్తిగా వేరు. మన దేశంలో ద్రవ్యోల్బణం ఇంకా అంతటి పెద్ద సమస్యగా మారలేదు. కుబేరుల ఆధిపత్యంపై ఇక్కడ కొంత అసంతృప్తి ఉన్న మాట నిజమే కానీ, అది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి ఇంకా వెళ్లలేదు. అలాగే మనం అమెరికా వలే గెలవలేని యుద్ధాలేమీ చేయడం లేదు.
ట్రంప్–మోదీల స్వభావాల్లో కూడా స్పష్టమైన తేడాలున్నాయి. ట్రంప్ విపరీతమైన అధికార మదంతో, అతిశయించిన స్వీయమోహంతో, చపలచిత్తంగా వ్యవహరించే ఒక విచిత్రమైన వ్యక్తి. మోదీ మాత్రం తెలివిగా ఆలోచిస్తారు, ఆచితూచి అడుగులు వేస్తారు, దీర్ఘకాలిక వ్యూహాలు పన్నుతారు. ఆయన పాలనకు వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో ఆయన రాజకీయ కౌశలం కొంత మసకబారినట్టు కనిపిస్తే కనిపించవచ్చు. అయినప్పటికీ, మోదీ అత్యంత ప్రతికూలతల మధ్య కూడా ట్రంప్ కంటే వెయ్యిరెట్లు తెలివిగా వ్యవహరించగలరు.
ఉదాహరణకు, మధ్యంతర ఎన్నికల్లో తన పార్టీకి ఎలాంటి ఘోర పరాజయం ఎదురుకాబోతోందో గ్రహించడానికి ట్రంప్‌కి చాలా సమయం పట్టింది. కానీ మన దేశంలో మోదీ మాత్రం వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి నెలల ముందుగానే ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ఆ పదవిలో కొనసాగించడానికి ఆయన ఇంత గట్టిగా ప్రయత్నించడానికి ఒక కారణం ఇదే.
ట్రంప్, మోదీల మధ్య తేడాను చూపించేవి మరో రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, ట్రంప్ ఎంత బెదిరింపుల వాతావరణాన్ని సృష్టించినప్పటికీ, అమెరికాలో ఇప్పటికీ నిజాలను వెల్లడించే ప్రధాన స్రవంతి వార్తా సంస్థలు సరిపడినన్ని ఉన్నాయి. కానీ మన దేశంలో దాదాపు ప్రధాన స్రవంతి మీడియా అంతా ప్రభుత్వానికి భయపడుతున్నది. ఇది ముఖ్యమైన తేడా. ఎందుకంటే, సరైన సమాచారం లేని ఓటర్లు ఎన్నికల సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు.
ఇక రెండు దేశాల మధ్య ఎన్నికల గణాంకాల వైవిధ్యాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. కమలా హారిస్‌పై గెలిచినప్పుడు ట్రంప్‌కు 49.8శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం అమెరికాలో అత్యంత ప్రజాదరణ కోల్పోయిన అధ్యక్షుల్లో ఒకరైనప్పటికీ, ట్రంప్‌కు ఇప్పటికీ 34–35 శాతం మంది ఓటర్ల బలమైన మద్దతు ఉంది. అమెరికా ఎన్నికల లెక్కల్లో దాదాపు 50శాతం నుంచి ఇలా 34 శాతానికి పడిపోవడమన్నది చాలా పెద్ద క్షీణత. కానీ భారతదేశం లాంటి బహుళపార్టీ వ్యవస్థలో గెలుపునకు అవసరమైన ఓట్ల శాతం పూర్తిగా భిన్నం. మోదీకి ప్రజాదరణ గురించి ఎంత గొప్పలు పోయినా, బీజేపీకి సాధారణంగా 37–38శాతానికి మించి ఓట్లు రావు. అయినప్పటికీ, దాని ఓట్లు కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో, కేంద్రీకృతమై ఉండటంతో, మెజారిటీ లేదా దానికి చేరువలో స్థానాలను గెలుచుకుంటోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనైతే ఓటమికి దారితీసే 35శాతం ఓట్లే బీజేపీకి వచ్చినప్పటికీ, ఆ పార్టీ మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఆ విధంగా అమెరికా ఎన్నికల వ్యవస్థతో పోలిస్తే మన ఎన్నికల వ్యవస్థ చాలా భిన్నం. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన ఓట్ల శాతం చాలా తక్కువ. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే మోదీ ప్రజాదరణ ఇప్పుడు తగ్గి ఉండవచ్చు. కానీ అది మరీ ఘోరంగా తగ్గితే తప్ప బీజేపీ ఓట్ల శాతం 30శాతం దాకా పడిపోయే అవకాశం లేదు. ఆ స్థాయికి పడిపోతేనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.
అందుకే, ట్రంప్‌తో పోల్చినప్పుడు బీజేపీకి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి (జ్ఞానేశ్ కుమార్ ఉన్నా లేకపోయినా). ప్రభుత్వంపై వ్యతిరేకతను మోదీ అధిగమించగలరని పైన చెప్పిన ఎన్నికల గణాంకాలే సూచిస్తున్నాయి. అయితే, వచ్చే రెండేళ్లలో పరిస్థితులు మరింత దిగజారితే మాత్రం లెక్కలు మారవచ్చు. ఆ అవకాశాన్ని కొట్టిపారేయలేం.
- వీర్ సంఘ్వి
సీనియర్ జర్నలిస్ట్
(‘ది ప్రింట్’ సౌజన్యంతో)